రాష్ట్రపతి కోసం ప్రత్యేక భవనం

A special building for the President At Yadadri - Sakshi

యాదాద్రిలో వీవీఐపీల కోసం విల్లాలు 

13.26 ఎకరాల భూమిలో రూ.104 కోట్లతో పనులు

సాక్షి,యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రం పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. వైటీడీఏ ఆధ్వర్యంలో రూ.2,000 కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే పెద్దగుట్ట లే అవుట్, ప్రధానాలయం అభివృద్ధి, విస్తరణ పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానానికి వచ్చే వీవీఐపీల బస కోసం ప్రెసిడెన్షియల్‌ సూట్‌ (గెస్ట్‌హౌస్‌)ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సామాన్య భక్తుల కోసం వసతిగృహాలను నిర్మిస్తున్న వైటీడీఏ వీవీఐపీలు, వీఐపీల కోసం కూడా ప్రెసిడెన్షియల్‌ సూట్‌ల పేరుతో ప్రత్యే కంగా గెస్ట్‌హౌస్‌లను నిర్మిస్తోంది. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా యాదాద్రి క్షేత్ర మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా రూ.104 కోట్ల తో అత్యాధునిక హంగులతో ప్రత్యేక గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. యాద గిరిపల్లి శివారులోని గుట్ట ప్రాంతంలో సర్వేనంబర్‌ 146లో 13.26 ఎకరాలను రెవెన్యూ అధికారులు సేకరించి వైటీడీఏకు అప్పగించారు.  

ఎన్ని నిర్మిస్తారంటే.. 
శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే వీవీఐపీల కోసం 15 ప్రెసిడెన్షియల్‌ సూట్లను నిర్మిస్తున్నారు. ఇందులో కొండపైన అన్నిటికన్నా ఎత్తులో కేవలం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి, గవర్నర్, సీఎంల బస కోసం ఓ అతిథిగృహాన్ని నిర్మిస్తారు. 14 గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తారు.  ఇందులో 8 అతిథిగృహాల నిర్మాణం జరుగు తోంది. వీటికోసం ప్రత్యే కంగా రోడ్లను కూడా నిర్మిస్తున్నారు. ఈ సూట్లలో విశాలమైన గదులు, సమావేశ మందిరాలుంటాయి. అత్యాధునిక ఫర్నిచర్, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో కళాఖండాలతో రమణీయంగా తీర్చిదిద్దనున్నారు. పార్కింగ్‌కు ప్రత్యేక సదుపాయాలు, ఆవరణలో పచ్చదనం కోసం పార్కులు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. ప్రధానాలయం పూర్తయ్యేలోపు ఈ పనులన్నిం టిని పూర్తి చేయనున్నారు.

నాలుగు స్తంభాల మంటప నిర్మాణం
యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో మరో అద్భుత శిల్పకళా ఖండం రూపుదిద్దుకుంటోంది. స్థపతులు మరో అద్భుత శిల్ప గోపుర మంటపానికి శ్రీకారం చుట్టారు. ఆలయానికి ఈశాన్యంలో 4 స్తంభాలను కాకతీయ శిల్పశైలితో నిర్మిస్తున్నారు. ఈ స్తంభాల నిర్మాణంలో పాశుపాదం, విగ్రహస్థానం, అష్టపట్టం, చతురస్రం, అమలకం, పద్మం, పొందిక వంటి ముద్రికలను చెక్కారు. రామాయణంలోని ప్రధానఘట్టాలనూ రాతి స్తంభాలపై చెక్కారు. సీత జననం, శ్రీరామలక్ష్మణ, భరత, శతృఘ్నుల జననం, విశ్వామిత్రుని వద్ద విద్యాభ్యాసం, సీతా స్వయంవరం, భరతుడికి శ్రీరాముని పాదుకలు ఇవ్వడం, రావణుడు సీతాపహరణ సమయంలో జటాయువు పోరాటం, వాలీసుగ్రీవుల పోరాటం, లంకలోని అశోక వనంలో ఉన్న సీతకు హన్మంతుడు అంగుళీయకం ఇవ్వడం, రావణ వధ, శ్రీరామ పట్టాభిషేకం వంటి ఘట్టాలను స్తంభాలపై చెక్కారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top