జనంపైకి జన్యు విషం! | Sakshi
Sakshi News home page

జనంపైకి జన్యు విషం!

Published Mon, Jan 29 2018 2:10 AM

negative effects of cottonseed oil on human life - Sakshi

జనం కడుపులోకి జన్యు విషం చొరబడుతోంది. బహుళజాతి సంస్థలు గుట్టుచప్పుడుగాకుండా రైతులకు అంటగట్టిన ప్రమాదకర బీజీ–3 పత్తి.. ఇప్పుడు నూనె రూపంలో గరళాన్ని చిమ్ముతోంది. బ్రాండెడ్‌ రకాల నూనెల్లో కలిసిపోయి కేన్సర్‌ కారకాలను నేరుగా వంటింటికే మోసుకొస్తోంది. వేలకొద్దీ ఆయిల్‌ డబ్బాల్లో ఈ నూనెను కలిపేసి, వాటికి వివిధ కంపెనీల నకిలీ లేబుల్స్‌ను అతికించి మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు అక్రమార్కులు! హైదరాబాద్‌ శివారుల్లోని కాటేదాన్‌ నుంచి బేగంబజార్‌లోకి, అక్కడ్నుంచి వ్యాపారులకు, వారి నుంచి ఇళ్లకు, హోటళ్లకు, టిఫిన్‌ సెంటర్లకు, రోడ్లపై బజ్జీ దుకాణాలకు, చిరుతిళ్ల షాపులకు చేరిపోతోంది ఈ విషపు నూనె. అటు పశువులకు దాణాగా ఈ పత్తి పిండినే ఇస్తుండటంతో పాల రూపంలోనూ నేరుగా జనం ఒంట్లోకి ప్రవేశిస్తోంది. బీజీ–3 జన్యుమార్పిడి పత్తి నూనె, పశువుల దాణా మార్కెట్‌లోకి చొరబడుతున్న తీరుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. పత్తి మిల్లుల నుంచి పారిశ్రామికవాడల వరకు, అక్కడ్నుంచి జనం చెంతకు ఈ నూనె చేరుతున్న వైనంపై సమగ్ర కథనం..  

వర్ధెల్లి వెంకటేశ్వర్లు
బీజీ విషానికి బహుళజాతి కంపెనీలే బీజాలు వేశాయి. పత్తి మొక్కలు శనగపచ్చ పురుగుతోపాటు ఇతర చీడలను తట్టుకునేలా జన్యుమార్పిడి పత్తి విత్తనాలను అభివృద్ధి చేశాయి. గతంలో ఉన్న బీజీ–2 పత్తి విత్తనాల్లో హెర్బిసైడ్‌ టాలరెంట్‌ జన్యువును చొప్పించి బీజీ–3 విత్తనాలను సృష్టించాయి. అంతేగాకుండా ఈ మొక్కల చుట్టూ కలుపు పెరగకుండా నిరోధించే ‘గ్లైఫోసేట్‌’ అనే రసాయనాన్ని రూపొందించాయి. అయితే మన దేశంలో బీజీ–3 పత్తి సాగుపై నిషేధం ఉంది. అందులో ప్రమాదకరమైన కేన్సర్‌ కారకాలు ఉన్నాయని అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌సీ) కూడా నిర్ధారించింది. అయినా బహుళజాతి సంస్థలు దొంగచాటుగా తెలంగాణలో సుమారు 13 లక్షల ఎకరాల్లో బీజీ–3 పత్తి సాగయ్యేలా చేశాయి. రైతులకు తెలియకుండా, వారి ఖర్చులతోనే బీజీ–3 పత్తి సాగయ్యేలా విత్తనాలను అంటగట్టి.. సాగు ప్రయోగ ఫలితాలను పరిశీలిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం కూడా రాసింది. దానిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించగా.. కమిటీ తెలంగాణలో అక్రమంగా బీజీ–3 సాగు జరిగినట్టు నిర్ధారించింది. 

విత్తనాలన్నీ కలగలసిపోయి..
రాష్ట్రంలో గతేడాది 47 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల చొప్పున 3.76 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే బీజీ–3 సాగుచేసిన చోట ఎకరాకు సగటున నాలుగు క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. అంటే 13 లక్షల ఎకరాలకుగాను 52 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. రైతులు ఈ పత్తిని సాధారణ పత్తి కిందనే జమ కట్టి విక్రయించారు. దీంతో సాధారణ పత్తి, బీజీ–3 పత్తి కలిసిపోయింది. ఇలా కలగలిసిన పత్తి జిన్నింగ్‌ మిల్లులకు వెళ్లగా.. పత్తి గింజలు కూడా కలిసిపోయాయి. క్వింటాల్‌ పత్తి నుంచి సగటున 60 కిలోల గింజలు వస్తాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 2.35 కోట్ల క్వింటాళ్ల పత్తి గింజలు ఉత్పత్తయ్యాయి. ఇందులో 50 శాతం గింజలను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. మిగతా దాదాపు 1.10 కోట్ల క్వింటాళ్ల గింజలను రాష్ట్రంలోనే వివిధ మిల్లుల్లో మరపడుతున్నారు. దీంతో సుమారు లక్ష టన్నుల పత్తి నూనె, 8.25 లక్షల టన్నుల పత్తి పిండి (కేక్‌) ఉత్పత్తవుతోంది. ఈ నూనె, పత్తి పిండిలో బీజీ–3 ఉత్పన్నమైన హెర్బిసైడ్‌ టోలరెంట్‌ ప్రొటీన్, కలుపు నివారణగా వాడే గ్లైఫో సేట్‌ రసాయనం అవశేషాలు ఉంటున్నాయి. 

రూ.750 కోట్ల నూనె వ్యాపారం 
అ«నధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో నెలకు 70 వేల టన్నుల మంచినూనెను వంటల్లో వాడుతున్నారు. ఇందులో 40 వేల టన్నులు గృహ అవసరాల కోసం, 30 వేల టన్నులు వ్యాపారపరమైన వంటకాలు, పదార్థాల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో 20 శాతం పత్తి నూనె.. బ్రాండెడ్‌ నూనెలతో కలిసిపోయి వస్తున్నట్టు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి నూనెను తినటానికి వీలైనదిగానే ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) గుర్తించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దీని వినియోగం ఎక్కువగానే ఉంది. అయితే అత్యంత నాణ్యతా ప్రమాణాలతో శుద్ధి (రిఫైండ్‌) చేసినప్పుడు మాత్రమే ఆరోగ్యకరమని, లేకుంటే ప్రమాదకరమైన కార్సినోజెనిక్‌ కారకంగా మారే ప్రమాదం ఉందని వెల్లడించింది. మొత్తంగా రాష్ట్రంలో అధికారిక , అనధికారిక వ్యాపారాన్ని కలుపుకుంటే ఏడాదికి రూ.750 కోట్ల విలువైన పత్తి నూనె వ్యాపారం సాగుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఎక్కువగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, పామాయిల్, నూనెల్లో పత్తినూనెను కలుపుతున్నారు. ఆలీవ్, ఆవ, సోయాబీన్‌ నూనెల్లో కాస్త తక్కువ మోతాదులో కలిపి కల్తీ చేస్తున్నారు. 

పత్తి పిండి రూపంలో పశువులకు..
పత్తి పిండికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. 50 కిలోల పత్తి కేకును రూ.2200 చొప్పున విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌ శివారులోని పటాన్‌చెరు, మేడ్చెల్, శామీర్‌పేట ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాల్లో 100 నుంచి 150 పశువుల సామర్థ్యం ఉన్న 12 డెయిరీలను ‘సాక్షి’ పరిశీలించింది. ప్రతి డెయిరీలో పత్తి పిండి దాణా పెడుతున్నారు. కిలో పత్తిపిండి, 2 కిలోల తవుడు, కిలో శనగ పిండితో కలిపి 2 పూటలు అందిస్తున్నారు. గోనె సంచుల్లో పత్తి కేకును నింపి కంపెనీ పేరు లేకుండా విక్రయిస్తున్నారు. ఈ దాణా ఎక్కువగా కరీంనగర్‌ నుంచి వస్తోందని డెయిరీల్లో కార్మికులు చెప్పారు. 6 డెయిరీల్లో ఇదే తరహా దాణా కన్పించింది. మిల్లుల నుంచి తీసిన కేకును శుద్ధి చేయకుండా నేరుగా గోనె సంచుల్లోకి నింపి డెయిరీలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు రూ.1,700 కోట్ల పత్తి పిండి వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. 

కాటన్‌ మిల్లు నుంచి కాటేదాన్‌ వరకు
సాధారణ పత్తి గింజలతో కలిసిపోయిన బీజీ–3 విత్తనాలన్నీ ఆయిల్‌ మిల్లులకు చేరుతున్నాయి. కానీ అక్కడ్నుంచి ‘రిఫైన్‌’ కాకుండానే నూనె నేరుగా మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. కరీంనగర్‌ జిల్లాలోని ఓ కాటన్‌మిల్లులో పత్తి గింజల నుంచి నూనె తీసే ప్రక్రియను ‘సాక్షి’ పరిశీలించింది. దీనికి అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. రోజుకు 10 టన్నుల గింజలను మర ఆడించే సామర్థ్యం ఉంది. నూనె తీయటం, విక్రయించటం చట్టబద్ధమే. సగటున ప్రతి రెండ్రోజులకు ఒక ట్యాంకర్‌ చొప్పున ముడి నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతోంది. పత్తి నుంచి తీసిన ముడి నూనెను అధీకృత రిఫైనరీ కంపెనీలకు మాత్రమే విక్రయించాలి. 

మిల్లులో తీసిన ప్రతి లీటర్‌ ముడి నూనెను ఏయే కంపెనీలకు విక్రయించారో కచ్చితంగా నమోదు చేయాలి. కానీ ఇక్కడ అది జరగటం లేదు. అడ్డూ అదుపు లేకుండా ఎవరికి పడితే వాళ్లకు విక్రయిస్తున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మరో పారిశ్రామిక వాడలో మరో మిల్లును ‘సాక్షి’ పరిశీలించింది. ఇక్కడ జిన్నింగ్‌ మిల్లుల నుంచి క్వింటాల్‌కు రూ.1,200 చొప్పున పత్తి గింజలు తీసుకువచ్చి మరపడుతున్నారు. క్వింటాల్‌ గింజల నుంచి 9.5 కిలోల నూనె, 75 కిలోల పత్తి పిండి వస్తోంది. కిలో ముడి తైలానికి అధీకృత రిఫైనరీ కంపెనీలు రూ.60, అక్రమ కంపెనీలు రూ.65 చొప్పున మిల్లులకు చెల్లిస్తున్నాయి. దీంతో మిల్లుల యాజమా న్యం తమ సరుకును అక్రమార్కులకే అప్పగిస్తున్నారు  ఇలా సేకరించిన ప్రతి చుక్క నూనె నేరుగా కాటేదాన్‌ పారిశ్రామికవాడకు తరలిపోతోంది. 

అడ్డమైన కెమికల్స్‌ కలిపి.. నకిలీ లేబుల్స్‌ అతికించి..
కాటేదాన్‌లో 100కు పైగా చిన్న తరహా అక్రమ రిఫైనరీ పరిశ్రమలు ఉన్నాయి. ముడి పత్తి నూనెలో ఉన్న మడ్డీని కరిగించి ఇందులో ఏవేవో రసాయనాలు కలుపుతున్నారు. ఈ రసాయనాలు ఏ పేరుతో పిలుస్తారో.. ఏం కలుపుతున్నారో అక్కడ పని చేసే కార్మికులకు కూడా తెలియదు. పలుచబడిన నూనెకు పాక్షికంగా ఆకుపచ్చ వర్ణం వచ్చే వరకు మరో రసాయనాన్ని కలుపుతున్నారు. ఈ ద్రావణాన్ని ఇతర బ్రాండెడ్‌ ఆయిల్స్‌తో మిక్స్‌ చేసి బ్రాండెడ్‌ భ్రమ కల్పిస్తున్నారు. నూనె డబ్బాల రిసైక్లింగ్‌ పేరుతో ముందుగానే వేల కొద్ది ఖాళీ ఆయిల్‌ డబ్బాలను సేకరిస్తున్నారు. వాటికి వివిధ కంపెనీల నకిలీ లేబుల్స్‌ను అతికించి, డబ్బాల్లో ఈ ఆయిల్‌ నింపి ఏమాత్రం అనుమానం రాకుండా సీల్‌ చేసి మార్కెట్‌లోకి తరలిస్తున్నారు. ఈ సరుకు వివిధ ఏజెన్సీల ద్వారా ముందుగా బేగంబజార్‌కు చేరుతోంది. అక్కడ్నుంచి టోకు వ్యాపారులకు వారి నుంచి చిల్లర వ్యాపారులకు చేరుతోంది. వారి ద్వారా గృహాలకు, హోటళ్లకు, టిఫిన్‌ సెంటర్లకు, రోడ్లపక్కన బజ్జీల దుకాణాలకు, చిరుతిళ్ల షాపులకు చేరిపోతోంది. 

ఆ పాలల్లో విషపు అవశేషాలు
రాష్ట్రంలో 90.5 లక్షల ఆవు లు, కోడెలు, బర్రెలు ఉన్నాయి. వీటిలో 60 లక్షల వరకు పశువులు పాలిచ్చేవి. పాలిచ్చే పశువుల కోసం గతంలో వేరుశనగ పిండి. తవుడు కలిపి దాణాగా పెట్టేవాళ్లు. కానీ వేరుశనగ సాగు గణనీయంగా తగ్గి, పత్తి సాగు పెరగడంతో పత్తి పిండిని దాణాగా పెడుతున్నారు. ముఖ్యంగా డెయిరీల్లోని పశువులకు ఇదే ప్రధాన దాణాగా మారింది. కోళ్లకు, గొర్రెలకు కూడా దీన్ని దాణాగా వాడుతున్నారు. గింజల నుంచి తైలం తీయగా మిగిలిన కేక్‌ను పత్తి పిండిగా పిలుస్తారు. వేర్వేరు బ్రాండ్ల పేరుతో పత్తి పిండిని మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు 6.5 వేల టన్నుల పిండిని దాణాగా వాడుతున్నట్లు పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. 

మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. జన్యు మార్పిడి కోసం వాడిన హెర్బిసైడ్‌ టాలరెంట్‌ ప్రొటీన్, గ్లైఫోసేట్‌ అవశేషాలు పూర్తిగా ఇందులోనే ఉంటాయి. దీన్ని తిన్న పశువుల్లో జన్యు ఉత్పరివర్తనాలు రావటంతో పాటు ప్రమాదకరమైన రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. బీజీ–3 పత్తి విత్తన ఆధారిత పదార్థాలను పశువులకు పెట్టకుండా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి జిల్లా అధికారులను ఆదేశించడం గమనార్హం. బీజీ–3 పత్తి పిండి తిన్న పశువుల పాలలో జన్యు విష రసాయనాల అవశేషాలు ఉంటాయని, వాటిని తాగితే అవి కార్సినోజెనిక్‌ ఏజెంట్లుగా మారి కేన్సర్‌ సోకే లక్షణాలను రెట్టింపు చేస్తాయని ఇటీవలి పరిశోధనలు బయటపెట్టాయి. 

ఎలుకలపై ప్రయోగాల్లో ఏం తేలిందంటే..
జన్యుమార్పిడి పంటల నుంచి తీసిన నూనెలు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ఇప్పటివరకైతే పూర్తిస్థాయి పరిశోధన జరుగలేదుగానీ.. అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధక సంస్థ మాత్రం (ఐఏఆర్‌సీ) బీజీ–3 గింజల ఆధారిత పదార్థాలు కేన్సర్‌ కారకాలేనని నిర్ధారించింది. విత్తనాల్లోకి చొప్పించిన హెర్బిసైడ్‌ టాలరెంట్‌ ప్రొటీన్, జన్యుపరంగా మార్పు చెందిన గ్లైఫోసేట్‌ అత్యంత ప్రమాదకర కేన్సర్‌ ఏజెంట్లే అని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎలుకలపై ప్రయోగాలు చేసింది. ఎలుకలను పదే పదే గ్లైఫోసేట్‌ ప్రభావానికి గురిచేసి పరీక్షించగా.. మగ ఎలుకల్లో అరుదైన కణితి, ఆడ ఎలుకల్లో మూత్ర నాళాల్లో కేన్సర్‌ సోకేందుకు సానుకూలమైన మార్పు ను ప్రేరేపించినట్లు గుర్తించారు. క్షీరదాలలోని క్రోమోజోమ్‌ నష్టం, జన్యు ఉత్పరివర్తన అవకాశాలు పెరిగినట్లు గుర్తించారు. గ్లైఫోసేట్‌ సమ్మేళనాలు చల్లిన క్షేత్రా ల్లో పని చేసిన వ్యవసాయ కార్మికుల నుంచి తీసిన రక్తం, మూత్ర నమూనాల్లో అమీనోమైథైల్ఫాస్ఫరిక్‌ యాసిడ్‌ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఇది కణజాల క్షయాన్ని ప్రేరేపిస్తోందని ఐఏఆర్‌సీ ఈ కారణాల నేపథ్యంలోనే మన దేశంలో బీజీ–3 పత్తి సాగును కేంద్రం నిషేధించింది.

జీర్ణ వ్యవస్థపై హానికర ప్రభావం
ఇలాంటి నూనెల ప్రభావంతో డ్రాప్సీ వ్యాధి రావ టానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గ్లైఫోసేట్‌ జీర్ణవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. నూనె కల్తీ కావడంతో హెపటైటిస్‌ బి (కామెర్లు) రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది..
     – డాక్టర్‌ మధుసూదన్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు 

శుద్ధి చేసింది అయితే మంచిదే..
పత్తి నూనెకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) గుర్తింపు ఉంది. శుద్ధి (రిఫైన్‌) చేసిన నూనె ఆరోగ్య రీత్యా కూడా మంచిదే. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో పత్తి నూనె వినియోగం ఎక్కువగా ఉంది. వేరుశనగ, నువ్వుల నూనెలను శుద్ధిచేయకపోయినా ఆహారంలో వినియోగించొచ్చు. కానీ బీజీ–3 పత్తి నూనెను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఆ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పిండి (కేక్‌)లో హెర్బిసైడ్‌ టాలరెంట్‌ ఇతర రసాయన అవశేషాలు ఉంటాయి. వాటిని నేరుగా పశువులకు పెట్టడం ప్రమాదకరం
                                   – డాక్టర్‌ ప్రసాద్, ఆయిల్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ప్యానల్‌ కమిటీ జాతీయ చైర్మన్‌


 

Advertisement
 
Advertisement
 
Advertisement