నిమ్మగడ్డ ప్రసాద్‌ విడుదల

Nimmagadda Prasad Release From Jail In Serbia - Sakshi

యూఏఈ కోర్టులో ఫిర్యాదు 

సాక్షి, హైదరాబాద్‌: రస్‌ అల్‌ ఖైమా (రాక్‌) ఫిర్యాదు మేరకు సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ శుక్రవారం విడుదలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని వాన్‌పిక్‌లో పెట్టుబడులకు సంబంధించి తమకు అన్యాయం జరిగిందని రస్‌ అల్‌ ఖైమా యాజమాన్యం యూఏఈ కోర్టులో ఫిర్యాదు చేయడం తెలిసిందే. అక్కడి కోర్టు నుంచి లుకౌట్‌ నోటీసులు పొందిన రాక్‌ వాటి ఆధారంగా ఇంటర్‌పోల్‌ను అప్రమత్తం చేసింది. దీంతో బెల్‌గ్రేడ్‌లో దిగిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ అరెస్టు అక్రమమని, వాన్‌పిక్‌ ప్రాజెక్టు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న కారణంగా ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఇందులో ప్రసాద్‌ తప్పేమీ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రధానమంత్రి కార్యాలయానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకొని ప్రసాద్‌ను భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసాద్‌ తరఫున న్యాయవాదులు విడుదలకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఆయన శుక్రవారం విడుదలైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 
వివాదమేంటి? 
ప్రకాశం జిల్లాలో చేపట్టిన వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు రస్‌ అల్‌ ఖైమా స్థానిక భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్‌ ను గతంలో ఎంచుకుంది. ఈ ప్రాజెక్టులో రాక్‌ 26% వాటా తీసుకొని దాదాపు రూ.535 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. తర్వాత తలెత్తిన న్యాయపరమైన వివాదాల వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఈ ప్రాజెక్టుకోసం భారీగా పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన భూములను సైతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. దీంతో ప్రధాన భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్‌ పెట్టుబడులు సైతం అం దులో ఇరుక్కుపోయాయి. తమ పెట్టుబడులపై తగిన రాబడి రాలేదంటూ తాజాగా రాక్‌.. యూఏఈ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అడ్జుడికేటింగ్‌ అథారిటీ చేసిన ఈ అటాచ్‌మెంట్‌ సరికాదంటూ గతవారమే ఈడీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులిచ్చింది. ఆస్తులను జప్తు నుంచి విడుదల చేస్తూ రూ.235 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీ సమర్పించాలని కోరింది. దీంతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకు లు తొలగినట్లు అయింది. అదేసమయంలో బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డ అరెస్టు కావడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top