ఫీల్‌.. కూల్‌ | Nehru Zoo Park Staff Caring Wild Animals From Summer Heat | Sakshi
Sakshi News home page

ఫీల్‌.. కూల్‌

May 28 2020 8:19 AM | Updated on May 28 2020 8:19 AM

Nehru Zoo Park Staff Caring Wild Animals From Summer Heat - Sakshi

ఠారెత్తిస్తున్న ఎండలతో ఇళ్ల నీడన ఉంటున్న మనుషులే తల్లడిల్లుతున్నారు. మరి వేడి సెగలు, వడగాలుల మధ్య తిరుగాడే వన్యప్రాణులు ఇంకెంత విలవిలలాడాలి. నాలుగైదు రోజులుగా నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ క్రమంలో వేసవి తాపం నుంచి మూగజీవాలను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్‌ పార్కులో చర్యలకు ఉపక్రమించారు. జూలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చింపాంజీ, కోతులు, పులులు, సింహాలు, చిరుత పులుల ఎన్‌క్లోజర్‌ లోపల 50కిపైగా కూలర్లను ఏర్పాటు చేసి చల్లదనాన్ని కల్పిస్తున్నారు. నిశాచర జంతుశాల(నైట్‌ హౌజ్‌)లో ఎయిర్‌ కండిషనర్లు, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లను పెట్టారు.         

బహదూర్‌పురా :సూరీడు సుర్రుమంటున్నాడు.. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి.. నగరంలో    పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో కాస్త తక్కువగా ఉన్నా.. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో కాస్త రక్షణ పొందారు. గత నాలుగైదు రోజులుగా నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. వేసవి తాపం నుంచి జీవులను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్‌ పార్కులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ప్రారంభంలోనే జూలోని వన్య ప్రాణుల సంరక్షణకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రస్తుతం మరింత శ్రద్ధ పెట్టారు.     

జంతువులు ఉండే చోట్ల స్ప్రింక్లర్లు, చిన్న రెయిన్‌గన్స్‌లను ఏర్పాటు చేసి నీటిని విరజిమ్ముతున్నారు. పక్షులు ఇతర వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లో ఫాగర్లను ఏర్పాటు చేసి నీటి బిందువులను పొగమంచు వలే విరజిమ్ముతున్నారు. వన్యప్రాణుల ఎన్‌క్లోజర్ల పైకప్పుపై తుంగ గడ్డిని ఏర్పాటు చేసి ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. చింపాంజీ, కోతులు, పులులు, సింహాలు, చిరుతపులుల ఎన్‌క్లోజర్‌ లోపల 50పైగా కూలర్లను ఏర్పాటు చేసి చల్లదనాన్ని కల్పిస్తున్నారు. నిశాచర జంతుశాల(నైట్‌ హౌజ్‌)లో ఎయిర్‌ కండిషనర్లు, ఎగ్జాస్‌ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు.

వెటర్నరీ వైద్య సిబ్బందితో పర్యవేక్షణ.. 

వన్యప్రాణులను జూపార్కు వెటర్నరీ వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేసవిలో పుట్టిన వన్యప్రాణుల కూనలపై మరింత శ్రద్ధ తీసుకుంటూ అన్ని రకాల చర్యలను చేపడుతున్నామని జూపార్కు క్యూరేటర్‌ క్షితిజ తెలిపారు. ఓపెన్‌ ఎన్‌క్లోజర్‌లోని ఏనుగులు, తాబేలు, నీటిగుర్రం, ఖడ్గమృగంతో పాటు ఆస్ట్రిచ్‌ పక్షి ఇతర వన్యప్రాణుల ఎన్‌క్లోజర్లలో నీటిని నేరుగా వన్యప్రాణులపైకి విరజిమ్ముతున్నట్లు వారు వివరించారు. 

వేసవి తాపాన్ని తట్టుకునేలా... 

వేసవిని తట్టుకునేందుకు వన్యప్రాణులకు పుచ్చకాయలు, కర్బూజ వంటివి అందిస్తున్నారు. గ్లూకాన్‌డీ, ఎలక్ట్రాల్‌ పౌడర్, విటమిన్‌–సీ, బీ కాంప్లెక్స్‌ సప్లిమెంట్లను అందిస్తూ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతున్నారు. సూర్యకాంతి నేరుగా వన్యప్రాణులపై పడకుండా కిటికీలు, వెంటిలేటర్లు, తలుపులకు గోనె సంచులను కప్పి వాటిని నీటితో ఎప్పటికప్పుడు తడుపుతున్నారు. పక్షుల ఎన్‌క్లోజర్ల పైకప్పులు, చుట్టుపక్కల ఆకుపచ్చని నీడ వలయాలను ఏర్పాటు చేశారు. వన్యప్రాణులకు సురక్షితమైన నీటిని అందిస్తున్నారు. లోపల ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేశారు. 

ఎండ వేడిని తట్టుకునే శక్తి వేటికిఎంత..?

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు 44 డిగ్రీలకు పైగా పెరగడంతో కొన్ని వన్యప్రాణులు, పక్షులు పిట్టల్లా రాలిపోతున్నాయి. మనుషులతో పాటు వన్యప్రాణులు ఎండ వేడిని కొంతమేర తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. 38–40 డిగ్రీల ఎండను కొన్ని వన్యప్రాణులు ఓర్చుకుంటాయి. క్రూర జంతువులైన పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్లు, చిరుతపులులు, ఎలుగుబంట్లు 40 డిగ్రీల ఎండను సైతం తట్టుకుంటాయి. భారీ జంతువైన ఏనుగు 44 డిగ్రీల ఎండను సైతం ఓర్చుకోగలుగుతుంది. ఆస్ట్రిచ్‌ పక్షులు 45–47 డిగ్రీల ఎండలో హాయిగా జీవిస్తాయి. చిన్న పక్షులైతే 40 డిగ్రీలలోపు ఎండ వేడిమికే సతమతమవుతాయి.  
రామచిలుకలు, అడవి కోళ్లు, బాతులు, ఇతరత్ర చిన్న చిన్న పక్షులు జూలో 500కు పైగా ఉన్నాయి. సహజ సిద్ధమైన జూ వాతావరణంలో ఎండ తీవ్రత కూడా తక్కువగానే ఉంటుంది. 40 డిగ్రీల వరకు ఎండ వేడిమిని అతికష్టం మీద ఈ పక్షులు తట్టుకోగలుగుతాయి. రాత్రివేళ సంచరించే నిశాచర జంతువు, దేవాంగ పిల్లి, గబ్బిలాలు, ముళ్ల పంది, రాటేల్, అడవి పిల్లులు 40 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement