
94 లక్షల యూనిట్ల లోటు
విక్రయాలతో పోలిస్తే తగ్గిన ఆవిష్కరణలు
నరెడ్కో–నైట్‌ఫ్రాంక్ నివేదిక
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో అందుబాటు ధరల విభాగంలో (రూ.50 లక్షల్లోపు) 94 లక్షల యూనిట్ల ఇళ్ల కొరత నెలకొంది. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ మొదటి ఆరు నెలల్లో (జనవరి – జూన్) తగ్గుముఖం పట్టిందని.. ఈ కాలంలో అందుబాటు ధరల ఇళ్ల యూనిట్ల విక్రయాలతో పోలి్చతే కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ నిష్పత్తి 0.36 శాతంగా ఉన్నట్టు నరెడ్కో–నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది.
2019 మొదటి ఆరు నెలల్లో ఇది 1.05గా ఉంటే, 2020 మొదటి ఆరు నెలల్లో 1.30గా ఉన్నట్టు తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈ నివేదికను నరెడ్కో, నైట్ ఫ్రాంక్ సంయుక్తంగా విడుదల చేశాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో సరఫరా పరంగా సవాళ్లు నెలకొన్నట్టు ఈ నివేదిక తెలిపింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్ గణాంకాలు ఇందులో ఉన్నాయి.
ప్రభుత్వ మద్దతు అవసరం..
అందుబాటు ధరల ఇళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ నివేదిక తెలియజేస్తుందని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు పేర్కొన్నారు. ఈ విభాగంలో 94 లక్షల యూనిట్ల కొరత ఉందంటూ.. 2030 నాటికి 3 కోట్ల యూనిట్లకు పెరుగుతుందన్నారు. ‘‘ఈ విభాగంలో కొత్త సరఫరా గణనీయంగా తగ్గింది. అదే సమయంలో డిమాండ్ పెరుగుతుండడం ఆందోళనకరం. ప్రైవేటు రంగం పెట్టుబడులు పరిమితంగానే ఉండడం ఈ అంతరాన్ని మరింత పెంచుతోంది. కనుక సరఫరాను పెంచేందుకు సంస్కరణలు అవసరం.
ఇళ్ల నిర్మాణానికి వీలుగా ప్రభుత్వ భూములను అందుబాటులోకి తీసుకురావాలి. ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలను క్రమబద్దీకరించాలి. నిర్మాణ కోసం రుణాలను రాయితీపై అందించాలి’’అని హరిబాబు కోరారు. డిమాండ్ పెంచేందుకు విధానపరమైన మద్దతు ప్రశంసనీయమేనని, అదే సమయంలో సరఫరా పరంగా ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ కోరారు. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు.