తాత్కాలిక కార్మికులతో బస్సులను నడిపించిన అధికారులు

Parigi Officers Rode The Buses With Temporary Workers - Sakshi

జిల్లాలో మొత్తం బస్సులు 254

రోడ్డెక్కిన 151 బస్సులు

మూడోరోజూ కార్మికుల సమ్మె

సాక్షి, తాండూరు: జిల్లాలో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. తాత్కాలిక కార్మికులతో అధికారులు బస్సులను నడిపిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఈనెల 5నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. తాత్కాలికంగా కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులను తిప్పుతోంది. అయితే, ఆర్టీసీకి మాత్రం తీవ్ర నష్టాలు వస్తున్నాయి. తాత్కాలిక సిబ్బంది అందిన కాడికి జేబులు నింపుకోవడంతో పరిస్థితి దారుణంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో సదరు సంస్థకు రూ.60 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. మన జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరు పట్టణాల్లో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ మూడు డిపోల్లో కలిసి మొత్తం 254 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. సుమారు 700 మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తుండేవారు. నిత్యం దాదాపు రూ.22 లక్షల ఆదాయాన్ని సంస్థ ఆర్జిస్తుండేది. ఈనెల 5నుంచి కార్మికులు సమ్మెకు దిగారు.

బస్సులను ఎలాగైనా తిప్పాలనే తలంపుతో డిపోలను పోలీసుశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 5వ తేదీన జిల్లాలో 86 బస్సులు, మరుసటి రోజు 143 బస్సులు, సోమవారం 151 బస్సులను నడిపించారు. జిల్లాలో దాదాపు 90 మంది అద్దె కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. ఇందులో కొన్ని అద్దె బస్సులు ఉన్నాయి. మూడురోజులు బస్సులను తిప్పినా జిల్లా మొత్తం రూ.4 లక్షలే రావడం గమనార్హం. సందట్లో సడేమియా అన్నచందంగా ప్రైవేట్‌ వాహనదారులు అందిన కాడికి ప్రయాణికులను దోచుకుంటున్నారు. బస్సుల్లోనూ చార్జీలకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల భద్రత నడుము బస్సులు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. సోమవారం పరిగిలో డ్రైవర్లు, కండక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి బస్‌డిపో వద్ద నిరసన వ్యక్తం చేసే యత్నం చేశారు. 144 సెక్షన్‌ అమలులో ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకొని ఠాణాకు తరలించారు. దీంతో కార్మికులు ఠాణా ఎదుటే బైఠాయించారు.  కేసీఆర్‌ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.   

తగ్గేది లేదంటున్న కార్మికులు  
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు భీష్మించారు. కార్మికులతో చర్చలు జరిపేది లేదని సర్కారు స్పష్టం చేస్తోంది. ఇటు ఆర్టీసీ, అటు సర్కారు పంతానికి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఆర్టీసీ కార్మికులకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.  

ఆదాయం తక్కువే.. 
మన జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు ఆర్టీసీ డిపోల ద్వా రా ఇప్పటివరకు 151 బస్సులను రోడ్డుపైకి తీసుకొచ్చాం. అయితే, ప్రయాణికులు సంఖ్య పెరగడం లేదు. గతంలో నిత్యం రూ.22లక్షల ఆదాయం సమకూరేది. ప్రస్తుతం మూడు రోజుల్లో కేవలం జిల్లా మొత్తంలో ఆర్టీసీకి కేవలం రూ.4 లక్షలు మాత్రమే వచ్చాయి.   
– రమేష్, డీవీఎం, వికారాబాద్‌ జిల్లా   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top