వందలమందైనా బేఫికర్‌

Rajat Kumar Interaction With Media Over VVPAT Technology - Sakshi

నోటాతో సహా 384 మంది వరకు కంట్రోల్‌ యూనిట్‌కు అనుసంధానం

గతంలో 64 మంది దాటితే బ్యాలెట్‌ పేపర్‌ అవసరమయ్యేది

ఈసారి రాష్ట్రంలో కొత్తగా వీవీప్యాట్‌లు కూడా

ఎవరికి ఓటు వేశారో 7 సెకన్ల వరకు స్క్రీన్‌పై..

ఆ తర్వాతే బాక్స్‌లోకి పేపర్‌ స్లిప్‌

ఈవీఎంలపై అవగాహన కార్యక్రమంలో సీఈఓ రజత్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఇప్పటి వరకు ఈవీఎంలలో ఓటు వేస్తే ఎవరికి పడిందో ఓటర్లకు తెలిసేది కాదు. త్వరలో రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తాను వేసిన ఓటు ఎవరికి పడిందో కూడా ఏడు సెకన్లపాటు తెరపై తెలుసుకోవచ్చు. ఇందుకు ఓటు వేసే ఈవీఎంలతోపాటు వీవీప్యాట్‌ మెషీన్లను వినియోగిస్తున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక తాను ఏ అభ్యర్థికి ఓటు వేసిందీ, బ్యాలెట్‌లో సీరియల్‌ నంబర్‌తో సహా తెలుస్తుంది. అలాగే ఈసారి నోటాతోసహా 384 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఈవీఎంలను వినియోగించవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో విక్టరీ ప్లేగ్రౌండ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, దివ్యాంగులకు ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో వారితో మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు.

అనంతరం రజత్‌కుమార్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో తొలిసారిగా వినియో గిస్తున్న వీవీప్యాట్‌లపై అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. 19 వేలకు పైగా పోలింగ్‌ లొకేషన్లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహి స్తామన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈవీఎం–ఎం3లను టాంపరింగ్‌ చేసే అవకాశం లేదని, ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈవీఎంల్లో సమస్యలున్నవి ఒక శాతం కంటే తక్కువే అన్నారు. వీవీప్యాట్‌లలో 8 నుంచి 9 శాతం వరకు ఇబ్బందులుండగా, అవి సాంకేతిక కారణాలతోనో లేక çసరైన జాగ్రత్తలు తీసుకోనందునో జరిగి ఉండవచ్చని పేర్కొంటూ బీఈఎల్‌ ఇంజనీర్లు కారణాలు పరిశీలిస్తున్నారని చెప్పారు. అవసరమైతే అదనపు వీవీప్యాట్‌లు తెప్పిస్తామన్నారు. కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరావులతో పాటు బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, ఎంఐఎంల ప్రతినిధులు అవగాహన కార్యక్రమంలో, మాక్‌ పోలింగ్‌లో పాల్గొన్నారు. వారు వేసిన ఓట్లు సరిగ్గా పడటంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

అవగాహన వాహనాల ప్రారంభం...
ఈవీఎం, వీవీప్యాట్‌ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా రాష్ట్రంలో 95 శాతం పూర్తయిందని రజత్‌కుమార్‌ తెలిపారు. మరో రెండు రోజుల్లో అంతటా పూర్తవుతుందన్నారు. ఈ సందర్భంగా 19 వాహనాలకు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ వాహనాలు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాయని, వీటిల్లో కొన్ని దివ్యాంగుల కోసం కేటాయించినట్లు తెలిపారు. ఇదే కాక ప్రతివార్డులో ఓటరు అవగాహన కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

‘వీవీప్యాట్‌’సమయం పెంచాలి...
వీవీప్యాట్‌లో తాము ఎవరికి ఓటు వేసింది తెలుసుకునేందుకు 7 సెకన్ల సమయం చాలదని, దాన్ని పెంచాలని కోరినట్లు మర్రి శశిధర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. అవసరమైతే దీని కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళతామన్నారు. ఓటరు జాబితాలో పొరపాట్లున్నాయని సీఈఓ దృష్టికి తెచ్చామని చెప్పారు. ముందస్తుకు సంబంధించి ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు వేయడాన్ని ప్రస్తావిస్తూ, విచారణ సమయంలో అదనపు సమాచారాన్ని అందజేస్తామన్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలతో పోలింగ్‌ ఆగితే ఆ మేరకు అదనపు సమయమిస్తామని రజత్‌కుమార్‌ తెలిపినట్లు టీడీపీ ప్రతినిధి వనం రమేశ్‌ తెలిపారు. ఓటింగ్‌ మెషీన్ల పనితీరు, వీవీప్యాట్‌లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి 42 ప్రాంతాల్లో శాశ్వత కేంద్రాలను, 3 సంచార వాహనాలను వినియోగించనున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ తెలిపారు. 

మూడొందల మంది పోటీలో ఉన్నా.. 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించనున్న ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీప్యాట్‌)లతో ఓటరు తాను ఎవరికి ఓటు వేసిందీ చూసుకునే సదుపాయంతోపాటు, కొత్త సాంకేతికతతో బరిలో వంద మందికి పైగా అభ్యర్థులున్నా ఈవీఎంలను వినియోగింవచ్చు. ఇప్పటి వరకు 64 మంది అభ్యర్థుల వరకే ఈ సదుపాయం ఉండేది. అంతకంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉంటే పేపర్‌ బ్యాలెట్‌ అవసరమయ్యేది. ఈసారి వినియోగిస్తున్న ఎం–3 ఈవీఎంల్లో ఒక కంట్రోల్‌ యూనిట్‌కు సంబంధించి ఒక బ్యాలెట్‌ యూనిట్‌ నుంచి మరో బ్యాలెట్‌ యూనిట్‌కు అనుసంధానం చేసే అవకాశం ఉండటంతో గరిష్టంగా 24 బ్యాలెట్‌ యూనిట్లను అనుసంధానం చేయవచ్చు. తద్వారా నోటాతో సహా 384 మంది వరకు పోటీలో ఉన్నా ఈవీఎంలను వినియోగించవచ్చని అధికారులు వివరించారు. స్వల్ప తేడాతో గెలుపోటములు ప్రభావితమయ్యేప్పుడు అభ్యర్థుల ఫిర్యాదుల మేరకు లెక్కించడానికి ఇవి ఉపకరిస్తాయని తెలిపారు. ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థి ఫిర్యాదు చేసినా లెక్కించేందుకు ఉపకరిస్తాయన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top