అంతా మా ఇష్టం

Outsourcing Employees Rude Behavior In Karimnagar Commissioner Office - Sakshi

‘కరీంనగర్‌ నగరపాలక సంస్థలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా చేరిన ఓ ఒప్పంద ఉద్యోగి తరువాత కమిషనర్‌ సీసీగా వెళ్లాడు. ఇటీవల కార్యాలయంలో విధులను పక్కకుపెట్టి లైక్‌ వీడియోలు చేయడం వైరల్‌గా మారింది. దీంతో తనను బదిలీ చేస్తారని ముందుగానే గమనించిన సదరు ఉద్యోగి ‘కమిషనర్‌ పేషీ సీసీ’ అని ఓ కొత్త పోస్టును సృష్టించుకుని కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు. కాగా వీడియోల వ్యవహారంపై ఇంతవరకు శాఖాపరమైన చర్యలు కానరాలేదు. సాధారణంగా మున్సిపల్‌ కమిషనర్లకు ఒక్కరే సీసీ పనిచేస్తారు. కరీంనగర్‌ నగరపాలకలో మాత్రం ఇద్దరు సీసీలు ‘ఇష్టా’రాజ్యం ఏలుతున్నారు.’

సాక్షి, కరీంనగర్‌: ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, ప్రజాసమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు ఔట్‌సోరి్సంగ్‌ పద్ధతిన సిబ్బ ందిని నియమిస్తారు. కొన్నేళ్లపాటు కాలపరిమితిని ఏర్పరుచుకుని విధులు అప్పగిస్తారు. కాలపరిమితి పూర్తవ్వగానే తప్పుకోవాల్సి ఉంటుంది. కాగా కరీంనగర్‌ నగరపాలక సంస్థంలో ఔట్‌సోరి్సంగ్‌ సిబ్బంది రాజ్యమేలుతున్నారు. వీరిని కార్యాలయ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ‘అంతా మాఇష్టం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇష్టారీతిన కొలువులు  కేటాయించుకుంటున్నారు. అక్కడ ఇబ్బంది ఏర్పడితే తమకు నచ్చిన పోస్టింగ్‌లను వారే సృష్టించుకుని విధులు నిర్వహిస్తున్నారు.

సాధారణంగా ఒకశాఖలో ఉద్యోగులు పరిమితికి మించి ఉన్నా.. వారికి పదోన్నతి కల్పించాలన్నా.. బదిలీ చేయాలన్నా.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత ఉన్నతాధికారులు ఆయా సిబ్బందికి శాఖలు కేటాయించి విధులు అప్పగించాల్సి ఉంటుంది. అయితే కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఈ నిబంధనలు ఏమీ అమలు కావడం లేదు. అంతా ఔట్‌సోరి్సంగ్‌ రాజ్యమే నడుస్తోంది. ఫలితంగా సదరు ఉద్యోగుల కాలపరిమితి ముగుస్తుందని ముందుగానే గ్రహించి, అదే కార్యాలయంలో మరో పోస్టును సృష్టించుకుని కొత్తగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందిస్తున్నారా అంటే అదీ శూన్యమే.

ఆడింది ఆట.. పాడింది పాట 
కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఎక్కువగా ఔట్‌సోరి్సంగ్‌ ఉద్యోగులే. వీరిలో కొందరు మాత్రమే నిబద్ధతతో పనిచేస్తే.. చాలా మంది ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమకు కేటాయించిన విధులు నిర్వహించకుండా ‘టైంపాస్‌’ ఉద్యోగం చేస్తున్నారనే ప్రచారం ఉంది. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో కనీస మర్యాద పాటించకుండా దురుసుగా వ్యవహరిస్తున్నానేది బహిరంగ రహస్యం. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపై అజమాయిషి చెలాయిస్తూ.. కిందిస్థాయి సిబ్బందికి వీరే విధులు కేటాయించడం విశేషం.

కార్పొరేషన్‌లో 249మంది ఉద్యోగులు.. 
కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం పోస్టులు 497. 249మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 248పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఔట్‌సోరి్సంగ్‌ ద్వారా శానిటేషన్‌లో 857 మంది, ఇంజినీరింగ్‌ విభాగంలో 260మంది, టౌన్‌ ప్లానింగ్‌లో 30 మంది, మెప్మాలో ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఏళ్లకాలంగా ఒకే విభాగంలో పాతుకుపోయారు. దీంతో బదిలీపై వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను వీరు కంట్రోల్‌ చేస్తున్నానే ప్రచారం సాగుతోంది.

ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు
అంతర్గత బదిలీలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. సీసీల బదిలీలు మాకు తెలియకుండా జరగవు. కార్పొరేషన్‌ ఇతర విభాగాలపై విచారణ చేస్తాం. సిబ్బందిని అవసరమైన చోట వినియోగిస్తాం. కొన్ని విభాగాల్లో అధికంగా సిబ్బంది ఉన్న విషయంపై విచారణ చేస్తాం.       – వల్లూరి క్రాంతి, 
కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌

సొంతంగా ఏర్పరుచుకున్న పోస్టులు కొన్ని.. 

  • ప్రస్తుతం మున్సిపల్‌ కమిషనర్‌ సీసీగా ఉన్న వ్యక్తి మొదట కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఔట్‌సోరి్సంగ్‌ విధానంలో ఉద్యోగంలో చేరాడు. ఆ పోస్టుకు కాలపరిమితి ముగుస్తుందని తెలిసి సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్‌ అనేపోçస్టును సృష్టించుకుని చేరిపోయాడు. అయితే రాష్ట్రంలో ఎక్కడాకూడా సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టులు లేవు. అదీ ముగుస్తుందని తెలిసి ప్రస్తుతం కమిషనర్‌ సీసీగా చేరాడు.
  • శానిటేషన్‌ విభాగంలో కీలకమైన ఎన్విరాల్‌మెంట్‌ ఇంజినీర్‌ పోస్టుకు డిప్యూటీ ఈఈ క్యాడర్‌ కేటాయించారు. తాత్కాలిక ఒప్పంద పద్ధతిలో ఓ ఉద్యోగిని తీసుకుని ఎన్విరాల్‌మెంట్‌ ఇంజినీర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. తర్వాత ఆ స్థానానికి రెగ్యులర్‌ ఉద్యోగిని కేటాయించారు. అదే పోస్టులో తాత్కాలిక ఉద్యోగి సైతం కొనసాగుతుండం విశేషం. డిప్యూటీ ఈఈ నామమాత్రంగా మారి టెండర్లు పిలవడానికి పరిమితమయ్యాడని ప్రచారం జరుగుతోంది. శానిటేషన్‌ విభాగంలో కీలకమైన పోస్టుకు అధికారి ఉండగా.. ఒప్పంద ఉద్యోగిని కొనసాగించడం మన కార్పొరేషన్‌కే చెల్లింది.
  • కార్పొరేషన్‌ విద్యుత్‌ విభాగంలో వీధిలైట్లను ఓ ప్రైవేట్‌ కంపెనీ పర్యవేక్షిస్తోంది. వీధిదీపాల మేయింటనెన్స్‌కు ఏఈ, డీఈతో పాటు 13మంది ఔట్‌సోరి్సంగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగులు సూపర్‌వైజర్‌ పోస్టులు సృస్టించుకుని ‘లీడర్‌షిప్‌’ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
  • ఫిల్టర్‌బెడ్‌లో ఒక ఇన్‌చార్జితో పాటు ఐదుగురు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేసేవారు. 15ఏళ్ల నుంచి ఫిల్టర్‌బెడ్‌ పనితీరులో ఎలాంటి మార్పులు రాలేదు. ఉద్యోగుల మాత్రం ఐదునుంచి 15కు పెరిగారు.
  • వాటర్‌బెడ్‌లో నాలుగు నుంచి ఐదుగురు మాత్రమే విధులు నిర్వహించడానికి అవకాశముంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో 12 మంది ఔట్‌సోరి్సంగ్‌ సిబ్బంది విధులు నిర్వహించడం విశేషం.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top