టీచర్‌ ‘చదువులకు’ వెనకాడుతున్నారు

Teacher Course Admission Decreases In Telangana - Sakshi

టీచర్‌ కోర్సులకు తగ్గుతున్న డిమాండ్‌

గత ఐదేళ్లలో భారీగా తగ్గిన ప్రవేశాలు

మూతపడుతున్న కాలేజీలు

ప్రత్యామ్నాయ కోర్సులపై యాజమాన్యాల దృష్టి

2012లో ఉమ్మడి రాష్ట్రంలో టీచర్‌ నియామకాలను చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ల తరువాత 2017లో చర్యలు తీసుకుంది. భర్తీ ఇంకా పూర్తి కాలేదు. భర్తీలో జాప్యం, ప్రైవేట్‌లో వచ్చే వేతనాలు తక్కువగా ఉండటం టీచర్‌ కోర్సులపై ప్రభావం చూపుతోంది.   

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులకు డిమాండ్‌ తగ్గిపోతోంది. విద్యారంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇచ్చేవేతనాలు చాలక ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. గతంలో టీచర్‌ కావాలన్న ఆశతో భారీ ఎత్తున ఉపా ధ్యాయ కోర్సులను అభ్యసించగా క్రమంగా డిప్లొమా ఇన్‌ ఎలి మెంటరీ ఎడ్యు కేషన్‌ (డీఎడ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెనుకాడుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. డీఎడ్‌లో గతంలో 11 వేలకుపైగా విద్యార్థులు చేరితే ఇప్పుడు ఆ సంఖ్య 5 వేలకు పడిపోయింది. అలాగే బీఎడ్‌లోనూ గతంలో 16 వేల మందికిపైగా విద్యార్థులు చేరితే వారి సంఖ్య 12 వేలకు తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరంలో పదుల సంఖ్యలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. 

తగ్గిపోయిన అవకాశాలు..
ఉపాధ్యాయ విద్యలో 2010 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఓవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. దీంతో ఆ ప్రభావం నియామకాలపైనా పడుతోంది. ఫలితంగా 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలను చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ల తరువాత 2017లో ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు చేపట్టింది. ఆ నోటిఫికేషన్‌ ద్వారా 8,972 పోస్టులను భర్తీ చేస్తోంది. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు రంగంలో ఇచ్చే వేతనాలు తక్కువగా ఉంటుండటంతో ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగాలు చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు.

డీఎడ్‌కు భారీ దెబ్బ...
బీఎడ్‌లో చేరే విద్యార్థుల సంఖ్యతో పోల్చితే డీఎడ్‌లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అభ్యర్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఒకప్పుడు డీఎడ్‌తోపాటు బీఎడ్‌ చేసిన వారు కూడా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు అర్హులే. అయితే 2010లో కొత్త నిబంధనల ప్రకారం బీఎడ్‌ చేసిన వారు కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌గానే వెళ్లాలని, ఎస్‌జీటీ పోస్టులకు అనర్హులని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలు తీసుకువచ్చింది. దీంతో అప్పటి నుంచి బీఎడ్‌కు డిమాండ్‌ తగ్గిపోతూ వచ్చింది. అయితే గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం మరో నిబంధనను అమల్లోకి తెచ్చింది. బీఎడ్‌ చేసిన వారు ఉద్యోగం వచ్చాక చైల్డ్‌ సైకాలజీలో ఆరు నెలల ఇండక్షన్‌ ట్రైనింగ్‌ చేస్తే సరిపోతుందని పేర్కొంది. దీంతో డీఎడ్‌లో చేరే వారి సంఖ్య మరింతగా తగ్గిపోయింది. పైగా ఇంటర్‌ తరువాత రెండేళ్ల డీఎడ్‌ చేసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. డిగ్రీ పూర్తయ్యాక ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటే బీఎడ్‌ చేయవచ్చన్న ఆలోచన విద్యార్థుల్లో పెరిగిపోయింది. ఒకవేళ డీఎడ్‌ రెండేళ్లు చేసినా స్కూల్‌ అసిస్టెంట్‌ కావాలంటే మళ్లీ మూడేళ్లు డిగ్రీ చేయాలి. దాంతోపాటు మరో రెండేళ్లు బీఎడ్‌ చేయాల్సి వస్తోంది. వాటి కంటే ఇంటర్‌ తరువాత డిగ్రీ పూర్తి చేసి ఆ తరువాత బీఎడ్‌ చేస్తే సరిపోతుందన్న ఆలోచనలకు విద్యార్థులు వస్తున్నారు. దీంతో డీఎడ్‌వైపు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు.

మూసివేతకు యాజమాన్యాల దరఖాస్తులు...
రాష్ట్రంలో బీఎడ్, డీఎడ్‌ కాలేజీలను నడుపలేమంటూ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. గత ఐదేళ్లలో బీఎడ్, డీఎడ్‌ కాలేజీల సంఖ్య తగ్గిపోయింది. 2015–16 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 225 బీఎడ్‌ కాలేజీలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 208కి తగ్గిపోయింది. ఇందులో ఈ విద్యా సంవత్సరంలో 7–8 కాలేజీలు మూతపడ్డాయి. ఇక డీఎడ్‌ కాలేజీలు 210 ఉండగా ప్రస్తుతం అవి 140కి తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో గత విద్యా సంవత్సరంలో 30 కాలేజీలు మూతపడగా ఈ విద్యా సంవత్సరంలో 40 డీఎడ్‌ కాలేజీలు మూసివేత కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఆ మేరకు కాలేజీలు తగ్గిపోయాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top