
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు కామారెడ్డిలో శంకుస్థాపన చేస్తున్న దివంగత సీఎం వైఎస్సార్ (ఫైల్)
జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు ప్రజాప్రస్థానం సాగించాడు. సాగునీటి కోసం బోరుబావులను తవ్వించి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను చూసి చలించిపోయాడు. ఆ కుటుంబాల కన్నీళ్లు తుడవాలంటే సాగునీరు అందించాలని నిర్ణయించుకున్నాడు. అధికారంలోకి వచ్చాక ‘ప్రాణహిత –చేవెళ్ల’కు రూపకల్పన చేశాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి మహానేత కలల సాకారం దిశగా.. ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కథనం..
సాక్షి, కామారెడ్డి: 2000 ప్రాంతంలో వరుస కరువు కాటకాలతో భూములు బీడుగా మారాయి. సాగు నీటి కోసం రైతులు భగీరథ ప్రయత్నం చేశారు. వందల అడుగుల లోతువరకు బోరుబావులు త వ్వించినా ప్రయోజనం లేకపోయింది. ఒక్కో రైతు ఐదారు బోర్లు తవ్వించి అప్పులపాలయ్యాడు. కరువుతో పంటలు పండక.. అప్పుతీర్చే మార్గం కనిపించక పలువురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆశలన్నీ మోడులైన దశలో నేనున్నానంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టారు. 2003లో ఆయన చేసిన పాదయాత్ర కా మారెడ్డి ప్రాంతం మీదుగా సాగింది. ఆయన పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశారు.
సాగునీటి వెతలను విని చలించిపోయారు. అధికారంలోకి రాగానే అన్నదాత సంక్షేమానికి చర్యలు చేపట్టారు. సర్వేలు చేయించి, ప్రాణహిత–చేవెళ్ల పథకానికి జీవం పోశారు. కామారెడ్డి పట్టణంలో ఈ పథకానికి శంకుస్థాపన కూడా చేశారు. 22వ ప్యాకేజీలో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లా రెడ్డి రెవెన్యూ డివిజన్లతో పాటు మెదక్ జిల్లాలోని కొన్ని మండలాలను కలిపి 1.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకుగాను రూ.1,446 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లోనే భూంపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టారు. కాలువల తవ్వ కం పనులు కూడా జరిగాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ‘ప్రాణహిత’ పనులు ఆపేశా రు. దీంతో కొన్నాళ్లపాటు పనులు ఆగిపోయాయి. అన్ని రకాల పరిశీలనల అనంతరం 22వ ప్యాకేజీని అలాగే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా 44 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం భూంపల్లి రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. కాలువల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. భూంపల్లి రిజర్వాయర్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్, రిడ్జ్ కెనాల్స్ ద్వారా మూడు వైపులా నీటిని పంపించి సాగునీరు అందించనున్నారు.
జిల్లా మీదుగా సాగిన ‘ప్రజాప్రస్థానం’
వైఎస్సార్ 2003లో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మెదక్ జిల్లా నుంచి నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామం వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, కామారెడ్డి, మాచారెడ్డి మీదుగా సిరిసిల్ల జిల్లాలోకి వెళ్లింది. ఉమ్మడి జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర మొత్తం కామారెడ్డి జిల్లాలోనే కొనసాగింది. అంతేగాక కామారెడ్డి జిల్లాలో సగానికిపైగా ప్రాంతాల మీదుగా పాదయాత్ర చేసిన రాజశేఖరరెడ్డి.. ప్రజల కష్టాలను కళ్లారా చూశారు.
ముఖ్యం గా కామారెడ్డి ప్రాంతంలో బోర్ల తవ్వకంతో అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల పరిస్థితిని చూసి చలించిపోయారు. అన్నదాతల బలవన్మర ణాలకు అప్పులు, సాగునీరే అసలు సమస్య అని నిర్ధారించుకున్నారు. సీఎం అయిన తరువాత కామారెడ్డి ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించడమే కాకుండా వాటికి అవసరమైన నిధులు మంజూరు చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.
ప్రాణహితకు ఇక్కడే బీజం....
సాగునీటి కష్టాలకు కేరాఫ్ అయిన కామారెడ్డి ప్రాంతంలో ఆయా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ చర్యలు తీసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి పథకాన్ని రూపొందించి దానికి కామారెడ్డి పట్టణంలోనే శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 3.05 లక్షల ఎకరాలకు నీటినందించాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అందులో భాగంగా 20, 21, 22 ప్యాకేజీలు రూపొందించారు. మొదటి విడతలో 20, 21 ప్యాకేజీల పనులు ప్రారం భం కాగా, 22వ ప్యాకేజీ పనులు మొదలయ్యేలోపే వైఎస్సార్ మరణించారు.
ప్రభుత్వాలు మారడంతో దాని పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టుల రీడిజైన్ తరువాత తిరిగి 22వ ప్యాకేజీని ఉన్నది ఉన్నట్టుగా కొనసాగిస్తూనే అదనపు ఆయకట్టు చేర్చా రు. పాత డిజైన్ ప్రకారం పనులను వేగవం తం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయి. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను చూసిన రైతులు దివంగత సీఎంను గుర్తు చేసుకుంటున్నారు.
యాచారం వద్ద కొనసాగుతున్న టన్నెల్ తవ్వకం పనులు