పీజీ చేసినా కాన్పు చేయడం రాదాయే! 

Special Story On PG Medical Students - Sakshi

ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని వైద్య విద్యార్థుల గోస

కేసీఆర్‌ కిట్‌తో బోధనాస్పత్రులకు తగ్గిన గర్భిణులు

తప్పక బయట ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్న వైనం

తక్కువ ఫీజుకే ప్రసవాలు చేస్తామంటూ బోర్డులు పెడుతున్న కళాశాలలు

సీట్లు కాపాడుకునేందుకు ఎంసీఐకి ఎక్కువ ప్రసవాలు చూపిస్తున్న కాలేజీలు

సర్కార్‌కు విద్యార్థుల ఫిర్యాదులు..కనీసం ప్రసవం చేయలేకుంటే ఎలాగని ఆవేదన

కేసీఆర్‌ కిట్‌ను తమకూ అమలు చేయాలని ప్రైవేటు బోధనాస్పత్రుల విన్నపం

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో పీజీ గైనకాలజీ పూర్తి చేసిన అనేకమంది విద్యార్థులు కనీసం కాన్పులు చేయలేని దుస్థితి నెలకొంది. పీజీ సీటు కోసం లక్షలకు లక్షలు.. మేనేజ్‌మెంట్‌ కోటాలోనైతే కోట్లు పెట్టి గైనిక్‌ పూర్తిచేసినా కనీసం ప్రసవం చేస్తామన్న ఆత్మవిశ్వాసం కూడా వారిలో లేకుండా పోయింది. దీంతో అనేకమంది విద్యార్థులు కోర్సు పూర్తయిన తర్వాత ఎక్కడో ఒకచోట సీనియర్‌ గైనకాలజీ డాక్టర్‌ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో అనేక ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో నెలకొంది.

మరోవైపు గైనిక్‌ సీట్లను కాపాడుకునేందుకు ప్రసవాలు ఎక్కువగానే చేస్తున్నామంటూ ప్రైవేటు కాలేజీలు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ)కి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. కాన్పులు చేయలేని పరిస్థితి ఏర్పడటంతో కనీసం ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని కొందరు జూనియర్‌ గైనిక్‌ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సోమవారం కొందరు గైనిక్‌ విద్యార్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తమకు ఎలాగైనా సాయం చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వాస్పత్రులకే గర్భిణులు.. 
రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే మగ బిడ్డను కన్న తల్లికి రూ.12 వేలు, ఆడ బిడ్డను కన్న తల్లికి రూ.13 వేలు ప్రోత్సాహకం ఇస్తుంది. దీంతోపాటు బిడ్డ, తల్లికి కలిపి వారి అవసరాల కోసం కొన్ని రకాల వస్తువులను కూడా ఉచితంగా ఇస్తుంది. దీంతో 2017 నుంచి ఇప్పటివరకు 6.5 లక్షల మంది మహిళలు కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా లబ్ధి పొందారు. దీంతో ప్రైవేటు బోధనాస్పత్రులకు వెళ్లే గర్భిణీల సంఖ్య భారీగా పడిపోయింది.

తక్కువ ఫీజుకే ప్రసవాలంటూ బోర్డులు.. 
కేసీఆర్‌ కిట్‌ దెబ్బతో అధికార పార్టీలోని ఓ కీలక ప్రజాప్రతినిధికి చెందిన ప్రైవేటు మెడికల్‌ కాలేజీకి చెందిన అనుబంధ ఆస్పత్రి ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. గర్భిణీలను ఆకర్షించేందుకు ఒక బోర్డు తగిలించింది. గర్భిణీ స్త్రీలు మొదట రూ.2 వేలు చెల్లిస్తే చాలు.. వారికి మొదటి నుంచి తమ వద్దే చెకప్‌లు చేసి, ఆ తర్వాత కాన్పు కూడా చేసి పంపిస్తామని బోర్డులో పేర్కొంది. దీనికైనా ఆకర్షితులై గర్భిణీలు తమ వద్దకు వస్తారని, తద్వారా గైనిక్‌ పీజీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ శిక్షణ అందుతుందని ఆశిస్తున్నారు.

అలాగే మరో ప్రైవేటు అనుబంధ ఆస్పత్రి కూడా ఇలాగే బోర్డు తగిలించింది. మొదట తమకు రూ.2,500 చెల్లిస్తే చాలు, మిగిలిన మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చుతామని హామీ ఇస్తోంది. అయితే ఈ హామీలు ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు ఇవ్వడం లేదని ఆయా కాలేజీలు అంటున్నాయి. తమకు కూడా కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని అమలు చేస్తే ఈ సమస్య తీరుతుందని, సర్కారు ప్రోత్సాహకం వల్ల గర్భిణీలు అధికంగా వస్తారని, గైనిక్‌ విద్యార్థులకు మంచి శిక్షణ కూడా ఉంటుందని బోధనాస్పత్రులు ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విన్నవించాయి. అయితే ఇలా చేస్తే పథకం దుర్వినియోగం అవుతుందన్న భయం సర్కారులో ఉంది.

ప్రాక్టికల్‌ శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది..
కేసీఆర్‌ కిట్‌ అమలు తర్వాత ప్రభుత్వ బోధనాస్పత్రులకు, ఇతర సర్కారు ఆస్పత్రులకు గర్భిణీల రాక మరింత పెరిగింది. దీంతో ప్రైవేటు బోధనాస్పత్రులకు గర్భిణీల సంఖ్య కాస్తంత తగ్గి ఉండొచ్చు. దీంతో అక్కడ చదివే పీజీ విద్యార్థులకు సరైన ప్రాక్టికల్‌ శిక్షణ పెద్దగా ఉండటంలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో గైనిక్‌ పూర్తి చేసిన జూనియర్‌ డాక్టర్లకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3 నెలలపాటు ప్రాక్టికల్‌ శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది.
డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం

విద్యార్థుల ఆందోళన.. 
రాష్ట్రంలో 12 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో మెడికల్‌ పీజీ గైనకాలజీ కోర్సు ఉంది. ఆయా కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులకు కేసీఆర్‌ కిట్‌ వల్ల గర్భిణీల సంఖ్య తగ్గింది. దీంతో పీజీ గైనిక్‌ విద్యార్థులకు ప్రసవాలు ఎలా చేయాలన్న దానిపై ప్రయోగాత్మకంగా నేర్చుకునే వెసులుబాటు తగ్గింది. దీంతో తమకు సరైన శిక్షణ అందడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జూనియర్‌ గైనిక్‌ డాక్టర్లు సాధారణ ప్రసవాలు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు. సాధారణ ప్రసవం చేయాలన్నా అత్యంత జాగ్రత్తలు తప్పనిసరి. ఏమాత్రం తేడా వచ్చినా మాతా శిశువుల ప్రాణానికే గండం ఏర్పడనుంది. ఇక సిజేరియన్‌ ఆపరేషన్ల ద్వారా చేయడమంటే ఇంకా ఎక్కువ రిస్క్‌ చేయాల్సి ఉంటుంది. వీరికి ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సరైన ప్రాక్టికల్‌ శిక్షణ లేకపోవడంతో సాధారణ, సిజేరియన్‌ ప్రసవాలు చేయలేని పరిస్థితి నెలకొంటుంది.

తప్పుడు లెక్కలు.. 
ఇదిలావుంటే ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు తమకు రోజుకు అవసరమైన గర్భిణీలు వస్తున్నారని, విద్యార్థులకు సరైన గైనిక్‌ ప్రాక్టికల్‌ శిక్షణ అందుతుందని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ)కు తప్పుడు నివేదికలు ఇస్తున్నాయి. తద్వారా తమ పీజీ గైనిక్‌ సీట్లు కోల్పోకుండా చూసుకుంటున్నాయి. ప్రైవేటు బోధనాస్పత్రులకు కాన్పు కేసులు కరువవుతుండగా, ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో కేసులు ఎక్కువై వైద్య సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top