వైభవంగా నాగోబా జాతర ప్రారంభం

Nagoybh grandeur of excellence - Sakshi

మెస్రం వంశీయుల మహాపూజలు 

ఆదివాసీ సంస్కృతికి అద్దంపట్టేలా సంప్రదాయ పూజలు 

ఇంద్రవెల్లి (ఖానాపూర్‌): ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే మెస్రం వంశీయులు వారు బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. మెస్రం వంశ పెద్దలు 22 కితల వారీగా కొత్త కుండలను ఇవ్వగా.. మహిళలు పెద్దల ఆశీర్వాదం తీసుకుని అందుకున్నారు. ఆ వంశ అల్లుళ్లు, ఆడపడుచులు వరుసగా వెళ్లి వడమర సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త కుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే గల పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వగా.. ఆ మట్టితో మహిళలు తిరిగి కొత్త పుట్టను తయారు చేశారు.

తయారు చేసిన పుట్టల నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి మొక్కుకున్నారు. అనంతరం ఏడు వరుసలతో తయారు చేసిన మట్టి ఉండలతో నాగోబా ఆలయం పక్కనే ఉన్న ఆలయంలో సతి దేవతల బౌలను తయారు చేసి సంప్రదాయ పూజలు చేశారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని రాత్రి 9 నుంచి 11 గంటల వరకు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు భేటింగ్‌ (పరిచయం) పూజలకు ఏర్పాటు చేశారు. కొత్తగా పెళ్లయిన వారు, ఇప్పటి వరకు నాగోబాను దర్శించుకోని 50 మందికి పైగా మెస్రం వంశం కోడళ్లు పాల్గొన్నారు. భేటింగ్‌తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top