యూరియా కొరత | Shortage of urea | Sakshi
Sakshi News home page

యూరియా కొరత

Sep 17 2014 1:25 AM | Updated on Sep 2 2017 1:28 PM

యూరియా కొరత

యూరియా కొరత

కరీంనగర్ అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 5,15,713 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో 1,61,3,94 హెక్టార్లలో వరి సాగవుతోంది. 2,23,334 హెక్టార్లలో పత్తి, 53,622 హెక్టార్లలో మొక్కజొన్న,

యూరియా కష్టాలు మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా సొసైటీల్లో యూరియా అందుబాటులో లేకపోవడం ప్రైవేటు డీలర్లకు కలిసివస్తోంది. బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఉన్న పంటలు కాపాడుకునేందుకు యూరియా వైపు పరుగులు తీస్తున్నారు. ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడడంతో ఎక్కడ చూసినా బారులు తీరే ఉంటున్నారు.
 
 కరీంనగర్ అగ్రికల్చర్ :
 ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 5,15,713 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో 1,61,3,94 హెక్టార్లలో వరి సాగవుతోంది. 2,23,334 హెక్టార్లలో పత్తి, 53,622 హెక్టార్లలో మొక్కజొన్న, 18385 హెక్టార్లలో సోయా సాగు చేస్తున్నారు. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆయా పంటలకు రెండో దఫా యూరియా వేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు. దీంతో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది.
 యూరియా ఖాళీ..
 జిల్లాకు కేటాయించిన ఎరువులో 50 శాతం మార్క్‌ఫెడ్‌కు వస్తుంది. అక్కడ నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చేరుతుంది. మిగిలిన 50 శాతం ప్రైవేట్ డీలర్లకు పంపిణీ అవుతుంది. మార్క్‌ఫెడ్‌కు సరఫరా అయిన యూరియా ఖాళీకావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. సెప్టెంబర్‌లో జిల్లాకు 25,486 టన్నుల ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించినా.. ఇప్పటివరకు కేవలం ఐదు ర్యాకుల్లో 10వేల టన్నులు మాత్రమే జిల్లాకు చేరింది. డీఏపీ ఈ నెలలో 2,345 టన్నుల అవసరమైనా ఇప్పటివరకు ఒక్కటన్ను ఊడా కేటాయించలేదు. ప్రైవేట్ డీలర్లు ఇప్పటికే యూరియాను నిల్వ ఉంచుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు చేసినా.. వారి కళ్లుగప్పినట్లు తెలుస్తోంది. యూరియా కొరత నేపథ్యంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. కొరతను అధిగమించేం దుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 రబీ ప్రణాళిక ఏదీ?
 ముందస్తు రబీ ప్రణాళిక రూపకల్పనలో వ్యవసాయశాఖ విఫలమైంది. ఇప్పటికే రబీకి అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితర ప్రణాళిక రూపొందించాల్సింది. ఎరువులను అంచనా వేసి దశలవారీగా తెప్పించడానికి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉన్నా.. అధికారులు మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, మండల వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు మాత్రం శూన్యం. 
 ఎరువుల కొరత లేదు
 జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదు. ఎంత అడిగితే అంత సప్లయ్ చేస్తాం. రబీ ప్రణాళిక సిద్ధం చేయలేదు. పంట పరిహారంతోపాటు రుణమాఫీ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాం. రబీ ప్రణాళికను త్వరలోనే సిద్ధం చేస్తాం. రబీలో 50 శాతం సబ్సిడీపై విత్తనాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. 
 - జేడీఏ ప్రసాద్
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement