కొలిమిపై కొలువు

Special story to Railway loco pilot jobs - Sakshi

మండుటెండల్లో విధి నిర్వహణతో లొకో పైలెట్ల విలవిల 

పదేళ్లు దాటినా అమలుకు నోచని ఏసీ సదుపాయం

టాయిలెట్‌ వసతి కూడా లేకుండా విధులు 

బయటి కంటే ఐదు డిగ్రీలు అధికం

రైల్వే లొకో పైలెట్‌లకు వేసవి కష్టాలు  

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే లొకోపైలెట్లు నిప్పుల కొలిమిపై విధులు నిర్వహిస్తున్నారు. వేలాదిమంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే లొకోపైలెట్లకు విధి నిర్వహణలో కనీస సదుపాయాలు లభించడం లేదు. ఎలాంటి విరామం లేకుండా వందలకొద్దీ కిలోమీటర్లు రైళ్లు నడిపే డ్రైవర్లు అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య విలవిలలాడుతున్నారు. బయటి ఉష్ణోగ్రతల కంటే కనీసం 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల నడుమ రైళ్లను నడుపుతున్నారు. అన్ని రైలింజన్లలో ఏసీ సదుపాయాన్ని, టాయిలెట్లను ఏర్పాటు చేయాలని పదేళ్ల క్రితం రైల్వేబోర్డు నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. భద్రతా రంగానికి చెందిన లొకోపైలెట్లలో సిబ్బంది కొరత కారణంగా పనిభారం సైతం రెట్టింపైంది. దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని డివిజన్లలో 3.500 మందికిపైగా లొకోపైలెట్లు, సహాయ లొకోపైలెట్లు, షంటర్‌లు పని చేయవలసి ఉండగా ప్రస్తుతం సుమారు 2,500 మంది మాత్రమే ఉన్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. లొకోపైలెట్‌ల సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. 

ఉగ్గబట్టుకోవలసిందే...
టాయిలెట్‌ సదుపాయం లేకపోవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ‘రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరితే బల్లార్ష వరకు ఉగ్గబట్టుకొని బండి నడపాల్సి వస్తోంది. కనీసం ఐదున్నర గంటలపాటు ఇలా ఆపుకోవలసిందే. దీంతో విధి నిర్వహణలో ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది’అని ఒక సీనియర్‌ డ్రైవర్‌ అన్నారు. లొకోపైలెట్లు ప్రతిక్షణం వెంటాడే ఒత్తిడి, నిద్రలేమి వల్ల రైల్వే మాన్యువల్‌ విధించిన ఆరోగ్యసూత్రాలకు విరుద్ధమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో గోడు వెళ్లబోసుకున్నారు. సిబ్బంది కొరత కారణంగా గూడ్స్‌ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్‌ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్లు(ఇంజిన్‌లను ఒక చోట నుంచి మరో చోటకు మార్చేవారు) ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్‌ రైళ్లు నడుపుతున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇది ప్రమాదకరమే.

ఏదీ  ఏసీ...
లొకోపైలెట్లకు ఇంజిన్‌ కేబిన్‌లలోనే కనీస సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని 2007లోనే రైల్వేబోర్డు నిర్ణయించింది. డబ్ల్యూఏజీ–7, డబ్ల్యూఏజీ–9 కేటగిరీకి చెందిన అన్ని ఎలక్రిక్‌ లొకో రైళ్లలో తప్పనిసరిగా ఏసీ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ ఇది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ‘కొన్ని రైళ్లలో పరిమితంగా ఏసీలు ఏర్పాటు చేశారు. కానీ వాటి మెయింటెనెన్స్‌ కోసం సిబ్బందిని నియమించలేదు. దీంతో బయట 46 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఇంజిన్‌ క్యాబిన్‌లో 52 డిగ్రీల ఉష్ణోగ్రతలో బండ్లు నడపాల్సి వస్తోంది’అని సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వైపు పని చేసే లొకోపైలెట్‌ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బయట నుంచి వచ్చే వేడి గాలులు, ఇంజిన్‌ వేడి కారణంగా లొకోలు వడదెబ్బకు గురవుతున్నారు. అధికరక్తపోటు, డయాబెటీస్‌ వంటి సమస్యలున్న వారు మరింత అనారోగ్యానికి గురవుతున్నట్లు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్‌ నడిపే డ్రైవర్‌ ఒకరు తెలిపారు. 

సెలవులకు ‘సెలవ్‌’...
ఒక్కో లొకోపైలెట్‌ విధి నిర్వహణలో 8 గంటలు మాత్రమే పనిచేయాలి. ఆ తరువాత 6 గంటల విశ్రాంతి తీసుకొని తిరిగి 8 గంటలు పనిచేసి మరో 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటలపాటు విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక రోజు సెలవు చొప్పున, ప్రతి 14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున లొకోపైలెట్‌ లింక్‌ (విధి నిర్వహణ) ఉండాలి. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతికే పరిమితమవుతున్నారు. సెలవులు లభించకపోవడంతో కుటుంబాలతో తగినంత సమయం గడపడం లేదు. పిల్లల ఆలనాపాలన, చదువులు, వాళ్ల అభివృద్ధి వంటి అంశాల్లో భాగస్వాములు కాలేకపోతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top