నయీం అనుచరులకు ఖాకీల అండ

police support to gangster nayeem Followers  - Sakshi

పలు కేసుల్లో నిందితుడిగా వరంగల్‌ సెంట్రల్‌జైల్‌లో పాశం శ్రీను

భువనగిరి కోర్టుకు తీసుకువచ్చే సమయంలో సెల్‌ఫోన్లలో బెదిరింప

మార్గమధ్య దాబాలో విందులు, వినోదాలు

ఎస్కార్ట్‌ డ్యూటీ పోలీస్‌కు 30వేల రూపాయలు

 డబ్బును ఎరగా వేసి పని చేయించుకున్న శ్రీను

ఒక్కసారి ఎస్కార్ట్‌గా వెళ్లొస్తే చాలనుకుంటున్న సిబ్బంది

సాక్షి, యాదాద్రి : గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం అరెస్ట్‌ చేసిన అతడి అనుచరులకు పోలీస్‌ల సహకారం మెండుగా ఉంటోంది. శుక్రవారం వెలుగు చూసిన నలుగురు పోలీసుల సస్పెన్షన్‌తో నయీం ముఠాకు ఖాకీల సహకారం ఏ మేరకు ఉందో మరోసారి తేటతెల్లమైంది.  ముఖ్య అనుచరుడు పాశం శ్రీను వరంగల్‌జైల్లో ఉన్నప్పటికీ అతనికి ఆరు నెలలుగా కొందరు పోలీసులు సహకరించారని తేటతెల్లమైంది. గురువారం పోలీసులు భువనగిరిలో పాశం శ్రీనుకు చెందిన ఐదుగురు అనుచరులను అరెస్ట్‌ చేయడంతో మరోమారు విషయం  చర్చనీయాంశమైంది.

 పీడీ యాక్టు నమోదై వివిధ కేసుల్లో వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్న పాశం శ్రీనును భువనగిరి కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ఎస్కార్ట్‌ పోలీస్‌లు సహకరించినట్లు తేలడంతో వారిపై వేటు పడింది. అయితే పాశం శ్రీను ఎస్కార్ట్‌ పోలీస్‌లకు పెద్దఎత్తున డబ్బులను ముట్టజెబుతుండడంతో ఆ డ్యూటీలకు ఏఆర్‌ పోలీసుల్లో తీవ్రమైన డిమాండ్‌ ఏర్పడింది. వరంగల్‌ సెంట్రల్‌ జైలు నుంచి భువనగిరి కోర్టుకు తీసుకువచ్చి తిరిగి జైలులో అప్పగించే వరకు పోలీస్‌ ఎస్కార్ట్‌ ఉంటుంది. డ్యూటీలో ఉన్న ఒక్కో పోలీస్‌కు రూ.30వేలు, డ్యూటీ వేసిన అధికారికి రూ.10 వేలు పాశం శ్రీను ముట్ట చెబుతున్నారని సమాచారం. ఒక్కసారి ఆ డ్యూటీకీ వెళ్తే చాలు కొంత మొత్తం చేతికి వస్తుందన్న ఆశతో డిమాండ్‌ పెరిగింది. 

శ్రీనుకు స్వేచ్ఛ..సెల్‌ఫోన్లలో బెదిరింపులు
 డబ్బులు తీసుకుంటున్న ఎస్కార్ట్‌ పోలీసులు..పాశం శ్రీనును స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పించారు. కొన్ని సెటిల్‌మెంట్ల విషయంలో అతను సెల్‌ఫోన్‌లో బెదిరింపులకు దిగడంతో బాధితులు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జరిపిన విచారణలో పోలీసుల సహకారం ఉన్నట్లు అనుమానాలు వచ్చాయి. ఈ కోణంలో ఎస్కార్ట్‌ పోలీస్‌ల సెల్‌ఫోన్‌లతోపాటు, పాశం శ్రీనుకు చెందిన మరికొందరు అనుచరుల ఫోన్‌లపై నిఘాపెట్టారు. 

గత నెల భువనగిరి కోర్టుకు వచ్చి తిరిగి వరంగల్‌ జైలుకు తీసుకెళ్తున్న సమయంలో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ సరిహద్దు దాటిన తర్వాత..జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలో జాతీయరహదారి పక్కన గల డాబాలో పాశం శ్రీను, అతని అనుచరులు కలిసి విందులు, వినోదలు చేశారు. ఎస్కార్ట్‌ పోలీస్‌ బృందంలోని ఆర్‌ఎస్‌ఐలు రమేష్, పాషా, హెడ్‌కానిస్టేబుళ్లు రమేష్, లక్షినారాయణకు చెందిన సెల్‌ఫోన్‌ల నుంచి బెదిరింపు కాల్స్‌ చేశాడు. ఈ విషయం సిట్‌ విచారణలో బయటపడడంతో పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇదే కేసులో పాశం శ్రీను తమ్ముడు మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్‌ పాశం అమర్‌నాథ్, అనుచరులైన అందెసాయి కృష్ణ, అంగడి నాగరాజు,మెరుగు శివశంకర్, పులి శ్రీనివాస్‌ లపై కేసులు నమోదుచేసి జైలుకు పంపించారు. 

పెరిగిన నిఘా..
కొంతకాలంగా నయిమ్‌ ముఠా సభ్యుల బెదిరింపులు ప్రారంభమయ్యాయని పలువురు పోలీసులను ఆశ్రయిస్తుండడంతో..నిఘాపెంచారు. ఇందుకోసం సిట్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిరంతర నిఘా కొనసాగిస్తూ నయీమ్‌ పేరుతో ఆగడాలు సాగించే వారిని అణిచివేస్తామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌  హెచ్చరిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top