మావోల కట్టడికి ఆపరేషన్‌–2018

Operation for the Mao  control -2018 - Sakshi

తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల సమష్టి కార్యాచరణ

సీఆర్‌పీఎఫ్‌ నేతృత్వంలో నాలుగు రాష్ట్రాల డీజీపీల భేటీ

యాక్షన్‌ ప్లాన్‌ రూపకల్పనపై చర్చ!

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టులను నియంత్రించేందుకు ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు సమష్టిగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నాయి. ఈ మేరకు నాలుగు రాష్ట్రాల డీజీపీలతో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) మంగళవారం కీలక భేటీ నిర్వహించింది. ఏపీలోని విశాఖపట్నంలో జరిగిన ఈ భేటీలో నాలుగు రాష్ట్రాల డీజీపీలతో పాటు ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులు, సీఆర్‌పీఎఫ్‌ సౌత్‌ సెక్టార్‌ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ కీలకం
రాష్ట్రంలో పెద్దగా మావోయిస్టు కార్యకలాపాలు లేకపోయినా.. ఏపీ–ఒడిశాలతో సరిహద్దు, ఛత్తీస్‌గఢ్‌లలో విస్తృతంగా ప్రభావం ఉంది. తెలంగాణ, ఏపీల పోలీస్‌ శాఖలో ఎస్‌ఐబీ (స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో)వ్యూహాత్మక చర్యలు, గ్రేహౌండ్స్‌ ఆపరేషన్స్‌తో మావోయిస్టులను ప్రభావవంతంగా నియం త్రించగలిగారు. అటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల పోలీసు శాఖలు మావోయిస్టులను నియంత్రించడంలో విఫలమవుతున్నాయి.

కేంద్రం భారీ స్థాయిలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలను దింపుతున్నా.. ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుండటంతో ఆందోళనలో పడింది. ఈ నేపథ్యంలోనే సంయుక్త కార్యాచరణ తెరపైకి వచ్చింది. యాక్షన్‌ ప్లాన్‌–2018 పేరిట తీసుకునే ఈ చర్యలు, మావోయిస్టు కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని సీఆర్‌పీఎఫ్‌ తాజా భేటీలో నిర్ణయించినట్లు సమాచారం.

ఈ మేరకు సంయుక్త కార్యాచరణ, యాక్షన్‌ ప్లాన్‌ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ డీజీపీలను కోరినట్లు తెలిసింది. తెలంగాణ ఎస్‌ఐబీ ఇచ్చే సమాచారాన్ని ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసు శాఖలు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, ఆపరేషన్స్‌లో సూచనలు, సలహాలను పాటించాలని నిర్ణయించినట్టు సమాచారం.

అగ్ర నేతలు తెలుగువారే కావడంతో..
మావోయిస్టు పార్టీ అగ్రనాయకులంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం.. ఈ నాలుగు రాష్ట్రాల కమిటీల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నది కూడా ఇక్కడి నాయకులే కావడంతో సమాచారం అందించాలని తెలంగాణ పోలీస్‌శాఖను సీఆర్‌పీఎఫ్‌ కోరింది. ఇక తెలంగాణ ఆవిర్భావం నుంచి స్తబ్దుగా ఉన్న మావోయిస్టు తెలంగాణ కమిటీని పునరుత్తేజితం చేసే కార్యాచరణ రచించినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది.

జూలైలో జరిగిన ప్లీనరీలో తెలంగాణ కమిటీని పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ.. విస్తృతంగా రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని కేంద్ర కమిటీ సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎల్‌డబ్ల్యూఈ (లెఫ్ట్‌ వింగ్‌ ఎక్స్‌ట్రీమిజం) నిధులను ఉపయోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సారి నుంచి మోడ్రనైజేషన్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఎంఓపీఎఫ్‌) నిధుల్లో 60 శాతానికిపైగా గోదావరి పరీవాహక జిల్లాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top