హర.. హర.. సిద్ధేశ్వర  

siddeshwara Temple In Haveli Ghanpur - Sakshi

భక్తులకు కొంగుబంగారం శ్రీ సిద్ధేశ్వరుడు

హవేళిఘణాపూర్‌(మెదక్‌) : శివోహం.. శివాలయం.. ఏటేటా పెరుగుతున్న శివలింగం.. భక్తులకు కొంగుబంగారం శ్రీ సిద్ధేశ్వర దేవాలయం. మెదక్‌ జిల్లా హవేళిఘణాపూర్‌ మండలం ముత్తాయికోట గ్రామ శివారులో పచ్చటి పంటపొలాల  మధ్య కొలువుదీరాడు శ్రీ సిద్ధేశ్వర స్వామి. మెదక్‌ పట్టణంలో 16–17 శతాబ్ధంలో నాలుగు అడుగుల లోతులో వంద స్తంభాల  ప్రాచీన దేవాలయం ఉండేది. అప్పట్లో సిద్ధులు సంచరించేవారని, అందులో ముగ్గురు సిద్ధులు శివలింగాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర. 

నిజాం కాలంలో హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్న సమయంలో శివుడు జంగమ సిద్ధు రూపంలో ఓ అర్చకుడికి కలలోకి వచ్చి లింగాన్ని ధ్వంసం చేయబోతున్నారని, ఆ లింగాన్ని ఉత్తర దిక్కు తీసుకెళ్లు అని చెప్పినట్లు చరిత్ర చెబుతోంది. దీంతో ఓ ఎడ్లబండిలో శివలింగాన్ని తీసుకెళ్తున్న క్రమంలో ముత్తాయికోట గ్రామ శివారులోని ఎడ్లబండి ఇరుసు విరిగిపోయింది. దీంతో ఆ బ్రహ్మణుడు శివలింగాన్ని అక్కడే ఉన్న పొల్లాలో భద్ర పర్చాడు. కొన్నేళ్ల తరువాత ఉమ్మడి మెదక్‌ జిల్లా దుబ్బాక గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఎల్లదాస్‌మహారాజ్‌కు కలలో శివుడు కనిపించి నా ప్రతిరూపం పొలాల్లో ఉంది, దాని వద్దకు వెళ్లు అనగానే ఎల్లదాస్‌ మహారాజ్‌ మెదక్‌కు చేరుకున్నాడు.

ముత్తాయికోట గ్రామ శివారులో మహిమగల శివలింగాన్ని వెతికి, అక్కడే ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి శివలింగానికి పూజలు, అభిషేకాలు, అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు ఎల్లదాస్‌ నిత్యం చేసేవాడు. అనంతరం చందాలు పొగుచేసి ముత్తాయికోట శివారులో శ్రీ సిద్ధేశ్వర ఆలయాన్ని సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. ఎల్లదాస్‌ కుటుంబీకులు అక్కడే ఓ కుటీరం ఏర్పాటు చేసుకొని ఎల్లదాస్‌ సిద్ధేశ్వర భజనమాల అనే గ్రంథం రచించారు. 

ఆలయంలో కొలువుదీరిన దేవతలు

శ్రీ సిద్ధేశ్వర మహాదేవాలయంలో ఆశ్వంత వృక్షం వద్ద నాగదేవత ఉంది. అక్కడే పూజలు చేస్తే సంతానం, నాగదోషంతో పాటు సర్వ దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో పార్వతీదేవి అమ్మవారు, కాలభైరవ స్వామి, దత్తాత్రేయ స్వామి, నంది, నవగ్రహాలు, సంతోషీమాత, ఆంజనేయస్వామి దేవాలయం, కోనేరు(గుండం)తో పాటు ఎల్లదాస్‌ సమాధి సైతం ఆలయ ప్రాంగణంలోనే ఉంది. 

ఇతర జిల్లాల నుంచి భక్తుల తాకిడి

మెదక్‌ జిల్లా హవేళిఘణాపూర్‌ మండలం ముత్తాయికోట గ్రామ శివారులో వెలసిన శ్రీ సిద్ధేశ్వర దేవాలయానికి నిజామాబాద్, ఎల్లారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కాగా మహాశివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలతో పాటు ఘనంగా ఉత్సవాలు చేస్తారు. ప్రతి సోమవారం శివుడి(లింగం)కి రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం, అన్నపూజలు నిర్వహిస్తారు.

ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేస్తాను

మా కుటుంబ సభ్యులందరం ప్రతి సోమవారం ముత్తాయికోటలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి వస్తాం. ఉదయం ఆరు గంటలకే శ్రీ సిద్ధేశ్వర స్వామికి రుద్రాభిషేకం చేయిస్తాం. ఆలయ అభివృద్ధికి మావంతు సహాయసహకారాలు అందజేస్తున్నాం.  – ధర్మారం సుజాత, మెదక్‌ పట్టణం

దాతలు ముందుకు రావాలి

ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి. దాతల సహాయ సహాకారాలతో నిత్యం పూజలు నిర్వహిస్తున్నాను. ఎంతోమంది భక్తులు స్వచ్ఛంధంగా స్వామి వారి సేవలో పాల్గొంటున్నారు.

– గోవింద్‌ మహారాజ్, ఆలయ పూజారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top