కత్తి మహేశ్‌ను అందుకే బహిష్కరించాం : డీజీపీ

Suspended Kathi Mahesh 6 Months From Hyderabad, Says Mahender Reddy - Sakshi

మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి : డీజీపీ మహేందర్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : గత నాలుగేళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. కేవలం కొందరు వ్యక్తుల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదని భావించి సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను హైదరాబాద్‌ నుంచి బహిష్కరించినట్లు డీజీపీ వెల్లడించారు. కత్తి మహేశ్‌ పోస్టులు, ఆపై బహిష్కరణ విషయంపై సోమవారం మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

సొంత జిల్లాకు కత్తి మహేశ్‌
కత్తి మహేశ్‌ అనే వ్యక్తి టీవీ చానళ్లను, సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని పదే పదే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేశ్‌ వ్యాఖ్యలు, పోస్టులతో మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కు అయినప్పటికీ సమాజంలో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావిస్తున్నాం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన క్రమంలో హైదరాబాద్‌ నుంచి కత్తి మహేశ్‌ను 6 నెలలపాటు బహిష్కరించాం. ఆయన సొంత జిల్లా చిత్తూరుకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. చట్టాలను ఉల్లంఘించి ఒకవేళ మళ్లీ అతను నిషేధ సమయంలో హైదరాబాద్‌లో ప్రవేశిస్తే మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అంతేగాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కత్తి మహేశ్‌పై నిషేధం విధించాల్సి ఉంటుంది. ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్‌ చేసి చర్యలు తీసుకుంటాం.

భారతదేశం నలుమూలల నుంచి ఎక్కడినుంచైనా వచ్చి ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు. కానీ కత్తి మహేశ్‌ తరహాలో ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా, వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. శాంతి భద్రతలు బాగుండటం వల్లే తెలంగాణ పౌరులు, ఉద్యోగులు, అన్నివర్గాల వారు అభివృద్ది కోసం వాళ్ల పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఎవరో కొందరు వ్యక్తులు కావాలని పని గట్టుకుని, ప్రసార మాధ్యమాలను వేదికగా చేసుకుని ఇతర వర్గాల మధ్య తగాదాలు పెట్టడం చేయకూడదు. పదే పదే తమకున్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్తితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 

సహకరిస్తే చర్యలు తప్పవు
కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రక్రియలో ఇతర వర్గాలు, మతాలు, ప్రాంతాల వారి మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఆయా వ్యక్తులకు సహకరించిన వారిపై సైతం చర్యలు తీసుకుంటాం. సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇతరత్రా మాధ్యమాల ద్వారా ఏ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా నోటీసులు జారీ చేస్తాం. కత్తి మహేశ్‌ వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన ఓ ఛానల్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చాం. వారిచ్చే సమాధానం బట్టి చర్యలు ఉంటాయి. సెక్షన్‌ 16, 17 కేబుల్‌ యాక్ట్‌ ప్రకారం మేనేజ్‌మెంట్‌ రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చాం. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్‌ రెడ్డి హెచ్చరించారు.

సంబంధిత కథనం

కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top