సంక్షోభంలో రైస్ మిల్లులు


మెదక్: లెవీ సేకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైస్ మిల్లులు సంక్షోభంలో పడ్డాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేస్తున్న బియ్యం లెవీని 75 శాతం నుంచి 25శాతానికి తగ్గించడంతో బిన్ని మిల్లులు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేం ద్రం కస్టం మిల్లింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టడంతో మిల్లర్లు విలవిలలాడుతున్నారు.



దరిమిలా జిల్లాలో ఉన్న 76 బాయిల్డ్ రైస్ మిల్లులు, 200 రా రైస్‌మిల్లులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రజా పంపిణీ  వ్యవస్థ (పీడీఎస్) కింద సబ్సిడీ బియ్యాన్ని సరఫరా చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం 75శాతం లెవీని అనుమతించేది. రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసిన వరిధాన్యంలో 75శాతం బియ్యాన్ని లెవీ కింద ఎఫ్‌సీఐకి సరఫరా చేసే అవకాశం ఉండేది.



 మిగతా 25శాతం స్వేచ్ఛా మార్కెట్‌లో అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. మిల్లర్లు కొనుగోలు చేసిన 100 క్వింటాళ్ల ధాన్యం నుంచి 67క్వింటాళ్ల ధాన్యాన్ని లెక్క గడతారు. ఇందులో లెవీ నిబంధనల ప్రకారం 75శాతం అంటే 50 క్వింటాళ్ల బియ్యం ప్రభుత్వానికి, 17క్వింటాళ్లు అంటే 25శాతం మిల్లర్లకు వెళ్తుండేది. కాని ప్రస్తుతం లేవిని 25శాతానికి తగ్గించడంతో 17క్వింటాళ్లు ప్రభుత్వానికి, 50 క్వింటాళ్లు మిల్లర్లకు వెళ్తుంది. ఎఫ్‌సీఐ కింద క్వింటాల్ బియ్యానికి సుమారు రూ.2100 చెల్లిస్తుండేవారు. దీంతో ఇది మిల్లర్లకు గిట్టుబాటుగా ఉండేది.



 25శాతం లెవీతో మిల్లర్ల లబోదిబో

 ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు వరి ధాన్యానికి మద్దతు ధర చెల్లించి 17శాతం తేమను అనుమతించి ఎఫ్‌సీఐకి 75శాతం ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ బియ్యాన్ని సరఫరా చేసే వారు. మిగతా 25శాతం బియ్యాన్ని స్వేచ్ఛా మార్కెట్‌లో అమ్ముకునేవారు. కాని ప్రస్తుతం స్వేచ్ఛా మార్కెట్‌లో బియ్యం అమ్ముకోవాలంటే సాటెక్స్ మెషిన్లలో మరపట్టిన బియ్యం అవసరం ఉంటుంది.



సాటెక్స్ మెషిన్ కొనుగోలు చేయాలంటే ఇందుకు సుమారు రూ.1.25కోట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో మొత్తం 76బాయిల్డ్ రైస్ మిల్లులు, 200 రా రైస్‌మిల్లులు ఉన్నాయి. గత ఏడాది 50వేల టన్నుల కస్టం మిల్లింగ్ రైస్, 1లక్ష15వేల టన్నుల రా బియ్యం, 1లక్ష10వేల టన్నుల బాయిల్డ్ రైస్ బియ్యం, 30వేల టన్నుల స్వేచ్ఛా విఫణి వియ్యం వెరసి సుమారు 3లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తయ్యాయి.



 గిట్టుబాటు కాని ధరలు

 కస్టం మిల్లింగ్ కింద 1 క్వింటాల్ ధాన్యాన్ని మర ఆడిస్తే ప్రభుత్వం కేవలం రూ.15ల చార్జి చెల్లిస్తుంది. ఇది 22 ఏళ్ల క్రితం నిర్ణయించిన ధర. అప్పట్లో రూ.1.20 పైసలకు యూనిట్ ఉన్న విద్యుత్ ధర నేడు రూ.9.10లకు చేరింది. అలాగే రవాణా ఖర్చులు, మెషినరీ రిపేర్లు, హమాలీల కూలీలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వం చార్జీలు మాత్రం పెంచలేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చూస్తే క్వింటాల్ ధాన్యానికి రూ.40లు చెల్లిస్తున్నట్లు మిల్లర్లు చెప్పారు.



కస్టం మిల్లింగ్ కింద కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.200లు రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు  ఐకేపీలు, సొసైటీల ద్వారా ధాన్యం సేకరణ చేసేందుకు నిర్ణయించింది. అయితే  హమాలీ, కమిషన్‌లు రూ.200ల మేర మిగిలించుకొని మిగతా డబ్బులు తమకు తమకు ఇస్తే కస్టం మిల్లింగ్ చేయడానికి తాము సిద్ధమేనని రైస్ మిల్లర్లు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top