రెవెన్యూ చిక్కులు!

Tehsildar burnt alive in Hyderabad - Sakshi

చర్చనీయాంశమవుతున్న వరుస ఘటనలు

విజయారెడ్డి సజీవ దహనంతో సిబ్బంది ఆందోళన బాట

సాంకేతిక సమస్యలు, పనిభారంతో సతమతం

సాక్షి, హైదరాబాద్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి దారుణ హత్య, తదనంతర పరిణామాలు కలకలం సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లో పట్టపగలే ఓ అధికారిణిని సజీవ దహనం చేయడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎన్నడూ లేని విధంగా 8 రోజుల పాటు విధులు బహిష్కరించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఉద్యోగుల భద్రత, సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో గత బుధవారం నుంచి విధులకు హాజరవుతున్నారు. ఏ శాఖపైనా లేనన్ని ఆరోపణలు రావడం, రెవెన్యూ వ్యవస్థపై ముఖ్యమంత్రే  అసంతృప్తి వ్యక్తం చేయడం, ఏసీబీకి చిక్కుతున్న అధికారుల్లోనూ ఈ శాఖకు చెందినవారే అధికంగా ఉండడం, రికార్డుల ప్రక్షాళన, ధరణి వెబ్‌సైట్‌ మొరాయింపు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల జారీలో జాప్యం, ఎడతెగని పార్ట్‌– బీ భూముల వివాదం రెవెన్యూ సిబ్బందికి అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

పనిభారం తడిసిమోపెడు
భూ పరిపాలతోపాటు ఇతర శాఖలకు సంబంధించిన పనుల్లోనూ రెవెన్యూ సిబ్బంది కీలకం. విద్యార్థుల కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల నుంచి ఓటరు జాబితా సవరణలు, ఆహార భద్రత, సంక్షేమ పథకాల అమలులో వీరిది పెద్దన్న పాత్ర. 26 శాఖలకు సంబంధించిన పనిభారం రెవెన్యూ ఉద్యోగులకు గుదిబండగా మారింది. ప్రతి పనిలో వీరే కీలకం కావడంతో భూపరిపాలన గాడి తప్పింది. దీంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు వీఆర్వోల నుంచి తహసీల్దార్‌ల వరకు చేతివాటం ప్రదర్శించడం ఆ శాఖకు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది.  

హడావుడి ప్రక్షాళనతో...
రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించాలనే హడావుడిలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన ప్రస్తుత అగచాట్లకు కారణమైంది. తప్పులు సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వకపోవడం, సాంకేతిక సమస్యలు, ధరణి వెబ్‌సైట్‌ సహకరించకపోవడం లాంటి కారణాలు రెవెన్యూ సిబ్బంది పనితీరును ప్రశ్నించేలా చేశాయి. లెక్కకు మిక్కిలి చట్టాలు, జీవోలతో గందరగోళం ఏర్పడింది. పార్ట్‌ బీ భూముల వ్యవహారం వీరికి తలనొప్పిగా మారింది. తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటనతో రెవెన్యూ ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకమైంది. దీంతో ప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాలయాలకు తొలిసారిగా పోలీస్‌ బందోబస్తు కల్పించింది. రెవెన్యూ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే సందర్శకుల రాకపోకలను నియంత్రించింది.  

26 శాఖలకు సంబంధించిన పనిభారం రెవెన్యూ ఉద్యోగులకు గుదిబండగా మారింది. ప్రతి పనిలో వీరే కీలకం కావడంతో భూపరిపాలన గాడి తప్పింది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top