వామ్మో నీటి లోటు..543 టీఎంసీలు

Situation in Krishna and Godavari irrigation projects is bad - Sakshi

కృష్ణా, గోదావరి సాగునీటి ప్రాజెక్టుల్లో పరిస్థితి దయనీయం 

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో 372 టీఎంసీల మేర నిల్వలు ఖాళీ 

సకాలంలో వర్షాలు కురవకుంటే 26 లక్షల ఎకరాలపై ప్రభావం 

సాక్షి, హైదరాబాద్‌ : లోటు వర్షపాతం, ఎగువ నుంచి కరువైన ప్రవాహాల కారణంగా గడిచిన ఏడాది నిర్జీవంగా మారిన కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జూన్‌ నుంచి ఆరంభమైన కొత్త వాటర్‌ ఇయర్‌లో నీటి రాకకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాదైనా నైరుతి కరుణిస్తుందనే గంపెడాశతో ఉన్నాయి. ప్రçస్తుతం రెండు బేసిన్‌ల పరిధిలో 543 టీఎంసీల నీటి లోటు ఉండగా, అవి పూర్తి స్థాయిలో నిండి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే కురిసే వానలపై భవిష్యత్తు ఆధారపడి ఉంది. వానలు కురవకపోతే మాత్రం రెండు బేసిన్‌ల పరిధిలో 26 లక్షల ఎకరాలపై ప్రభావం పడనుంది. 

నోరెళ్లబెట్టిన ప్రాజెక్టులు.. 
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. గతేడాది ఆగస్టు వరకు కూడా నీటి ప్రవాహాలు లేకపోవడంతో కృష్ణాబేసిన్‌ ప్రాజెక్టులకు నీటి రాక కరువైంది. దీని ప్రభా వం  నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాలపై పడింది. ప్రస్తుతం ఈ 3 ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకు గానూ  372.46 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్‌లో 130 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా, ఇదంతా కనీస నీటి మట్టాలకు దిగువన ఉన్నదే. ఇందులో గరిష్టంగా రెండు తెలుగు రాష్ట్రాలు 8 టీఎంసీలకు మించి వాడుకునే అవకాశం లేదు. ఇక శ్రీశైలం లో 215 టీఎంసీలకు గాను 32 టీఎంసీల లభ్యతగా ఉండగా, ఇప్పటికే కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి ఇరు రాష్ట్రాలు నీటిని తీసుకుంటున్నాయి.

జూరాలలోనూ 2.31 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. మొత్తంగా 12 టీఎంసీలకు మించి నీటి లభ్యత లేదు. ఇక ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ తీవ్ర నీటి లోటు ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో 223 టీఎంసీల నీరు చేరితే కానీ అవి నిండే పరిస్థితులు లేవు. ఎగువన 180 టీఎంసీల మేర నీరు చేరి తే గానీ దిగువ రాష్ట్ర ప్రాజెక్టులకు వరద వచ్చే అవకాశాలు లేవు. ఈ స్థాయిలో నీటి రాక రావాలంటే జూలై, ఆగస్టు నెలలో ఎగువన వర్షాలు కురవాలి. లేకుంటే దిగువకు ప్రవాహాలు మొదలయ్యేందుకు సెప్టెంబర్, అక్టోబర్‌ కూడా పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే జరిగితే జూరాల, సాగర్‌ల కింద ఖరీఫ్‌ పంటల సాగుపై స్పష్టత కొరవడుతుంది. సాగు నీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పరిస్థితుల్లో మొత్తంగా 11 లక్షల ఎకరాల ఆయ కట్టు పై ప్రభావం పడే అవకాశం ఉంది.  

గోదావరి నిర్జీవం.. 
ఇక గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల్లోనూ గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూ ర్, కడెం, ఎల్లంపల్లిలలో ప్రస్తుత లభ్యత జలం కేవలం 18 టీఎంసీలు మాత్రమే ఉండటం, 172 టీఎంసీల మేర నీటి లోటు ఉండటం కలవరపెడుతోంది. ఖరీఫ్‌లో ఈ ప్రాజెక్టుల కింద సుమారు 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. తీవ్ర నీటి కొరత దృష్ట్యా ప్రభుత్వం తన తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకేనని తేల్చి చెబుతోంది. మిషన్‌భగీరథ అవసరాలకు రెండు బేసిన్‌ల ప్రాజెక్టుల నుంచి కనిష్టంగా 60 టీఎంసీల నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు నీటి విడుదల ఉంటుందని స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుతం ఈ రెండు బేసిన్‌ల పరిధిలో లభ్యత జలం 30 టీఎంసీలకు మించి లేకపోవడం, మరో 30 టీఎంసీల నీరు వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్‌ సాగు అంతా వర్షాలపైనే ఆధారపడి ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top