ప్రవాహాలు లేక గోదా‘వర్రీ’! | No minimum water flow in godavari basin | Sakshi
Sakshi News home page

ప్రవాహాలు లేక గోదా‘వర్రీ’!

Jul 30 2018 1:35 AM | Updated on Jul 30 2018 1:35 AM

No minimum water flow in godavari basin - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి వర ప్రదాయినిగా ఉన్న గోదావరికి ఈ ఏడాది నీటి ప్రవాహాలు కరువయ్యాయి. ఏటా జూన్‌ చివరి వారానికే ఉధృత రూపం దాల్చే గోదావరిలో ఈ ఏడాది కనీస నీటి ప్రవాహాలు కూడా నమోదవడం లేదు. గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల్లోనూ ఎక్కడా పెద్దగా నీరు వచ్చి చేరడం లేదు.

ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఇప్పటివరకు కేవలం 32 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్‌ ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉండటం, అక్కడ అధిక వర్షాలు నమోదైతే గానీ దిగువకు నీరిచ్చే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది.

చూపంతా ఎగువ వైపే..
కృష్ణా బేసిన్‌తో పోల్చి చూస్తే గోదావరి బేసిన్‌లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. కృష్ణాలో కాస్త ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు ఉండటంతో ఆ సమయం నుంచే రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు నమోదవుతాయి. అయితే ఈ ఏడాది గోదావరి బేసిన్‌లో ఎక్కడా ఆశాజనక పరిస్థితులు లేవు. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా అవి గోదావరి పరీవాహకంలో లేకపోవడంతో దిగువ ఎస్సారెస్పీ, సింగూరుకు నీటి ప్రవాహాలు పెద్దగా లేవు. బాబ్లీ గేట్లు తెరిచి నెల రోజులవుతున్నా దిగువకు వచ్చింది తక్కువే. గోదావరి, ప్రాణహితలు కలిసే కాళేశ్వరం వద్ద మాత్రం ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా 3.50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహాలు నమోదయ్యాయి.

అయితే ఈ ప్రవాహాలు ప్రాణహిత నుంచి వచ్చాయే తప్ప గోదావరి నుంచి కాదు. జూన్‌ చివరి వారం, జూలై తొలి వారంలో ప్రాజెక్టుల్లో కొంతమేర ప్రవాహాలు కొనసాగినా అవి ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయాయి. మహారాష్ట్రలోని గైక్వాడ్‌ ప్రాజెక్టుకు గడిచిన నాలుగు రోజులుగా మాత్రమే ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ఆ ప్రాజెక్టులో 102 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 50 టీఎంసీల నిల్వలున్నాయి. గతేడాదితో పోలిస్తే అక్కడ 10 టీఎంసీల నిల్వ తక్కువగా ఉంది. ఈ సీజన్‌లో ప్రాజెక్టులో కేవలం 9.82 టీఎంసీలు మాత్రమే కొత్తనీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నిండితే గానీ దిగువకు ప్రవాహాలుండవు.

సింగూరులో 29.91 టీఎంసీలకు వాస్తవ నిల్వకు గానూ గతేడాది 18.10 టీఎంసీల నిల్వ ఉండగా.. ఈ ఏడాది కేవలం 7.66 టీఎంసీల నిల్వలున్నాయి. ఎలాంటి ప్రవాహాలు రావడం లేదు. దీంతో దీనిపై ఆధారపడ్డ 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టు నిండితే కానీ నిజాంసాగర్‌కు నీటి విడుదల కుదరదు. నిజాంసాగర్‌లో కేవలం 0.02 టీఎంసీలు మాత్రమే కొత్త నీరు రావడంతో అక్కడ 17.80 టీఎంసీలకు గానూ 2.39 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. దీంతో ఖరీఫ్‌లో 2 లక్షల ఎకరాలకు నీరందడం సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వర్షాలు, ఎగువ నుంచి వచ్చే వరదతోనే ప్రాజెక్టులు, చెరువులు నిండే అవకాశం ఉంది.

ఎస్సారెస్పీలో 15.9 టీఎంసీలే..
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 9.76 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు వాస్తవ నిల్వ 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.9 టీఎంసీల నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో దీని కింద 9.68 లక్షల ఆయకట్టు అంతా వర్షాలు, భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

గత రబీలో ఈ ప్రాజెక్టు కింద 4.97 లక్షల ఎకరాల ఆయకట్టుకు 40 టీఎంసీ మేర నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉంటుందా అనే దానిపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తంగా ఈ సీజన్‌లో గోదా వరి ప్రాజెక్టుల్లోకి 32 టీఎంసీలు మాత్రమే కొత్త నీరువచ్చి ఆయకట్టును కలవరపరుస్తోంది. గోదావరి బేసిన్లో 20,121 చెరువులు ఉండగా 8,400 చెరువుల్లో చుక్క నీరు చేరలేదు. 5,500 చెరువుల్లో 50 శాతం కన్నా తక్కువ నీటి లభ్యత ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement