హుస్సేన్‌సాగర్‌లోకి ఏ తూముల ద్వారా అయితే మురుగు నీరు వస్తుందో ఆ తూములకు మాత్రమే మరమ్మతులు చేయాలని,
జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లోకి ఏ తూముల ద్వారా అయితే మురుగు నీరు వస్తుందో ఆ తూములకు మాత్రమే మరమ్మతులు చేయాలని, మరమ్మతుల పేరుతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని హైకోర్టు మంగళవారం జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. అలాగే మరమ్మతుల నిర్వహణకు అవసరరమైన మేర నీటిని మాత్రమే బయటకు విడుదల చేయాలని తేల్చి చెప్పింది. సాగర్ శుద్ధి పనులపై దాఖలైన వ్యాజ్యాన్ని 2 నెలల్లోపు పరిష్కరించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)కు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
శుద్ధి పేరుతో సాగర్‌లోని నీటిని మొత్తం తోడి, మూసీలోకి వదులుతున్నారని, దీనివల్ల జీవరాశులకు హాని కలుగుతోందంటూ స్వచ్ఛంద సంస్థ ‘సోల్’ ఎన్‌జీటీని ఆశ్రయించగా, ట్రిబ్యునల్ స్టే విధించింది. దీనిపై జీహెచ్‌ఎంసీ హైకోర్టులో సవాల్ చేయగా...దీన్ని విచారించిన ప్రత్యేక ధర్మాసనం, స్టే ను నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సోల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దీనిపై తిరిగి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మంగళవారం విచారణ జరిపి పై మేరకు ఆదేశించింది.