నేను పక్కా లీడర్‌..

Sakshi Interview With Gangula Kamalakar

ఉమ్మడి కుటుంబమే నా బలం

అన్నలది వ్యాపారం... భార్యది కుటుంబం

పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం

రాజకీయాల వల్ల పిల్లలతో గ్యాప్‌

మంత్రి ఈటల నాకు మరో అన్న

రాజకీయ సంపాదన అక్కర్లేదు

‘సాక్షి’ నాన్‌ పొలిటికల్‌ ఇంటర్వ్యూలో కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాంటెక్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరి మూడు నెలలకు మించి పనిచేయలేకపోయాడు. తనలాగే ఇంజనీరింగ్‌ చేసి గ్రానైట్‌ వ్యాపారం చేసుకుంటున్న అన్న దగ్గరికి చేరి తనూ ఓ చేయే శాడు. అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 19 ఏళ్లుగా కరీంనగర్‌ ప్రజలతో మమేకమై పోయారు. వార్డు కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా గెలిచి కార్పొరేషన్‌లో పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా కొన సాగుతూనే ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గంగుల కమలాకర్‌. కరీంనగర్‌ చరిత్రలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిౖకై న ఏకైక బీసీ నాయకుడు ఆయన. ఎమ్మెల్యే కమలాకర్‌తో ‘సాక్షి’ ప్రతినిధి జరిపిన ఎక్స్‌క్లూజివ్‌ నాన్‌ పొలిటికల్‌ ఇంటర్వ్యూ...

సాక్షి: గ్రానైట్‌ బిజినెస్‌లో బాగా సంపాదిస్తున్నారనే పేరుంది.. బిజినెస్‌ మ్యాన్‌ కాదంటారేం?
గంగుల: మా సొంతూరు వెల్గటూరు మండలం పైడిపెల్లి. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న గంగుల మల్లయ్య వ్యవసాయం చేస్తూనే కాంట్రాక్టులు చేసేవారు. అదే వ్యాపార లక్షణం మాకు వచ్చింది. నాకు ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కలు. అంతా ఉమ్మడి కుటుంబం. మా నాన్న మమ్ములను ఇంజనీర్లుగా చూడాలనుకున్నారు. అన్నయ్య గంగుల సుధాకర్‌ను, నన్ను సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివించారు. చదువు అయ్యాక సుధాకర్‌ అన్న గ్రానైట్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. నేను ఇంజనీరింగ్‌ అయ్యాక హైదరాబాద్‌లో మూడునెలలు ఉద్యోగం చేశా. అది అచ్చిరాదని తెలిసి అన్నతోపాటే గ్రానైట్‌ వ్యాపారంలోకి వచ్చేశా. తరువాత వదిలేశాను. ఇప్పుడు అన్నయ్య సుధాకర్‌ ఒక్కరే గ్రానైట్‌ వ్యాపారంలో ఉన్నారు. నాకు వ్యాపారంతో సంబంధం లేదు.

సాక్షి: మీరు బిజినెస్‌ మ్యానా లేక పొలిటీషియనా..?
గంగుల: నేను ప్రజా ప్రతినిధిని. 19 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రజలతో ఎన్నుకోబడుతూ వస్తున్న ప్రజా ప్రతినిధిని. 2000 సంవత్సరంలో కరీంనగర్‌ మునిసిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్‌ను. 2005లో కార్పొరేషన్‌ 14వ వార్డు కార్పొరేటర్‌ను. 2009 నుంచి వరుసగా మూడుసార్లు కరీంనగర్‌ ఎమ్మెల్యేను. సో నేను పక్కా ప్రజా ప్రతినిధినే.

సాక్షి: కోట్లు సంపాదించి పెట్టే గ్రానైట్‌ వ్యాపారాన్ని వదిలి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?
గంగుల: 2000 సంవత్సరం వరకు నాకు ఎమ్మెల్యే, ఎంపీల హోదాల గురించి కూడా పెద్దగా తెలియదు. 2000 సంవత్సరంలో కరీంనగర్‌ మునిసిపాలిటీ ఎన్నికలు వచ్చాయి. 11వ వార్డు బీసీ కేటగిరీలో రిజర్వు అయ్యింది. దాంతో మిత్రులంతా నన్ను పోటీ చేయమన్నారు. టీడీపీ నుంచి టికెట్టు ఇచ్చారు. పోటీ చేసి గెలిచాను. అప్పుడు కౌన్సిల్‌లోని 32 మందిలో టీడీపీ నుంచి ఐదుగురు గెలిచారు. వైస్‌ చైర్మన్‌ పదవి నాకిస్తానన్నారు. సరిపడా బలం లేకపోవడంతో 11 మంది ఇతర పార్టీ వాళ్లను టీడీపీలో చేర్పించి, 20రోజులు క్యాంపు రాజకీయాలు నడిపాను. వెన్నుపోటు రాజకీయాల రుచి అప్పుడే తెలిసింది. వైస్‌చైర్మన్‌గా గెలవలేదు. అప్పుడే రాజకీయాలు వదిలేయాలనుకున్నా. 2005లో మేయర్‌ బీసీలకు రిజర్వు కావడంతో మళ్లీ పోటీ చేయాల్సి వచ్చింది. గెలుపు నాకు చిరునామాగా మారింది. అందుకే వ్యాపారాలు అన్నలకు వదిలేసి, రాజకీయాల్లో స్థిరపడిపోయాను. ఓటమి దరి చేరకుండా నన్ను గెలిపిస్తున్న ప్రజలకు సేవ చేసేందుకు. 

సాక్షి: ఉమ్మడి కుటుంబంతో సమస్యలేమైనా ఎదురయ్యాయా?
గంగుల: ముందే చెప్పినట్టు నా కుటుంబమే నాకు బలం. ఇప్పటికీ మా అమ్మనాన్నలు, అన్నదమ్ములం ఒకే క్యాంపస్‌లో ఉంటాం. శుభకార్యాలు, పండుగలప్పుడు అందరం కలుస్తాం. నా భార్య, ముగ్గురు వదినెలు సొంత అక్కాచెల్లెల్లుగా కలిసి ఉంటారు. మాకేనాడు విభేదాలు రాలేదు. మా పిల్లలు, అన్నలు, అక్కల పిల్లల మధ్య కూడా సుహృద్భావ వాతావరణం ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రేమ అనురాగాలను మేము, మా పిల్లలు అనుభవిస్తున్నాం. మా మూడో అన్న ప్రభాకర్‌ గత సంవత్సరం గుండెపోటుతో మరణించడం మా కుటుంబానికి పెద్ద విషాదం. ఆ బాధ నుంచే తేరుకోలేకపోతున్నాం. 

సాక్షి: మీది ప్రేమ వివాహమా..? పెద్దలు కుదిర్చినదా? పిల్లల చదువులు..? 
గంగుల: నా భార్య రజితతో 1996లో తొలి పెళ్లిచూపులు జరిగాయి. అప్పుడే ఇద్దరం ఇష్టపడ్డాం. అయితే పెళ్లి విషయంలో ఇరువురి కుటుంబాల మధ్య విభేదాలు వచ్చా యి. పెళ్లి వద్దన్నారు. అప్పుడు మేం రెండు కుటుంబాల ను ఒప్పించి 1997 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాం. ఒకరకంగా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. మాకిద్దరు పిల్లలు. పెద్ద బాబు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్, పాప కరీంనగర్‌లోనే ఇంటర్‌ సెకండియర్‌. నీట్‌కు ప్రిపేర్‌ అవుతోంది. టెన్త్, ఇంటర్‌లో క్లాస్‌లో ముందున్న స్టూడెం ట్‌. మెడిసిన్‌లో సీటు కొడుతుందనే మా నమ్మకం. 

సాక్షి: రాజకీయ ఒత్తిళ్లలో పిల్లలతో మీకు అటాచ్‌మెంట్‌ ఎలా ఉంది?
గంగుల:  2000 సంవత్సరంలో కౌన్సిలర్‌గా ఎన్నికై రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సమయంలోనే పిల్లలు పుట్టారు. వాళ్లు పెరుగుతున్నప్పుడు తగిన సమయం ఇవ్వలేకపోయాను. నేను ఉదయాన్నే వార్డులకు వెళ్లే సమయానికి నిద్ర లేచేవారు కాదు. రాత్రి ఇంటికి వచ్చే సరికి పడుకునేవారు. ఆ గ్యాప్‌ వచ్చింది. వాళ్ల అమ్మ అన్నీ చూసుకునేది. అయితే వాళ్లు పెరుగుతున్న సమయంలో ఇంట్లో ఉన్నంత సేపు నాతోనే గడిపేవారు. ఏమైనా నా పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ పూర్తిగా మా రజిత(భార్య) చూసుకుంటుంది ఇప్పటికీ.

సాక్షి: డబ్బులు ఉన్నాయని జిల్లా  రాజకీయాలను శాసిస్తున్నారా?
గంగుల: ఉమ్మడి కుటుంబం నడిపే వ్యాపారం గ్రానైట్‌ బిజినెస్‌. వ్యవసాయం. నాకు ఇప్పటికీ డబ్బులు కావాలన్నా మా సుధాకర్‌ అన్నను అడుగుతా. నేను డబ్బులతో ఎప్పుడు, ఎక్కడా రాజకీయం చేయలేదు. రాజకీయాలను శాసించడం వంటి పెద్ద పదాలు నాకు తెలియదు. కేసీఆర్‌ సార్, కేటీఆర్‌ సార్‌ ఏం చెపితే అదే చేస్తా. కష్టాల్లో ఉన్న వారు వస్తే మాత్రం వారి పరిస్థితిని బట్టి నావంతు సాయం చేస్తా. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా. 

సాక్షి: మొన్న మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మంత్రి పదవికి పేరు వినిపించింది. ఎందుకు రాలేదంటారు?
గంగుల: కరీంనగర్‌లో ఉన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో నేను మంత్రి పదవి ఆశించలేదు. కానీ మంత్రి పదవికి నా పేరును ముఖ్యమంత్రి పరిశీలించినట్లు పత్రికల్లో చదివాను. అది నా అదృష్టం. ఎందుకు రాలేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం అది. సార్‌ ఏం చేసినా కరెక్టే. మంత్రి పదవి అడగను. వస్తే కాదనను. 

సాక్షి: చివరగా... మంత్రి పదవి విషయంలోనే ఈటల రాజేందర్‌తో విభేదాలు వచ్చాయని ఒక ప్రచారం. నిజమేనా?
గంగుల: బలప్రదర్శనతోనో, అడుక్కుంటేనో మంత్రి పదవి రాదు. అర్హత, రాజకీయ సమీకరణాలను బట్టి వస్తుంది. మంత్రి ఈటల రాజేందర్‌ నాకు మరో అన్న. ఆయనతో మంత్రి పదవి విషయంలో విభేదాలు అనే మాట పనిలేని వాళ్లు చేసే ప్రచారం. మా మధ్య ఇప్పటికీ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. నాకు ప్రజల బలం ఉంది. కరీంనగర్‌ చరిత్రలో ఐదుసార్లు వరుసగా గెలిపించారు. ఒక బీసీ మూడుసార్లు హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే కావడం రికార్డు. ప్రజల రుణం తీర్చుకునేందుకు పక్కా ప్రజా ప్రతినిధిగా పనిచేస్తా.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top