‘ఆహార భద్రత’పై అయోమయం! | Sakshi
Sakshi News home page

‘ఆహార భద్రత’పై అయోమయం!

Published Sun, Dec 21 2014 12:06 AM

‘ఆహార భద్రత’పై అయోమయం! - Sakshi

జనవరి నుంచే అమలుకానున్న పథకం
ఇంకా పూర్తికాని దరఖాస్తుల పరిశీలన
తేలని లబ్ధిదారుల సంఖ్య
సర్వేలో తలమునకలైన యంత్రాంగం
ముందుగా గ్రామీణంలో అమలుకు యోచన

 సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఆహార భద్రత దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జిల్లా యంత్రాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పరిశీలనకు నిర్దేశించిన గడువు ముగిసినప్పటికీ కేవలం 78శాతం మాత్రమే పురోగతి ఉండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రత పథకానికి 13.67లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గ్రామీణ మండలాలు, మున్సిపాలిటీల నుంచి 6,72,767 దరఖాస్తులు రాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి 6,94,605 దరఖాస్తులు వచ్చా యి. అయితే వీటిలో శనివారం నాటికి 10.66 లక్షల దరఖాస్తులనే పరిశీలించిన అధికారులు దాదాపు ఏడు లక్షల దరఖాస్తులను అర్హులుగా తేల్చారు.
 
ముగిసిన గడువు..
జనవరి నుంచి ఆహార భద్రత పథకాన్ని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో డిసెంబర్ 15వ తేదీ నాటికి దరఖాస్తులు పరిశీలించి అర్హతను నిర్ధారించాలని, లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఆహార భద్రత కార్డులు అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 78శాతం మాత్రమే దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. గ్రామీణ ప్రాంతంలో దరఖాస్తుల పరిశీలన దాదాపు పూర్తికాగా, పట్టణ ప్రాంతంలో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. సిబ్బంది కొరతతో తొలుత పరిశీలన ప్రక్రి య నత్తనడకన సాగినప్పటికీ.. గ్రామీణ ప్రాంతానికి ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి డెప్యూట్ చేయడంతో ప్రస్తుతం పరిశీలన కొంత వేగం పుం జుకుంది. కానీ సర్కారు నిర్దేశించిన గడువు ముగి యడంతో అధికారులు అయోమయంలో పడ్డారు.
 
గ్రామీణ ప్రాంతంతో మొదలుపెడితే..
ఫిబ్రవరి నుంచి బడ్జెట్ సమావేశాలుండడంతో జనవరి నుంచే పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాలో పరిశీలన ప్రక్రియ పూర్తికానందున.. ముందుగా గ్రామీణ ప్రాంతంలో పథకాన్ని అమలు చేసి.. తర్వాత పట్టణ ప్రాంతంలో పథకం అమలును విస్తరించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
25వ తేదీ నాటికి కీ రిజిస్టర్
సాధారణంగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల వివరాలను కీ రిజిస్టర్‌లో పొందుపర్చిన అనంతరం ఆ మేరకు రేషన్ కోటా విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ అంతా 20వ తేదీలోపు పూర్తవుతుంది. కానీ ఈ సారి ఆహారభద్రత పథకం అమలు నేపథ్యంలో కీ రిజిస్టర్ల తయారీని 25వ తేదీకి పొడిగించారు. ఒకట్రెండు రోజుల్లో జిల్లాలోని పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించిన తర్వాత.. అక్కడినుంచి వచ్చే స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.

Advertisement
Advertisement