మంటకలిసిన మానవత్వం.. అనారోగ్యంతో ఉన్నాడని.. | Owner Not Allowed Elderly Man Due To Health Problems | Sakshi
Sakshi News home page

మంటకలిసిన మానవత్వం.. అనారోగ్యంతో ఉన్నాడని..

Dec 15 2018 11:47 AM | Updated on Dec 15 2018 11:47 AM

Owner Not Allowed Elderly Man Due To Health Problems - Sakshi

ఊరు చివర ఏర్పాటు చేసుకున్న గుడిసెలో ఉన్న మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

అనారోగ్యంతో ఉన్నాడనే కారణంతో చనిపోతే ఇల్లు శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని...

సభ్య సమాజం తలదించుకునేలా.. మానవత్వం మంట కలిసిందా అని ప్రశ్నించేలా ఓ విషాద ఘటన తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో చోటుచేసుకుంది. సిరిసిల్ల నెహ్రూనగర్‌లోని అద్దె ఇంట్లో నివాసముంటున్న సిరిపురం వెంకటమల్లు(70)ను అనారోగ్యంతో ఉన్నాడనే కారణంతో చనిపోతే ఇల్లు శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని కనుకుంట్ల మల్లయ్య ఆసుపత్రి నుంచి ఇంట్లోకి రావడానికి అనుమతించలేదు. ఇంటిముందు ఉంచేందుకు సైతం ఒప్పుకోలేదు. దాంతో గత్యంతరం లేక వెంకటమల్లు కుటుంబసభ్యులు కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా ఇందిరమ్మకాలనీ ఊరు చివరకు తరలించారు. అక్కడే కప్పుకునే బట్టలతో గుడిసె లాంటిది ఏర్పాటు చేసుకొని వారం రోజులుగా చలిలోనే వెల్లదీస్తున్నారు. గురువారం వెంకటమల్లు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచాడు.

తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిపురం వెంకటమల్లు ఎన్నో ఏళ్లుగా మరమగ్గాల కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సంవత్సర కాలంగా అనారోగ్యంగా ఉండటంతో పని చేయడం లేదు. తరచూ సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు. సిరిసిల్ల నెహ్రూనగర్‌లో కనుకుంట్ల మల్లయ్య ఇంట్లో రూ.వెయ్యికి గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వారం రోజుల పక్షం రోజుల క్రితం వెంకటమల్లు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయగా.. ఇంటి యజమాని మల్లయ్య ఇంట్లోకి తీసుకురావడానికి అనుమతించలేదు. ఎంత ప్రధేయపడినా ఒప్పుకోలేదు.

దాంతో దిక్కుతోచని స్థితిలో ఆటోలో కార్మిక క్షేత్రం ఇందిరమ్మకాలనీ ఊరి చివరికి తీసుకొచ్చారు. ఊరి చివరన దుస్తులతో గుడిసె లాంటి నిర్మాణం ఏర్పాటు చేసుకొని చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ వెల్లదీస్తున్న క్రమంలో గురువారం ఉదయం 9 గంటలకు వెంకటమల్లు మరణించాడు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు మమత, రమ్య, కొడుకు మధన్‌ ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహం జరగగా.. కొడుకు మధన్‌ ఐటీఐ చదువుతున్నాడు. గూడు లేని పక్షుల వలే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మనసున్న చాలామందిని కంటతడి పెట్టించింది ఈ ఘటన. మనుషుల్లో మానవత్వం ఉందా లేక చచ్చిపోయిందా అని మనకి మనమే ప్రశ్నించుకునే పరిస్థితిని కల్పించింది ఈ సంఘటన. వెంకటమల్లు కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేయూతనందించాలని, ఉండడానికి గూడు కల్పించాలని ఇందిరమ్మకాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

కౌన్సిలర్‌ ఔదార్యం
సిరిసిల్లటౌన్‌: కార్మిక క్షేత్రం సిరిసిల్లకు చెందిన సిరిపురం వెంకటమల్లు(65) అనే నేత కార్మికుడు గురువారం అనారోగ్యంతో చనిపోయాడు. పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటమల్లు చాలా రోజులుగా స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం అనారోగ్యంతో చనిపోగా.. సొంతిల్లు లేక అతడి శవాన్ని యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మృతదేహాన్ని తంగళ్లపల్లిలోని ఇందిరానగర్‌కు తరలించారు. కుటుంబసభ్యుల వద్ద అంత్యక్రియలు జరపడానికి డబ్బులు లేకపోవడంతో.. 15వ వార్డు కౌన్సిలర్‌ అన్నారం లావణ్యశ్రీనివాస్‌ రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement