అందరి చూపు.. కేబినెట్‌ వైపు

Telangana Assembly Elections Medak Politics - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  ముందస్తుకు ముహూర్తం ఖరారు చేశారనే ప్రచారం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గురువారం జరుగనున్న రాష్ట్ర కేబినెట్‌ భేటీలో తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. శాసనసభను రద్దు కోరుతూ తీర్మానం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఎవరి నోట విన్నా ఇదే అంశంపై చర్చ సాగుతోంది. మరోవైపు అసెంబ్లీ రద్దు సంకేతాలు శాసనసభ్యుల్లో బీపీని పెంచుతున్నాయి. మరో 8 నెలల గడువు మిగిలి ఉండగానే.. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటున్నారనే ప్రచారం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌ పనులను పూర్తి చేయించుకునేందుకు ఎమ్మెల్యేలందరూ సచివాలయం బాట పట్టారు. ఒకవేళ నేడు కీలక నిర్ణయం తీసుకుంటే మాజీలుగా పనులు చేయించుకోలేమనే అయోమయం వారిలో కనిపిస్తోంది. ఇదిలావుండగా, ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారనే సంకేతాలతో వివిధ పార్టీల ఆశావహులు కూడా గురువారం జరిగే కేబినెట్‌ భేటీని ఆసక్తిగా గమనిస్తున్నారు.

గత నెల 13న ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో జరిగే సమావేశంలో పాల్గొన్న అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలేకర్ల సమావేశం నిర్వహించి గడువు కంటే ముందుగానే ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 2న ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో ‘ప్రగతి నివేదన సభ’ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ రోజు ఎన్నికలపై నిర్ణయం ప్రకటించనప్పటికీ, త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకుంటానని లీకు ఇచ్చారు. దీంతో ముందస్తుకు ముహూర్తం ఖరారైందనే ప్రచారం ఊపందుకుంది. ఈ మేరకు తేదీ, సమయం కూడా ఫిక్స్‌ చేశారనే వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే గురువారం తుది కేబినెట్‌ సమావేశం జరుగుతుందని, దీంట్లో శాసనసభ రద్దు తీర్మానాన్ని ఆమోదించే అవకాశముందనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top