ప్రత్యేక బీఈడీ, డీఈడీలకు టీఆర్‌టీలో అవకాశమివ్వాలి  | Stay on GO 25 until the decision is taken | Sakshi
Sakshi News home page

ప్రత్యేక బీఈడీ, డీఈడీలకు టీఆర్‌టీలో అవకాశమివ్వాలి 

Nov 5 2017 2:04 AM | Updated on Aug 31 2018 8:34 PM

Stay on GO 25 until the decision is taken - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వినికిడి, దృష్టి లోపాలతో పాటు బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు విద్యను అందించేందుకు ప్రత్యేక బీఈడీ, డీఈడీ చదివిన అభ్యర్థులకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ)లో అవకాశం కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రత్యేక బీఈడీ, డీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించే విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకునేంత వరకు టీఆర్‌టీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు తెలంగాణ ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రీసోర్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బి.శ్రీనివాసులు హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వారి ప్రకారం ప్రత్యేక బీఈడీ, డీఈడీ చేసిన వారు సాధారణ బీఈడీ కోర్సు చేసిన వారితో సమానమని పిటిషన్‌లో వివరించారు. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించిందని, టీఆర్‌టీ జీవో 25లో ప్రత్యేక బీఈడీ, డీఈడీ వారికి అవకాశం కల్పించలేదని తెలిపారు. అలాగే వీరికి ప్రత్యేక పాఠశాలల్లోనే కాకుండా సాధారణ పాఠశాలల్లో కూడా పనిచేసే అవకాశం ఇవ్వాలని, ఆ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరావు చట్ట నిబంధనలను పిటిషనర్‌ సవాలు చేసినందున దీనిపై ధర్మాసనం విచారించడమే సబబుగా ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement