‘వెల్‌’డన్‌.. కుక్కపిల్లను కాపాడారు! 

Santosh Yadav Saves Dog From Farm well At Nizamabad - Sakshi

200 కి.మీ. ప్రయాణించి.. కుక్కపిల్లలను రక్షించి..

కరోనా వేళ నగరానికి చెందిన యువకుల జంతుప్రేమ 

సాక్షి, హైదరాబాద్‌: శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఫోన్‌ మోగింది. అవతలి వ్యక్తి ఏం చెప్పాడో ఏమో! ఐదుగురు యువకులు ఆ అర్ధరాత్రే బయలుదేరారు. 200 కి.మీ. ప్రయాణించి ఓ పాడుబడిన బావికి చేరుకున్నారు. అందులోకి తొంగిచూడగా అంతా అంధకారం. దట్టంగా పెరిగిన చెట్లు దడ పుట్టిస్తున్నాయి. అయినా వెరవక అందులోకి దిగారు. బిక్కుబిక్కుమంటున్న కుక్కపిల్లను అక్కున చేర్చుకున్నారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా పునర్జీవం పోశారు.  

పురాతన బావిలోకి దిగి... 
నిజామాబాద్‌ జిల్లా సిరికొండ గ్రామ శివారులో నిజాం జమానాలో రాతితో నిర్మించిన ఓ పురాతన వ్యవసాయబావి ఉంది. అందులో 20 రోజుల క్రితం 4 నెలల వయసున్న ఓ కుక్కపిల్ల పడిపోయింది. బాగా లోతుగా ఉన్న ఆ బావిలో చుక్క నీరులేదు. విపరీతంగా చెట్లు మొలిచాయి. అందులోకి దిగేందుకు ఎవరూ సాహసించడంలేదు. సంతోష్‌యాదవ్‌ అనే స్థానికుడు ఆ కుక్క పిల్లను గమనించి కొద్దిరోజులుగా పైనుంచి దానికి ఆహారం అందిస్తున్నాడు. భయంతో వణికిపోతున్న ఆ కుక్కపిల్ల చనిపోయే స్థితికి చేరడంతో దానిని రక్షించేవారికి కోసం ఇంటర్‌నెట్‌లో వివరాలు వెతికాడు.

నగరంలోని ‘యానిమల్‌ వారియర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ’వారి ఫోన్‌ నంబర్‌ కనుక్కొని సంస్థ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ‌వర్మకు శుక్రవారం రాత్రి 11.30కు ఫోన్‌ చేసి వివరాలు తెలిపాడు. సంజీవ్ ‌వర్మ వెంటనే సంస్థ సభ్యులైన మెస్సీ, రాఘవ్, ప్రభు, అమర్‌నాథ్‌లతో కలసి శనివారం ఉదయం సిరికొండకు వచ్చారు. కరోనా భయం వెంటాడుతున్నా 200 కి.మీ. దూరం ప్రయాణించి వచ్చి కుక్కపిల్లను కాపాడిన ఆ యువకులను గ్రామస్తులు అభినందించారు. కొద్దిరోజుల క్రితం వరంగల్‌లో ఓ వ్యవసాయబావిలో పడిన కుక్కను , హైదరాబాద్‌లో ఓ పురాతన దేవాలయంలో ఉన్న బావిలో పడిన పిల్లిని, నగర శివారులో ఓ గుర్రాన్ని కూడా ఇలాగే రక్షించామని సంజీవ్‌వర్మ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top