చిట్టి పొట్ట నిండుతలేదు!

Nutrition food distribution among children in the state is 9.6 per cent

రాష్ట్రంలో 9.6 శాతం పిల్లలకే సకాలంలో పోషకాహార పంపిణీ

ఆరు నెలలు నిండినా చిన్నారులకు పాలతోనే సరిపెడుతున్న వైనం

అవగాహనలేమి, ఆర్థిక స్తోమత సమస్యలతో వాయిదా పడుతున్న ఘనాహార పంపిణీ

శిశు సంక్షేమ శాఖ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శిశుపోషణ ఆందోళనకరంగా మారుతోంది. నవజాత శిశువుకు ఆరు నెలల వరకూ తల్లి పాలు ఇస్తుండగా.. ఆ తర్వాత ఘనాహారం ఇవ్వాలి. చిన్నారుల ఎదుగుదలకు ఈ సమయంలో పోషణే కీలకం. కానీ రాష్ట్రంలో మెజారిటీ శాతం పిల్లలకు సరైన పోషణ అందడం లేదు. ఆరు నెలలు దాటిన చిన్నారులకు ఘనాహారం పంపిణీపై శిశు సంక్షేమ శాఖ పరిశీలన నిర్వహించగా.. పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో 9.6 శాతం మంది పిల్లలు మాత్రమే ఆరు నెలలు నిండిన తర్వాత ఘనాహారం తీసుకుంటున్నట్లు ఈ పరిశీలనలో తేలడం ఆందోళన కలిగిస్తోంది.

పోషకాహారాన్ని ఇవ్వాల్సి ఉన్నా..
రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు కాగా, 3,989 మినీ కేంద్రాలు. వీటి పరిధిలో 23.71 లక్షల మంది చిన్నారులు నమోదు కాగా.. వీరిలో 7.25 లక్షల మంది ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు వయసున్నవారు. ఈ క్రమంలో చిన్నారులు ఘనాహారం తీసుకునే తీరుపై ఆ శాఖ పరిశీలన చేయగా.. ఇందులో సగటున 9.6 శాతం చిన్నారులు మాత్రమే సకాలంలో ఘనాహారం తీసుకుంటు న్నట్లు వెల్లడైంది. ఆరు నెలలు దాటిన చిన్నారుల ఎదుగుదల రెండురెట్లు పెరుగుతుంది. అంతేకాకుండా అవయవాల పెరుగుదల వేగం పుంజుకుంటుంది. దీంతో ఆరు నెలలు దాటిన తర్వాత చనుబాలతో పాటు ఉగ్గు, ఫారెక్స్‌లాంటి పొడితో కూడిన పోషకాహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

ఎందుకీ వెనుకబాటు..
చిన్నారులకు పోషకాహారం ఇవ్వడం తప్పనిసరైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువభాగం చనుబాలతోనే సరిపెడుతున్నారు. ఎక్కువ మంది చిన్నారులకు ఏడాది దాటిన తర్వాతే పోషకాహార పంపిణీ మొదలుపెడుతున్నట్లు శిశు సంక్షేమ శాఖ పరిశీలనలో వెల్లడైంది. కొన్ని సందర్భాల్లో పోషకాల పంపిణీపై అవగాహన లేకపోవడం కారణమైతే.. కొన్ని సందర్భాల్లో ఆర్థిక స్తోమత మరో కారణమని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే పోషకాహార పంపిణీ ఆందోళనకరంగా ఉంటోందని శిశు సంక్షేమ శాఖ పరిశీలన చెబుతోంది.

ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితిని పరిశీలిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పోషకాహార పంపిణీ చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో పది నుంచి పన్నెండు నెలలు నిండిన చిన్నారులకు ఉగ్గు తదితరాలు కాకుండా సాధారణ భోజనం(మొత్తగా వండిన అన్నం), పెరుగన్నం లాంటివి మెత్తబర్చి పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే తృణధాన్యాలతో కూడిన పోషకాల పంపిణీ సంతృప్తికరంగా జరగడంలేదు. సరైన పోషకాలు అందకపోవడంతో చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top