నాలుగు తడులతో సిరుల పంట! | Other Crops in Orange Garden | Sakshi
Sakshi News home page

నాలుగు తడులతో సిరుల పంట!

Mar 12 2019 11:25 AM | Updated on Mar 12 2019 11:25 AM

Other Crops in Orange Garden - Sakshi

పంటను పరిశీలిస్తున్న రైతు జనార్దన్‌రెడ్డి

బత్తాయి తోటలో సైతం అంతర పంటగా సిరిధాన్యాల సాగుతో అధికాదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు రైతు పుట్ట జనా«ర్ధన్‌రెడ్డి. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు అవసరం లేకుండానే పండ్ల తోటలో అంతర పంటగా సిరిధాన్యాలను సాగు చేస్తున్నారు. సిరిధాన్యాల సాగుతో ఆర్ధిక, ఆరోగ్య, ఆహార భద్రత ఉంటుందనే నమ్మకాన్ని రైతుల్లో కల్పిస్తున్నారు. కేవలం 4 నీటి తడులతో ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడులు సాధించవచ్చని ఆయన నిరూపిస్తున్నారు.

సాక్షి, నల్లగొండ అగ్రికల్చర్‌ :నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి తన లేత బత్తాయి తోటలో రబీ సీజన్‌లో అంతర పంటగా సిరిధాన్యాలను సాగు చేస్తున్నారు. తన తోటలో పది ఎకరాలతో పాటు మరో 30 ఎకరాలను ఇతర రైతుల వద్ద భూమిని లీజుకు తీసుకొని మొత్తం 40 ఎకరాల్లో సిరిధాన్యాలను సాగు చేస్తున్నారు. 85 రోజుల్లో పంట చేతికి వచ్చే కొర్ర, అండు కొర్ర, సామ పంటలను సాగు చేస్తున్నారు. డిసెంబర్‌ 15న ఎకరాకు మూడు కేజీల విత్తనాలను జల్లారు. ఆ తర్వాత ఇప్పటి వరకు నాలుగు సార్లు నీటి తడులు పెట్టారు. ప్రస్తుతం చేను ఏపుగా పెరిగి కంకి ఎండు దశలో ఉంది. కూలీల అవసరం లేకుండా మిషన్‌తో కోతకోసి నూర్పిడి చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు.

ఎకరానికి రూ.3 వేల పెట్టుబడి. సుమారు 10 క్వింటాళ్ల వరకు సిరిధాన్యాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎకరం సాగు చేసి రూ. 30 వేల ఆదాయం సమకూరుతుందని ఆయన ఆశిస్తున్నారు. సిరిధాన్య పంటల గడ్డిని పశువులకు చక్కని పోషకాలను అందించే పశుగ్రాసంగా వినియోగించుకోవచ్చు.

సిరిధాన్యాల సాగు విధానం
దుక్కి దున్నుకొని పొలాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. పదును తగుమాత్రంగా ఉంటే సరి. లేదంటే నీళ్ళు పెట్టుకొని దుక్కిలో ఎకరానికి మూడు కిలోల విత్తనాలు 1:3 పద్ధతిలో ఇసుకను కలిపి వెదజల్లే పద్ధతిలో గాని, సాలు పద్ధతిలో గానీ విత్తుకోవాలి. తర్వాత గొర్రు తోలుకోవాలి. విత్తనాలు మొలకెత్తిన తరువాత నాలుగు వర్షాలు పడితే చాలు సిరిధాన్యాలు పండుతాయి. రబీలో వర్షాలు లేకపోతే మూడు నుంచి నాలుగు విడతలుగా నీటి తడులు పెట్టాలి. స్ప్రింక్లర్లు ఉపయోగిస్తే చాలా తక్కువ నీటితోనే సిరిధాన్యాల పంట సాగు చేయవచ్చు.
అరికలు ఆరు నెలల పంట. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు వంటి సిరిధాన్యాలను నీటి వసతి ఉంటే సంవత్సరంలో మూడు పంటలను కూడా తీసుకోవచ్చు. ఎకరం వరి పంట సాగు చేసుకునే నీటి వసతి ఉంటే నాలుగు ఎకరాలలో సరిధాన్యాలను సాగు చేసుకోవచ్చని జనార్దన్‌రెడ్డి అంటున్నారు.

ఎలాంటి రసాయనిక ఎరువుల అవసరం లేదు
సిరిధాన్యాల సాగుకు ఎలాంటి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల అవసరం లేదు. జీవామృతంతోనే అధిక దిగుబడులను సాధించవచ్చని నిరూపిస్తున్నారు రైతు జనార్దన్‌రెడ్డి. గుంపులుగా వచ్చే పక్షులు కొన్ని గింజలు తిన్నప్పటికీ పొలంలో అవి వేసే రెట్ట వలన భూమి సారవంతం అవుతుంది. ఎలాంటి రసాయనిక ఎరువుల అవసరం ఉండదు. నీటి తడులతో పాటు జీవామృతం అందిస్తే సరిపోతుంది.

క్వింటా ముడి సిరిధాన్యాలకురూ. 4 వేల ధర
సమాజంలో ప్రస్తుతం సిరిధాన్యాల బియ్యం వాడకం అధికం కావడం వలన సిరిధాన్యాల ముడి ధాన్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. క్వింటాలుకు రూ. 4 వేల వరకు చెల్లించి ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఉన్న వ్యాపారులే రైతుల వద్ద కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారని జనార్దన్‌రెడ్డి తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను సాధించే సిరిధాన్యాల సాగును జాతీయ ఆహార భద్రత మిషన్‌లో చేర్చి, అన్ని జిల్లాల్లోనూ హెక్టారుకు రూ. 6 వేల చొప్పున ఆర్ధిక తోడ్పాటును అందించాలని నల్లగొండ జిల్లా రైతులు కోరుతున్నారు. దీంతో పత్తి సాగు చేసే రైతులు సిరిధాన్యాల సాగుకు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. – ఆవుల లక్ష్మయ్య,సాక్షి, నల్లగొండ అగ్రికల్చర్‌ ఫొటోలు: కంది భజరంగ్‌ప్రసాద్, నల్లగొండ

సిరిధాన్యాల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి
కేవలం ఎకరానికి రూ.3 వేల పెట్టుబడితో పాటు కూలీల అవసరం పెద్దగా లేకుండా ఎకరానికి ఒక పంటకు రూ.30 వేల వరకు ఆదాయం వస్తుంది. నీరు, విద్యుత్‌ పొదుపు అవుతాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. జీవామృతం అందిస్తే చాలు. విద్యార్థుల హాస్టళ్లలో, మధ్యాహ్న భోజనంలో సిరిధాన్యాల ఆహారాన్ని అందించడం ద్వారా ప్రభుత్వం సిరిధాన్యాల రైతులను ప్రోత్సహించాలి. త్వరలో ప్రొసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ఖరీఫ్‌లో సుమారు మరింత విస్తీర్ణంలో సాగు చేయాలని అనుకుంటున్నా. సిరిధాన్యాలను సాగు చేయాలనుకునే రైతులకు సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తా.– పుట్ట జనార్దన్‌రెడ్డి (98484 32345),పరడ, కట్టంగూరు మండలం, నల్లగొండ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement