బోధకాలు నివారణే లక్ష్యం

Preaching Leg Diseases In Nalgonda - Sakshi

నల్లగొండ టౌన్‌ : ప్రజల్లో బోధకాలు వ్యాధి, నులిపురుగుల (నట్టల) నివారణకు ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 19నుంచి 21వరకు మూడు రోజుల పాటు సామూహిక డీఈసీ, ఆల్బెండజోల్‌ మాత్రలను మింగించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసేపనిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే తలమునకలై ఉంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సీడీపీఓలకు ఈ నెల 14న, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, ఇతర వలంటీర్లకు 15, 16 తేదీల్లో శిక్షణను ఇవ్వనున్నారు. జిల్లాలో ఇప్పటి       వరకు 5,829 మంది బోధకాలు వ్యాధితో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

జిల్లాకు చేరిన మాత్రలు : ల
జిల్లాలోని 31 మండలాల్లో గల అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మాత్రల పంపిణీకి అవసరమైన చర్యలు     చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 15,27,845 మందికి మాత్రలను మింగించాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 42,01,573 డీఈసీ (100గ్రాములు) మాత్రలను, 15,27,845  ఆల్బెండజోల్‌ (400 గ్రాముల) మాత్రలను జిల్లాకు తెప్పించి అన్ని మండలాలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. మాత్రలను మింగించడానికి 6,111 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు.

2 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్ల లకు డీఈసీ మాత్ర 1, ఆల్బెండజోల్‌ మాత్ర 1, 6 నుంచి 14 సంవత్సరాలలోపు వయస్సు వారికి డీఈసీ 2, ఆల్బెండజోల్‌ 1, 15 సంవత్సరాల పైబడిన వారికి డీఈసీ 3, ఆల్బెండజోల్‌ మాత్ర 1 చొప్పున మింగించనున్నారు. కార్యక్రమ పర్యవేక్షణకు 601 మంది సూపర్‌వైజర్లను నియమించారు. 40 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు. కార్యక్రమాన్ని కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ఉప్పల్, జాయింట్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ గంగవరప్రసాద్, జిల్లా మలేరియా అధికారి రుద్రాక్షి దుర్గయ్యతో పాటు ఇతర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు.

బోధకాలు వ్యాధి ఎలా వస్తుంది..
ఫైలేరియా అనే సూక్మ క్రిమి ద్వారా బోధకాలు వ్యాధి వస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్‌ దోమ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దోమలను నివారించడానికి మురుగు నిల్వ లేకుండా పరిసరాలను ఉంచుకోవాలి.

ప్రతిఒక్కరూ మాత్రలు మింగాలి
ఈనెల 19 నుంచి 21 వరకు మూడు రోజులపాటు నిర్వహించే సామూహిక డీఈసీ, అల్బెండజోల్‌ మాత్రల మింగించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ విధిగా మాత్రలను మింగాలి. మాత్రల వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ ఉండదు. మాత్రలను వేసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తినా.. ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయి. తగ్గనిపక్షంలో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్‌ను సంప్రదించి చికిత్స పొందాలి. కార్యక్రమం విజయవంతానికి ప్రతిఒక్కరూ సహకరించాలి.– ఆర్‌.దుర్గయ్య, జిల్లా మలేరియా అధికారి 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top