‘పై’ హోదా.. ‘కింది’ పోస్టు!

Promotions For Telangana Police Department - Sakshi

పోలీస్‌ విభాగంలో విచిత్ర సంఘటన   

ఐపీఎస్‌ల పదోన్నతుల ప్రకటన ఎలక్షన్‌ కోడ్‌తో బదిలీలకు బ్రేక్‌  

వాస్తవ హోదాకు కిందిస్థాయి పోస్టులో పనిచేయాల్సిన పరిస్థితి  

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీస్‌ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఐపీఎస్‌ అధికారులకు మంగళవారం పదోన్నతులు ప్రకటించగా... అధికారులు వాస్తవ హోదా కంటే కిందిస్థాయి పోస్టుల్లో పనిచేయాల్సి వస్తోంది. రాష్ట్ర పోలీస్‌ విభాగంలో పనిచేస్తున్న 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నగరంలోని మూడు కమిషనరేట్లలో పని చేస్తున్న ఏడుగురు ఉన్నారు. అయితే ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా పదోన్నతులు ఇవ్వడంతో బదిలీలు సాధ్యం కాలేదు. ఫలితంగా ప్రతి అధికారి వారు పని చేస్తున్న స్థానంలోనే పదోన్నతి పొందిన హోదాతో కొనసాగేలా ఆదేశాలు ఇచ్చింది. ఈ కారణంగానే ఈ అరుదైన అంశం చోటు చేసుకుంది. పోలీస్‌ కమిషనరేట్‌కు నేతృత్వం వహించే కమిషనర్‌ నుంచి పోలీస్‌ స్టేషన్‌కు ఇన్‌చార్జ్‌గా ఉండే స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) వరకు నిర్దిçష్ట హోదాలు ఉంటాయి. ఆ హోదా దాటి పదోన్నతి వచ్చినప్పుడు వారిని బదిలీ చేయడం అనివార్యం. అదనపు డీజీ ర్యాంక్‌ అధికారి పోలీస్‌ కమిషనర్‌గా ఉంటారు. సిటీ పోలీస్‌కు ఈయనే బాస్‌ కాబట్టి అదనపు కమిషనర్లు అంతా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీ) ర్యాంక్‌ వాళ్లే ఉంటారు.

అరుదైన సందర్భాల్లో తప్ప మిగిలినప్పుడు ఇదే విధానం కొనసాగుతూ ఉంటుంది. నగర పోలీస్‌ కమిషనర్‌గా అదనపు డీజీ కాకుండా డీజీ స్థాయి అధికారి కొనసాగిన ఉదంతాలు ఇప్పటివరకు మూడుసార్లు చోటు చేసుకున్నాయి. కొన్నేళ్ల క్రితం పేర్వారం రాములు, 2014లో అనురాగ్‌శర్మ, 2018లో ఎం.మహేందర్‌రెడ్డి ఇలా పని చేశారు. వీరికి డైరెక్టర్‌ జనరల్స్‌గా (డీజీ) పదోన్నతి వచ్చే నాటికి నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్నాళ్లు నగర కొత్వాల్‌గా కొనసాగారు. నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్‌) ఎస్పీ స్థాయి అధికారి డీసీపీగా ఉంటారు. అయితే నాలుగేళ్ల క్రితం టి.ప్రభాకర్‌రావుకు మాత్రం తొలిసారిగా సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ (జేసీపీ) హోదాలో సీసీఎస్‌ అధిపతిగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఆపై గతేడాది ఆగస్టులో ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందిన వారు సైతం సమీపంలో గణేశ్‌ నిమిజ్జనం ఉండడంతో కొన్నాళ్ల పాటు డీఎస్పీ/ఏసీపీ హోదాలోనే స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా కొనసాగాల్సి వచ్చింది.

తాజాగా ఐపీఎస్‌ల పదోన్నతుల నేపథ్యంలో సిటీ కమిషనరేట్‌లో డీసీపీ నుంచి అదనపు సీపీ వరకు వివిధ హోదాల్లో ఉన్న ఆరుగురు అధికారులు ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో బదిలీలు లేకుండా పాత స్థానాల్లోనే కొనసాగిల్సి వచ్చింది. ఈ హోదాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. నగర అదనపు సీపీ (క్రైమ్స్‌ అండ్‌ సిట్‌) పోస్టు ఐజీ హోదా అధికారిది. అయితే ఇక్కడ పని చేస్తున్న శిఖాగోయల్‌కు అదనపు డీజీగా పదోన్నతి వచ్చినా అక్కడే కొనసాగనున్నారు. ఎస్పీ హోదాలో వెస్ట్‌జోన్‌ డీసీపీగా పనిచేస్తున్న ఏఆర్‌ శ్రీనివాస్‌కు డీఐజీగా పదోన్నతి వచ్చింది. అయినప్పటికీ ఆయన మరికొన్ని రోజులు వెస్ట్‌జోన్‌ డీసీపీగానే పని చేయాల్సి ఉంది. అలాగే సీసీఎస్‌ డీసీపీ అవినాశ్‌ మహంతి, మధ్య మండల డీసీపీ పి.విశ్వప్రసాద్, తూర్పు మండల డీసీపీ ఎం.రమేశ్‌లూ ఇలానే కొనసాగనున్నారు. వీరితో పాటు మాదాపూర్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావుకు సీనియర్‌ ఎస్పీగా పదోన్నతి వచ్చింది. ఈ హోదాలో డీసీపీగానూ పనిచేసే ఆస్కారం ఉండడంతో ఆ పోస్టులోనే కొనసాగనున్నారు. కేవలం రాచకొండ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌గా పని చేస్తున్న జి.సుధీర్‌బాబును మాత్రం అదనపు సీపీగా నియమించారు. ప్రస్తుతం డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొందిన ఆయన అదనపు సీపీగా నియమితులయ్యారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈయనకు బాస్‌గా ఉన్న రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సైతం ఐజీ ర్యాంక్‌ అధికారే. అయితే ఆయన సుధీర్‌బాబు కంటే సీనియర్‌. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top