స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే | speaker will be elected unanimously, says harish rao | Sakshi
Sakshi News home page

స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే

Jun 8 2014 1:54 AM | Updated on Sep 2 2017 8:27 AM

స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే

స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే

శాసనసభా సంప్రదాయాల ప్రకారం స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని, ఇందుకు అన్ని విపక్షాలతో మాట్లాడుతున్నామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు.

విపక్షాలు సహకరించే సంప్రదాయం ఉంది: మంత్రి హరీష్
 10న స్పీకర్, 11న డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.. 9న శాసన మండలి
సభ్యులందరితో మళ్లీ ప్రమాణం
 
 సాక్షి, హైదరాబాద్: శాసనసభా సంప్రదాయాల ప్రకారం స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని, ఇందుకు అన్ని విపక్షాలతో మాట్లాడుతున్నామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శాసనసభ ఏర్పాట్లపై అధికారులతో శనివారం చర్చించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈనెల 9న ఉదయం 9.30కు రాజ్‌భవన్‌లో సీనియర్ శాసనసభ్యులు కె.జానారెడ్డితో ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. 10న స్పీకర్ ఎన్నిక, 11న ఉదయం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం ఉంటాయని వివరించారు.  అదేరోజు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం అవుతుందని తెలిపారు. కమిటీలో చర్చించిన తర్వాత గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాదాలు చెప్పడానికి ఎన్ని రోజులు సభను నడపాలనేది నిర్ణయిస్తామని చెప్పారు. మొత్తంగా సభను 4రోజుల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా అనుకున్నామని, పొడిగింపు అనేది బీఏ సీ సమావేశం తర్వాత నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
 
 మండలి సభ్యులంతా మళ్లీ ప్రమాణం
 
 సమైక్యాంధ్రప్రదేశ్‌లో మండలికి ఎన్నికైన తెలంగాణ సభ్యులంతా మళ్లీ ఈనెల 9న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మండలి కూడా కొత్తగా ఏర్పాటైనందున వారంతా మళ్లీ ప్రమాణం చేయాల్సిందేనన్నా రు. మండలికి డిప్యూటీ చైర్మనుగా ఉన్న విద్యాసాగరే తెలంగాణ మండలికి చైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు.
 
 నియోజకవర్గానికో క్యాంపు కార్యాలయం
 
 నియోజకర్గ స్థాయిలో ఎమ్మెల్యేకు ఒక క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా హరీష్‌రావు వివరించారు. ప్రభుత్వ పరంగానే ఈ ఏర్పాట్లు ఉంటాయన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, సభలో వ్యవహరించాల్సిన తీరు, శాసన సభ్యునికి ఉండే హక్కులు, బాధ్యతలు వంటి వాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ శిక్షణ ఎక్కడ, ఎన్నిరోజులు అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు.
 
 నేడు హరీష్‌రావు బాధ్యతల స్వీకరణ
 
 తెలంగాణ రాష్ట్ర సాగునీటి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా టి.హరీష్‌రావు ఆదివారం ఉదయం 11 గంటలకు బాధ్యతలను స్వీకరించనున్నారు. డి-బ్లాకులోని 151లోని కార్యాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. అభినందించడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు వంటివి తీసుకురావద్దన్నారు. వీటికోసం ఖర్చు పెట్టాలనుకునేవారు ముఖ్యమంత్రి సహాయనిధి విరాళాలు ఇవ్వాలని హరీష్‌రావు కోరారు.
 
 రేపు ప్రొటెం స్పీకర్ ప్రమాణం
 
 సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి సోమవారం శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయనున్నారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో జరిగే కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం చేయించనున్నారు. అలాగే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కూడా అదేరోజు తెలంగాణ శాసనమండలి మొట్టమొదటి చైర్మన్‌గా ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుత శాసన మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి ఆంధ్రప్రదేశ్ మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్ తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్నారు. కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయనే చైర్మన్‌గా కొనసాగుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement