లాభసాటి వ్యవసాయం మేలు | Padma Devender Reddy Talk On Agriculture Medak | Sakshi
Sakshi News home page

లాభసాటి వ్యవసాయం మేలు

Jun 12 2019 2:42 PM | Updated on Jun 12 2019 2:42 PM

Padma Devender Reddy Talk On Agriculture Medak - Sakshi

రైతుకు ఎరువుల బస్తాను అందజేస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఇతర అధికారులు

సాక్షి, మెదక్‌ : ఉన్న నీటితో లాభసాటి పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. నూనె గింజల ఉత్పత్తి కోసం ఎంపిక చేసిన మెదక్‌ మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో మంగళవారం దళిత రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డితో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరి పండించేందుకు ఎక్కువ నీరు అవసరమని.. వాణిజ్య పంటలకు తక్కువ నీరు అవసరమని వివరించారు. ఈ మేరకు వాణిజ్య పంటల సాగు దిశగా రైతులు ముందుకు సాగాలన్నారు. జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడు ఒకే రకమైన పంటలు వేయకుండా.. పంట మార్పిడి పద్ధతులు అవలంబించాలని సూచించారు. ఇందులో ఈ గ్రామం ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయం : పద్మాదేవేందర్‌రెడ్డి
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో వెంకటాపూర్‌ గ్రామం ఎంపిక కావడంలో అధికారుల కృషి అభినందనీయమన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. అంతేకాదు.. భూమి లేని దళిత కుటుంబాలకు నాటు కోళ్ల పెంపకానికి సంబంధించి పిల్లలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ రైతులు ఇలాంటి ఫలాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మెదక్‌ మండల పరిషత్‌ అధ్యక్షురాలు లక్ష్మీకిష్టయ్య, సర్పంచ్, శాస్త్రవేత్తలు సతీష్, మంజునాథ్, పద్మావతితోపాటు జిల్లా వ్యవసాయ శాఖాధికారి పరశురాం నాయక్, ఏడీఏ నగేశ్‌ కుమార్, ఏపీడీ ఉమాదేవి, తహసీల్దార్‌ రవికుమార్, మండల వ్యవసాయాధికారి రెబల్‌సన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement