నేడు ఒక్కరోజే..! 

New Voters Online Registration Today Last Telangana - Sakshi

నల్లగొండ : ఓటరు నమోదుకు సోమవారం ఒక్కరోజే అవకాశం ఉంది. ఓటరు జాబితాలో పేరు లేనివారు ఇప్పుడు నమోదు చేసుకుంటేనే రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఓటుహక్కు కోల్పోవాల్సిందే. అర్హులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, జాయింట్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1,628 పోలింగ్‌స్టేషన్లలో ప్రత్యేక క్యాంపులు పెట్టి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.

అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే లక్ష్యం..
18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటహక్కు నమోదు చేసుకునే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టి ఓటుహక్కు నమోదు చేసుకునే విధంగా జిల్లాలో అనేక ప్రచార, చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఓటుహక్కు నమోదు చేసుకుంది. అంతేకాకుండా ఒకచోట నుంచి మరోచోటుకు ఓటును మార్పుకోవడంతోపాటు పేర్లలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు కూడా అవకాశం ఇవ్వడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కానీ ఎన్నికల సమయానికి అక్కడక్కడా ఓట్లు గల్లంతయ్యాయి. చాలా మంది ఓటర్లు ఓటు వేసే అవకాశం లేక నిరాశకు గురయ్యారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన, 1 జనవరి 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా.. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 25వ తేదీ ఓటరు నమోదుకు చివరి తేదీగా నిర్ణయించి అవకాశం కల్పిం చింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంతా బిజీగా ఉండడంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఓటరు నమోదు ఫిబ్రవరి 4 వరకు పొడిగించింది.

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు
సోమవారం ఓటు నమోదుకు చివరి గడువు కావడంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1,629 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. సెలవు దినం ప్రజలకు అనుకూలంగా ఉంటుందని ఆది వారం ఈ క్యాంపులు ఏర్పాటు చేశా రు. ప్రతీ పోలింగ్‌స్టేషన్‌లో బీఎల్‌ఓలను ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచారు. వారి వద్ద కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఫారం–6తో పాటు మార్పులు, చేర్పుల కోసం కూడా దరఖాస్తులను సిద్ధంగా ఉంచారు.

ప్రజల నుంచి మంచి స్పందన..
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పోలింగ్‌ స్టేషన్లకు వచ్చి ఓటు లేనివారు ఓటుహక్కు నమోదు చేసుకోవడంతోపాటు కొందరు పేర్లలో దొర్లిన తప్పిదాలను సరి చేసుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారు.

క్యాంపులను పరిశీలించిన జేసీ, ఆర్డీఓ..
పోలింగ్‌ స్టేషన్లలో నిర్వహించిన ప్రత్యేక క్యాంపులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, నల్లగొండ ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. నల్లగొండ పట్టణంలోని పశు వైద్యశాల వద్ద ఉన్న పోలింగ్‌ స్టేషన్‌తోపాటు ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఉన్న పోలింగ్‌స్టేషన్‌ను రామగిరి, ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్‌ స్టేషన్‌ను సందర్శించి ఓటు నమోదు, తదితర విషయాలపై బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు.
 
నేడు ఆఖరి గడువు..
ఓటు నమోదుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది. వచ్చే పార్లమెంట్, తదితర ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఓటు లేని వారు ఓటుహక్కు నమోదు చేసుకోవాల్సిందే. ఓట్లు గల్లంతైనా.. 18 సంవత్సరాలు నిండి ఓటు లేనివారు దరఖాస్తు చేసుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top