జిల్లాలోని సంగారెడ్డి నియోజకవర్గంలో 10,000 ఎకరాలు, కోహీర్ మండలంలో ..
జిల్లాలోని సంగారెడ్డి నియోజకవర్గంలో 10,000 ఎకరాలు, కోహీర్ మండలంలో 4,200 ఎకరాలు, జహీరాబాద్‌లో 2,275 ఎకరాలు, రాయికోడ్‌లో 1,127 ఎకరాలు, చేగుంటలో 2,113 ఎకరాలు, శివ్వంపేటలో 1,788 ఎకరాలు.. ఇలా చదువుకుంటూ పోతే మెతుకు సీమలో 35 వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. అయితే వీటిపై సరైన అజమాయిషీ లేక 80 శాతం భూములు ఆక్రమణకు గురైనట్లు జిల్లా అధికార యంత్రాంగం నిర్ధారించింది. 35 వేల ఎకరాల భూమి, కాంప్లెక్స్‌లకు ఏటా వస్తున్న ఆదాయం కేవలం రూ. 2.50 లక్షలు మాత్రమే.
జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కలిపి 35 వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సర్వేలో బయటపడింది. ఇందులో ఎక్కువ శాతం భూమి కబ్జాకు గురైంది. వీటికి సరైన రికార్డు లేకపోవడం, ఆస్తులు రెవెన్యూ అధికారుల అజమాయిషీలో కాకుండా ముతవల్లి చేతిలో ఉండడంతో కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించారు.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆదీనంలో ఉన్న 180 ఆలయాల కింద 3,651 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు ఆ శాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత భూమి కబ్జా అయిందనే సమాచారం అధికారుల వద్ద లేదు. వాస్తవానికి సుమారు 20 వేల ఎకరాలకు పైగా ఆలయ మాన్యాలు ఉండగా.. రాజకీయ నేతల అండదండలతో కబ్జాదారులు ఆక్రమించగా.. ప్రస్తుతం 3,651 ఎకరాలు మాత్రమే మిగిలింది. కాగా జిల్లాలో మొత్తం 6,789 చెరువుల కింద 1,03,468.14 ఎకరాల శిఖం భూమి ఉంది.
చెరువు ఎఫ్‌టీఎల్ భూములను కలుపుకుంటే ఇది మొత్తం 2.5 లక్షల ఎకరాలకు మించి ఉంటుంది. అన్ని రకాల భూములను కలుపుకుంటే జిల్లాలో 3,60,381.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 60 శాతం భూమి దోపిడీదారుల గుప్పిట్లో పడి ‘నలిగి’ పోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్రమిత భూముల స్వాధీనం సవాల్‌గా మారింది.