పునరావాసం.. ప్రజల సమ్మతం | Sakshi
Sakshi News home page

పునరావాసం.. ప్రజల సమ్మతం

Published Fri, Jul 12 2019 12:21 PM

Rampur Villagers Agreed For The Resettlement Of Village In Nirmal Distrrict - Sakshi

సాక్షి, నిర్మల్‌: కవ్వాల్‌ రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు గ్రామాలను మరోచోటుకు తరలించడానికిగాను జిల్లా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్‌ గ్రామా లను అదే మండలంలోని ధర్మాజిపేట్‌ గ్రామ సమీపంలో గుర్తించిన అటవీ భూమిలో ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించడానికిగాను చర్యలను వేగవంతం చేశారు. ఈ మేరకు  ఆ రెండు గ్రామాలను మరోచోటకు తరలించడానికి ఇప్పటికే గ్రామస్తులు సమ్మతించడంతో ధర్మాజిపేట్‌ సమీపంలో ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ గ్రామ ప్రాంతంలో వివిధ శాఖల అధికారులు శుక్రవారం ప్రత్యామ్నాయ గ్రామ పున:స్థాపన చేసే ప్రాంతంలో పర్యటించనున్నారు. 

గ్రామం ఏర్పాటుకు ప్రణాళికలు  
ప్రస్తుతం ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న రాంపూర్, మైసంపేట్‌ గ్రామాలను ధర్మాజిపేట్‌ గ్రామ శివారు ప్రాంతంలోని 112 హెక్టార్ల అటవీ ప్రాంతంలో పున:స్థాపన చేయనున్నారు. ఈ మేర కు గ్రామం ఏర్పాటుకు కావాల్సిన పూర్తిస్థాయి సౌకర్యాలను కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇళ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్‌ సౌక ర్యం సామాజిక భవనాలు, పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రా ర్థన మందిరాలు, సీసీ రోడ్ల ఏర్పాటు, డ్రెయినేజీ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికిగాను ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించి ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు. 

142 కుటుంబాల తరలింపు  
రెండు గ్రామాల నుంచి మొత్తం 142 కుటుంబాలను ధర్మాజిపేట్‌ సమీపంలో ఏర్పాటు చేయను న్న పునరావాస గ్రామానికి తరలించనున్నారు. అయితే ఈ గ్రామంలో పూర్తిగా నివాసం, వ్యవసాయ భూమి, మౌలిక వసతుల కల్పన కోరుతూ 94 కుటుంబాలు అంగీకరించాయి. మరో 48 కుటుంబాలు మాత్రం తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాయి. ఇందుకుగాను నష్ట పరిహారం కోరిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు. 94 కుటుంబాలకు మాత్రం 250 చదరపు గజాల డబుల్‌ బెడ్‌ రూం, వ్యవసాయ భూమితో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ అంగీకరించారు.

వీరికి కడెం మండలంలోని ధర్మాజిపేట్‌ గ్రామ సమీపంలో 112 హెక్టార్ల భూమిని గుర్తించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ. 8 కోట్ల 52 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 5కోట్ల 64 లక్షలు మంజూరయ్యాయి. అధికారులు ప్రణాళికలు రూపొందించి పునరావాస గ్రామం ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. పునరావాస గ్రామ ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు అవసమైన చర్యలను తీసుకోనున్నారు.  

Advertisement
Advertisement