ఉలిక్కిపడిన బహదూర్‌గూడ

Nizamabad Farmers Land Case In High Court - Sakshi

శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌): మూడు తరాలుగా ఆ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. గ్రామంలో 90 శాతం మందికి ఆ పొలమే జీవనాధారం. సుమారు 70 ఏళ్ల క్రితం అధికారులు వారికి పట్టా పాసు పుస్తకాలు సైతం జారీ చేశారు. ఆ తర్వాత వారసుల పేరిట హక్కుల మార్పిడితో పట్టా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉలిక్కిపడ్డారు. బహదూర్‌గూడ భూములు ప్రభుత్వానివే అంటూ న్యాయస్థానం తీర్పు చెప్పడంతో తాము జీవనాధారం కోల్పోతామని, ఎలా బతకాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధికారులు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల నుంచి వివాదాస్పదంగా మారిన శంషాబాద్‌ మండలంలోని బహదూర్‌గూడ భూములు ప్రభుత్వానికి చెందినవంటూ తీర్పు రావడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాలు.. బహదూర్‌గూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1 నుంచి 101లో 1,351 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో సుమారు 80 ఏళ్ల నుంచి స్థానిక రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పలు దఫాలుగా అధికారులు రైతులకు పట్టా 

పాస్‌ పుస్తకాలు జారీ చేశారు. అంతేకాకుండా రైతులు ఈ భూములకు సంబంధించి శిస్తు కూడా చెల్లించారు. ఈ భూముల్లో ప్రస్తుతం బహదూర్‌గూడ, లక్ష్మీ తండాకు చెందిన దాదాపు 500లకు పైగా సన్న, చిన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములు వివాదాస్పదం కావడంతో ఇప్పటివరకు రెండుసార్లు ఎంజాయ్‌మెంట్‌ సర్వే కూడా చేశారు. గతేడాది జూన్‌లో జాయింట్‌ కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఈ భూములను పరిశీలించి, రైతులకు పట్టా పుస్తకాలు, రైతుబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

వివాదం మొదలైంది ఇక్కడే.. 
రెవెన్యూ రికార్డుల్లో ఈ భూములకు పహాణీ, నక్షలో సర్వే నంబర్లు వ్యత్యాసం రావడంతో వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా ఈ భూములు ప్రభుత్వానివంటూ అధికారులు చెబుతూ వస్తున్నారు. దీంతో రైతుల అభ్యర్థనతో 2002లో ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేసి కొందరికి పట్టా పుస్తకాలు కూడా జారీ చేశారు. ఇక్కడే సమస్యకు ఆజ్యం పోసింది. ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేసిన తర్వాత ప్రకటించిన సర్వే నంబర్లు, పాత సర్వే నంబర్లకు పొంతన కుదరలేదు. దీంతో ఈ భూములన్నీ వివాదాస్పదంగా మారిపోయాయి.

మరో వైపు రైతులకు జారీ చేసిన పట్టా పుస్తకాలతో రైతులకు ఎలాంటి సబ్సిడీ, రుణ సదుపాయాలు కల్పించలేదు. ఇదే సమయంలో ఈ భూములను ఆనుకుని అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడంతో నేతల కన్ను ఈ భూములపై పడింది. భూములను ప్రభుత్వం సేకరించనుందని అపోహలు సృష్టించిన కొందరు మధ్యవర్తులు.. రైతులను మభ్యపెట్టి బేరమాడి విక్రయించేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ భూములను కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ బినామీల పేర్లతో రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత కేంద్రం, రాష్ట్రంలో అధికారం మారడంతో నాయకులు తెరవెనక కనుమరుగయ్యారు.
 
రంగంలోకి ప్రైవేటు వ్యక్తులు 
సర్వే నంబర్లు 1 నుంచి 101 వరకు ఉన్న 1,351 ఎకరాల్లోని సగం భూములు ప్రభుత్వ భూములంటూ రెవెన్యూ అధికారులు వాదించసాగారు. సర్వే నంబరు 62, 28లోని 701 ఎకరాలు ప్రభుత్వ భూములంటూ 2014లో తహసీల్దార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు పొలాలను స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడంతో వాటిని ఆసరా చేసుకుని రికార్డులను తారుమారు చేయగా.. తహసీల్దార్‌ ఉత్తర్వులతో వారి ఆగడాలకు అడ్డుకట్ట పడింది. కొన్నాళ్లకు ప్రైవేట్‌ వ్యక్తులు ఈ భూములను ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. 2017లో హైకోర్టులో ఈ భూములపై పిటిషన్‌ వేయగా.. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవంటూ తాజాగా హైకోర్టు తీర్పు వెలువడింది.

రైతుల వాదన ఇదీ.. 
ధికారులు చెబుతున్నట్లుగా సర్వే నంబర్లు 62, 28లో 701 ఎకరాల ప్రభుత్వ భూమి లేదని రైతులు వాదిస్తున్నారు. సేత్వారు, నక్షలో ఎక్కడ కూడా ఈ భూములు ప్రభుత్వ భూములని రికార్డుల్లో లేదంటున్నారు. çసర్వే నంబర్లు 76 నుంచి 101 వరకు రైతులు కబ్జాలో ఉన్న భూములను ప్రభుత్వం సర్వే నంబర్లు 62, 28గా పేర్కొంటోందని చెబుతున్నారు. 1952లో ఈ భూముల యజమాని లతా పునిసాబేగం ఇక్కడి రైతులకు కొంత భూమిని పట్టా చేసి, మరికొంత భూమిని కబ్జా ఇచ్చిందని అంటున్నారు. 2014లో ఈ భూములపై తహసీల్దార్‌ ఇచ్చిన ఉత్తర్వుల విషయం కూడా ఇప్పటి వరకు తమకు తెలియదని చెబుతున్నారు. హైకోర్టు తీర్పు పత్రికల్లో రావడంతోనే తమకు విషయం తెలిసిందంటున్నారు. న్యాయం కోసం ఎమ్మెల్యే సహాయంతో సీఎంను కలిసి సమస్య వివరిస్తామని చెబుతున్నారు .

మా నాన్న భూమి నాకు సంక్రమించింది... 
సర్వే నంబరు 37, 38, 39లో 2 ఎకరాల 25 గుంటల పొలానికి మా నాన్న ఆశన్న పేరుతో 1981లో పాసు పుస్తకం ఇచ్చారు. ఆ తర్వాత ఈ భూమిని నా పేరుతో 2006లో పట్టా పుస్తకం జారీ చేశారు. ఈ భూమి పైనే ఆధారపడి బతుకుతున్నాం.  పొలాలు రైతులవని కావదని చెబితే మేం ఎక్కడికి వెళ్లాలి.    – కుమ్మరి ఎంకయ్య, రైతు, బహదూర్‌గూడ

మాకు పొలమే జీవనాధారం   
వారసత్వంగా నాకు సర్వే నంబరు 25లో 8 గుంటల భూమిపై నాకు 2009లో పట్టా పుస్తకం ఇచ్చారు. నాకు ఈ పొలమే జీవనాధారం. మాకు రైతు బంధు, బీమా కూడా ఇవ్వడం లేదు. బ్యాంకుల్లో రుణాలు ఇస్తలేరు. ఈ భూములు తీసుకుంటే మేమెలా బతికేది. – నక్క పర్వతాలు, రైతు, బహదూర్‌గూడ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top