ఆరుబయట మలవిసర్జనకు రూ.1000 కట్టాల్సిందే..

Nirmal District Officers Impose 1000 Rupees Fine For Open Defecation - Sakshi

‘జర..మానా’ల్సిందే!

నిబంధనలు అతిక్రమిస్తే.. తప్పదు ఫైన్‌

బయట చెత్త వేస్తే     రూ. 500 జరిమానా

జిల్లాలో అమలు షురూ.. 

సాక్షి, నిర్మల్‌: రెంటికి ఆరుబయటకు వెళుతున్నారా..! ఆగండి.. మీ ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిని వినియోగించు కోండి.. ఒకవేళ లేకుంటే వెంటనే నిర్మించుకోండి.. లేదంటే ఫైన్‌ కట్టక తప్పదు. ఇక నుంచి ఆరుబయట మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధించాలని ప్రభు త్వం ఆదేశించింది. ఇది ఒక్కటే కాదు.. మ నం పద్ధతి మార్చుకోకుంటే మరెన్నో ఫైన్‌లు కట్టక తప్పదు మరి. ఇప్పటి దాకా మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినా ఎవరు ఏమీ అనేవారు కాదు. ఒక వేళ ఎవరైన ఏంటీ మీరు అలా చేస్తున్నారని ప్రశ్నిస్తే.. మంచిది.. బాగా సలహా ఇస్తున్నారు... నీకెందుకులే అనే వాళ్లం. ఇక ముందు పారి శుధ్యం విషయంలో, ఆరుబయట మల విసర్జన, చెట్ల పెంపకం, ప్లాస్టిక్‌ వినియోగం విషయంలలో అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు. 

మరుగుదొడ్లను వినియోగించకుంటే రూ.1000 జరిమానా..

చిట్యాల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన జరిమానా బోర్డు

ఆరుబయట మల, మూత్ర విసర్జనలతో పరిసరాలు ఆపరిశుభ్రంగా మారడంతో పాటు కలుషిత వాతావరణం ఏర్పడేది. దీంతో వ్యాధులు ప్రబలేవి. దీనిని నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తూ మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు అందజేస్తోంది. దీంతో చాలా గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటికే మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. అయితే కట్టుకున్న వారిలో చాలా మంది వాటిని వినియోగించడం లేదు. మరుగుదొడ్లు వినియోగించుకోవాలని చాలా సార్లు విన్నవించారు. బహిరంగ మల విసర్జన అరికట్టేందుకు, కట్టుకున్న మరుగుదొ డ్లు వాడుకునేలా ప్రజలకు అవగాహన సైతం కల్పించారు. అయితే ప్రజల్లో ఆశించిన మార్పు రావడం లేదు. ఇంకా అలవాటు ప్రకా రం మల విసర్జనకు ఆరుబయటకే వెళుతున్నారు. దీంతో అట్టి చర్యలకు పాల్పడిన వారికి జరిమానా విధించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. బహిరంగ మలవిసర్జన వెళ్లిన వారిని గుర్తించి, జరిమానాలు విధించాలని పంచాయతీ కా ర్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వారికి రూ. 1000 జరిమానా విధించనున్నారు. 

చెత్త వేస్తే రూ. 500 కట్టాల్సిందే... 
పారిశుధ్యం మెరుగుదల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు చర్యలు చేపట్టింది. పట్టణాల్లో తడి, పొడి చెత్త సేకరణకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటింటికీ బుట్టల పంపిణీ చేపట్టింది. వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. అలాగే గ్రామాల్లోనూ చెత్త సేకరణను తోపుడు బండ్లు(పుష్‌ కాట్స్‌) ద్వారా చేపడుతున్నారు. ఇలా సేకరించిన చెత్త, చెదారాన్ని గ్రామాల్లోని డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. ఇలా చెత్త సేకరణతో రోడ్లపై చెత్తను వేయడం అధికంగా తగ్గింది. కానీ పట్టణాల్లో, గ్రామాల్లో కొందరు ని ర్లక్ష్యంతో ఇంకా ఆరుబయట రోడ్లపై చెత్తను వే స్తున్నారు. ఇలా నిర్లక్ష్యంతో ఇక ముందు ఇలా చెత్తను రోడ్లపై వేస్తే రూ. 500 ఫైన్‌ చెల్లించక తప్పదు. ఇప్పటికే నిర్మల్‌ మున్సిపల్‌ పరిధిలో నలుగురికి జరిమానా విధించారు. అలాగే పలు గ్రామాల్లోనూ దీనిని అమలు చేస్తున్నారు. చెత్త ను ఎక్కడ పడితే అక్కడ వేస్తే తప్పని సరిగా రూ. 500 జరిమానా విధించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించింది. కాగా ఈ జరిమానాను రూ.500నుంచిరూ.వెయ్యి వరకు విధించవచ్చు. 

మొక్కలను మేసినా.. ప్లాస్టిక్‌ వేసినా.. 
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఒక వేళ నాటిన మొక్కలో 85 శాతం బతికించాలి. మొక్కలు బతకకపోతే సంబంధిత అధికారులు, పాలకులపై చర్యలు తీసుకోనుంది. దీంతో అధికారులు, పాలకులు సైతం మొక్కల సంరక్షణకు కఠినంగానే వ్యవహరించనున్నారు. పశువులు, గొర్రెలు మొక్కలను మేసినా.. పాడు చేసినా.. మొక్కకు రూ.500 చొప్పున జరిమానా విధించనున్నారు. అలాగే వినియోగించిన ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు, నీటి ప్యాకెట్‌లు వంటి వాటిని బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తే పాలక వర్గం జరిమానా విధించనున్నారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని దండెపల్లిలో ఓ వైన్స్‌ పక్కన ఇష్టారీతిన ప్లాస్టిక్‌ గ్లాసులు పడేసి ఉండటంతో ఆగ్రహించిన అక్కడి కలెక్టర్‌ రూ. 30వేలు జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడంతో పాటు అమలు చేశారు. ఇదే తరహాలో జిల్లాలోనూ ప్లాస్టిక్‌ వినియోగదారులపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఇక మనలో మార్పు రాకపోతే జరిమానాలు కట్టక తప్పదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top