ఏకగ్రీవాల జోరు 

Panchayat Elections Notifications Ends Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. జిల్లాలో తొలి విడతలో జరుగుతున్న పంచాయతీల్లో 36 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో ఒకరిద్దరు మినహా మిగిలిన అన్ని పంచాయతీల సర్పంచ్‌లు టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 177 పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 20 శాతం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం గమనార్హం.

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఈ పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు బుజ్జగింపులు, బేరసారాలు జోరుగా సాగాయి. కొన్ని ఏకగ్రీవ సర్పంచ్‌ స్థానాలు రూ.లక్షలు పలికినట్లు సమాచారం. తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో ముట్టజెబుతామని ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సర్పంచ్‌ స్థానాలకు వేలం పాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కానీ లోపాయికారి ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఓ గ్రామ పంచాయతీలో ఐదు సంవత్సరాల పదవీ కాలంలో రెండున్నర సంవత్సరాలు ఒకరు సర్పంచ్‌గా ఉంటే, ఉప సర్పంచ్‌ తర్వాతి రెండున్నర సంవత్సరాలు సర్పంచ్‌ పదవి చేపట్టాలనే ఒప్పందంతో ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. మరికొన్ని పంచాయతీల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు నామినేషన్లు వేసిన అభ్యర్థులతో మాట్లాడి ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. మొత్తం మీద 36 గ్రామపంచాయతీల్లో ఒకటీ రెండు మినహా అన్ని జీపీల్లో టీఆర్‌ఎస్‌ తన పట్టును నిలుపుకుంది.

తేలిన అభ్యర్థులు.. 
నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగి యడంతో బరిలో ఉండే అభ్యర్థులెవరో తే లింది. ఆదివారం మధ్యాహ్నం మూడు గం టలకు ఉపసంహరణకు గడువు ముగిసింది. రిటర్నింగ్‌ అధికారులు వెంటనే బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 177 స్థానాల్లో ఏకగ్రీవమైన 36 స్థానాలు మినహాయిస్తే 141 గ్రామపంచాయతీల సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. తొలి విడత పోలింగ్‌ ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్‌ నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇచ్చింది.
 
ఇక గ్రామాల్లో ప్రచార హోరు.. 
బరిలో ఉన్న అభ్యర్థులెవరో తేలడంతో గ్రామాల్లో ఇక ప్రచారం జోరందుకోనుంది. వారం రోజుల పాటు అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు. ఇంటింటికీ తిరిగి తమకు గెలిపించాలని ఓట్లు అభ్యర్థించనున్నారు. గ్రామాల్లో కుల సంఘాలు కీలకం కావడంతో ఈ సంఘాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. పార్టీ రహిత ఎన్నికల కావడంతో ఎన్నికల అధికారులు కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు ప్రచారం నిర్వహించనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top