అక్రమంలో సక్రమం!

Shell Companies Hawala Business InTelangana Elections - Sakshi

వ్యవస్థీకృతంగా హవాలా గ్యాంగ్‌ దందా  

షెల్‌ కంపెనీల ముసుగులో బ్యాంక్‌ ఖాతాల్లో నగదు

కొత్త పుంతలు తొక్కుతున్న నగదు అక్రమ రవాణా

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ పోలీసులు బుధవారం పట్టుకున్న హవాలా గ్యాంగ్‌.. వ్యవస్థీకృతంగా దందా చేస్తున్నట్టు తేలింది. అక్రమ నగదు రవాణాను వివిధ కంపెనీల పేర్లతో పెట్టుబడుల ముసుగులో తరలిస్తున్నట్టు గుర్తించారు. ‘ఎన్నికల ఖర్చుల’ కోసం అడిగిన వారికి అందించడానికి డబ్బు సమీకరించి సిద్ధం చేసి ఉంచుతున్న సునీల్‌ కుమార్‌ అహుజాఇంటిపై బుధవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసిన విషయం తేలిసిందే. పోలీసులను చూడగానే విషయం అర్థం చేసుకున్న సునీల్‌ తన ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి ఆ నగదుకు సంబంధించిన లెక్కలు చెప్పేందుకు సిద్ధమయ్యాడు. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో అసలు విషయం బయట పడింది. 

‘ఇన్వెస్ట్‌మెంట్‌ బిజినెస్‌’ ముసుగులో..
అక్రమ ద్రవ్య మార్పిడి దందాను సైతం ఈ గ్యాంగ్‌ ‘సక్రమంగా చూపే ప్రయత్నం చేసింది. దాదాపు 15 షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసి వీటిలో పెట్టుబడిగా, లావాదేవీలకు డబ్బు వస్తున్నట్లు సృష్టించింది. సునీల్, అతడి కుమారుడు ఆషిష్‌ కలిసి ఆయా కంపెనీలతో పాటు తమ పేర్లతో ఉన్న 13 బ్యాంకు ఖాతాల్లోకి ఈ నిధులను మళ్లిస్తూ డ్రా చేస్తున్నారు. వీటికి లెక్కలను పక్కాగా సృష్టిస్తున్న సునీల్‌.. తన ల్యాప్‌టాప్‌లో భద్రపరుస్తున్నాడు. సాధారణంగా అది కంపెనీల సంబంధించిన డబ్బుగానే భావిస్తారు. పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అసలు విషయం గుర్తించగలిగారు.  

సెల్‌ఫోన్ల ద్వారానూ లాకర్‌ ఓపెన్‌
ఈ తండ్రీ కొడుకులకు జూబ్లీహిల్స్‌లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ బంజారాహిల్స్‌లోని నవీన్‌నగర్‌లో ఉన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇంట్లో రెండు బెడ్‌రూమ్స్, ఓ లాకర్‌ రూమ్‌ మాత్రమే ఉన్నాయి. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తింటారు. గదిలో ఉన్న మూడు లాకర్లలో ఒకటి రూ.2000 వేల నోట్లకు, మరోటి రూ.500 నోట్లకు, మూడోది మిగిలిన డినామినేషన్స్‌ కరెన్సీ కోసం వినియోగిస్తున్నారు. ఈ మూడు లాకర్లను సునీల్‌ తన స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్‌ చేసి ఎక్కడ నుంచి అయినా లాక్, అన్‌లాక్‌ చేసే సదుపాయం ఉంది. ఓ పెద్ద బీరువాను డాక్యుమెంట్లు భద్రపరచడానికి వినయోగిస్తున్నారు. మరోపక్క ఈ గదిలోనే ఓ కరెన్సీ కౌంటింగ్‌ మిషన్, కట్టల్ని సీల్‌ చేయడానికి మరో మిషన్‌ను పోలీసులు గుర్తించారు.  

అన్నప్రకారం చెల్లించకుంటే రిజిస్ట్రేషన్లు
ఈ తండ్రీకొడుకులు అక్రమ ద్రవ్యమార్పిడి దందాతో పాటు భారీ వడ్డీకి అప్పులు సైతం ఇస్తుంటారు. ఇలా తీసుకునే వారి నుంచి ష్యూరిటీగా విలువైన స్థలాలకు సంబంధించిన దస్తావేజులు తీసుకుంటారు. వీటితో పాటు కొన్ని ఖాళీ పేపర్లు, స్టాంప్‌ కాగితాలపై కూడా వారితో సంతకాలు తీసుకుంటారు. నిర్ణీత సమయంలో, చెప్పిన వడ్డీకి డబ్బు ఇవ్వకుంటే వీరి వ్యవహారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆయా స్థలాలను తమ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, జీపీఏ చేసుకుని వాటిని స్వాధీనం చేసుకుంటారు. వీరి ఇంటిపై దాడి చేసిన పోలీసులు కొన్ని స్థలాలకు సంబంధించిన దస్తావేజులు, కొందరి సంతకాలతో ఉన్న ఖాళీ పేరర్లు స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఇచ్చిన మొత్తాలు ఎంత? అవి ఎక్కడివి? తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. తండ్రీకొడుకులు తమ వ్యవహారాల్లో అవసరమైన నకిలీ పత్రాలను తన డ్రైవర్‌ ఆజం ద్వారా తయారు చేయిస్తున్నారు.  

చెక్‌పోస్టులపైఅసాంఘిక శక్తుల కన్ను
ఎన్నికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శాశ్వత చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. ఇవి ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని అసాంఘిక శక్తులు గుర్తించి ఆ మార్గాల్లో రాకుండా ప్రయత్యామ్నాయాలు ఎంచుకుంటున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. మరికొన్ని ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో వాహనాల తనిఖీలు, లాడ్జిల్లో సోదాలు ముమ్మరం చేస్తాం. హవాలా, హుండీ దందాలపై నిఘా వేసి ఉంచుతున్నాం.        – అంజనీకుమార్, నగర పోలీస్‌ కమిషనర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top