పీఆర్‌సీ ఫిట్‌మెంట్ 35%! | PRC Fitment 35% | Sakshi
Sakshi News home page

పీఆర్‌సీ ఫిట్‌మెంట్ 35%!

Nov 5 2014 1:52 AM | Updated on Jul 11 2019 5:33 PM

పీఆర్‌సీ ఫిట్‌మెంట్ 35%! - Sakshi

పీఆర్‌సీ ఫిట్‌మెంట్ 35%!

ఉద్యోగులకు వేతన సవరణ కింద 35 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

 తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
 బడ్జెట్‌లోనూ రూ. 2వేల కోట్ల కేటాయింపులు!
 
 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు వేతన సవరణ కింద 35 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు అధికారవర్గాల సమాచారం. రాష్ట్ర విభజనకు కొద్ది రోజుల ముందే పదో వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) చైర్మన్ అగర్వాల్  పీఆర్‌సీ నివేదికను గవర్నర్ నరసింహన్‌కు సమర్పించారు. ఆ తర్వాత రాష్ర్ట విభజన జరగడంతో ఆ నివేదికను ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు గవర్నర్ పంపించారు. అగర్వాల్ తన నివేదికలో ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్ సిఫారసు చేసినట్లు సమాచారం. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని ప్రకటించారు. అయితే ఆ వెంటనే ఎన్నికలు రావడంతోపాటు, కొత్త రాష్ట్రాల్లో ఏర్పాటైన ప్రభుత్వాలు ఈ అంశంపై ఇప్పటివరకు పెద్దగా దృష్టి పెట్టలేదు. తెలంగాణ ఉద్యోగులకు కేంద్రం స్థాయిలో వేతనాలు అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
 
  అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఈ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో కమిటీని కూడా నియమించారు. అయితే ప్రస్తుతం కేంద్ర వేతనాలను అమలు చేస్తే.. రాష్ట్ర ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పీఆర్‌సీ సిఫారసులు ఇప్పటికే వచ్చినందున వాటిని ముందుగా అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే పీఆర్‌సీపై దీపావళి తర్వాత చర్చిద్దామని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌లోనే పీఆర్‌సీ అమలు కోసం దాదాపు రూ. రెండు వేల కోట్ల మేరకు కేటాయింపులు జరిపినట్లు సమాచారం. ఉద్యోగులు కోరుతున్న విధంగా ఫిట్‌మెంట్‌ను ప్రకటించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. తొమ్మిదవ పీఆర్‌సీలో ఉద్యోగులకు 39% ఫిట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం 62% ఫిట్‌మెంట్ కోరుతున్నాయి. కాగా ప్రభుత్వం 35 శాతం మేరకు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో 3.19 లక్షల మంది ఉద్యోగులు, 2.42 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. పీఆర్‌సీ అమలుతో తమకూ వేతనాలు పెరుగుతాయని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement