నేటి నుంచి నిట్‌ వజ్రోత్సవాలు

NIT Diamond Jubilee Celebrations In Warangal - Sakshi

కాజీపేటలోని వరంగల్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) వజ్రోత్సవాలకు సిద్ధమైంది. ఈ వేడుకలను సోమవారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను యాజమాన్యం పూర్తి చేసింది. పోలీసు విభాగం ఆధ్వర్యంలో 600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ తెలిపారు. 

కాజీపేట అర్బన్‌ (వరంగల్‌): కాజీపేటలోని వరంగల్‌ నిట్‌లో ఏడాది పొడవునా వజ్రోత్సవాలు నిర్వహించడానికి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలకు 1959 అక్టోబర్‌ 10న నాటి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నేహ్రు శకుస్థాపన చేశారు. ఈ నెల 10వ తేదీ నాటికి 60వ వసంతంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను ప్రారంభించేందుకు సోమవారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచ్చేస్తున్నారు. ఇందుకు గాను ఇటీవల నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావు ఉపరాష్ట్రపతికి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఏడాది పొడవునా వజ్రోత్సవాలు
ఏడాది పొడవున వజ్రోత్సవ వేడుకలు నిర్వహించేందుకు నిట్‌ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు స్పిక్‌మేకే బృందంచేత విరాసత్‌ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు, నవంబర్‌ 10 నుంచి 12 వరకు ఎవెల్యూషన్‌ ఆఫ్‌ వరల్డ్‌ క్లాస్‌ టెక్నికల్‌ ఇనిస్టిట్యూట్‌షన్స్‌–ఇష్య్సూ–కన్‌సరŠన్స్‌ అనే అంశంపై జాతీయ సదస్సు, డిసెంబర్‌ 18 నుంచి 21 వరకు 6వ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ బిగ్‌డాటా, డిసెం బర్‌ 15, 16 తేదీల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ డైనమిక్స్‌ ఆఫ్‌ ఇంటర్‌ఫేసేస్‌ ఇన్‌ మల్టీఫేస్‌ సిస్టమ్స్, జనవరి 18 నుంచి 20 వరకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ కాంపిటేషనల్‌ మోడలింగ్‌ ఆఫ్‌ ప్లూయిడ్స్‌ డైనమిక్‌ ప్రాబ్లెమ్స్, ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ అడ్వాన్స్‌›డ్‌ ఫంక్షనల్‌ మెటీరియల్స్‌ అండ్‌ డివైసెస్‌లను నిర్వహించనున్నారు. వీటితోపాటు వివిధ కళాశాలలు, సంస్థల నుంచి ఎంఓయూలు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉపరాష్ట్రపతి పర్యటన షెడ్యూల్‌.. 
నిట్‌ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానానికి సోమవారం ఉదయం 9.20 నిమిషాలకు చేరుకుంటారు. కళాశాల మైదానం నుంచి రోడ్డు మార్గంలో 9.30 నిమిషాలకు నిట్‌ వరంగల్‌లోని అంబేడ్కర్‌ లర్నింగ్‌ సెంటర్‌కు వచ్చాక తొలుత నిట్‌ వజ్రోత్సవ వేడుకల శిలాఫలకాన్ని, అల్యూమ్ని కన్వెన్షన్‌ సెంటర్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. నాటి ఆర్‌ఈసీ ప్రిన్సిపాల్స్, నేటి నిట్‌ డైరెక్టర్లను సన్మానించి నిట్‌ వజ్రోత్సవ వేడుకలపై ఉపన్యసిస్తారు. తిరిగి 10.30 నిమిషాలకు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానం నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి బయల్దేరుతారు. 

600 మంది పోలీసులతో బందోబస్తు
వరంగల్‌ క్రైం: వజ్రోత్సవాలకు ముఖ్యఅతిథిగా వస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆదివారం రాత్రి సుమారు గంటపాటు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. అధికారులు ఎక్కడెక్కడ ఎవరుండాలనే విషయాలతోపాటు బందోబస్తు విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించా రు. బందోబస్తు కోసం సుమారు 600 మంది సిబ్బంది, అధికారులను నియమించినట్లు సమాచారం. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల వరకు ట్రాఫిక్‌ నియంత్రణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సిబ్బందికి సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top