అపోహలకు తావులేదు

Nizamabad Collector Says On New EVMS - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): రానున్న ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు అత్యంత అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో పాటు పారదర్శకంగా పని చేస్తాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఈవీఎంల ప్రాథమిక పరిశీలన పూర్తయిన సందర్భంగా సోమవారం నగరం లోని వినాయక్‌నగర్‌లో గల ఈవీఎం గోదాములో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ ఈవీఎంలను కొత్తగా సిద్ధం చేసిందని, వీటిలో ఎటువంటి అనుమానాలకు, అపోహలకు తావు లేదన్నారు. వీటికి ఎటువంటి ఇంటర్నెట్‌ సౌకర్యం లేనందున, వేరే చోట నుంచి నడిపే అవకాశం లేదన్నారు. ఏ నంబరు ఈవీఎం ఎక్కడికి వెళ్తుందో, వాటి ర్యాండమైజేషన్‌ వరకు తెలియదని, ఏ అభ్యర్ధి పేరు ఏ క్రమ సంఖ్యలో వస్తుందో ముందస్తుగా అంచనా వేయలేమన్నారు.

ట్యాంపరింగ్‌కు ఎట్టిపరిస్థితుల్లో అవకాశం లేదని వివరించారు. రాజకీయ పార్టీల ద్వారా ప్రజలకు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈవీఎంలకు  వీవీ ప్యాట్‌ల సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. దీనిలో ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటు వేశామో ఆ ఓటరుకు ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుందని చెప్పారు. ప్రతి బ్యాలెట్‌ యూనిట్‌లో 16 బటన్‌లు ఉంటాయని, ఒక బటన్‌ నోటా ఉంటుందన్నారు. పోటీలు ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకుంటే ఓటరు 16వ బటన్‌ నోటా నొక్కవచ్చన్నారు. 15 మందికంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే మరో బ్యాలెట్‌ యూనిట్‌ ఉపయోగిస్తారన్నారు. వీటి ప్రథమస్థాయి చెకింగ్‌లో సిబ్బంది, ఇంజనీర్లు, అధికారులు చాలా కష్టపడి కొద్ది రోజుల్లోనే పూర్తి చేసినందుకు కలెక్టర్‌ వారిని అభినందించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ అంజయ్య, రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top