ప్రజల అంగీకారంతోనే నిర్మిస్తాం..

Minister Kadiyam Srihari Review Lingampally Project - Sakshi

చిల్పూరు(స్టేషన్‌ఘన్‌పూర్‌): లింగంపల్లి గ్రామస్తుల అంగీకారంతోనే రిజర్వాయర్‌ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని లింగంపల్లిలో రూ.3,223 కోట్లతో 10.78 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్‌ నిర్మించేందుకు గ్రామస్తుల అభిప్రాయ సేకరణకు ఆదివారం గ్రామ సమీపంలోని సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షత వహించారు. ముందు గ్రామస్తులతో అభిప్రాయం కోసం మాట్లాడించగా కన్నీరు పెట్టుకుంటూ ఎట్టిపరిస్థితుల్లో రిజర్వాయర్‌ నిర్మాణానికి తమ భూములు ఇచ్చేది లేదని తెలిపారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రజలు అనుకున్న విధంగా పోలీసు బలగాలు, అధికారుల హెచ్చరికలతో సాఫీగా పనులు చేయవచ్చని, ఆ విధానం సీఎం కేసీఆర్‌కు నచ్చదని, అందుకే అభిప్రాయ సేకరణ సభ నిర్వహించినట్లు తెలిపారు.

వాస్తవంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ రిజర్వాయర్లు ఉన్నాయని, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో లేనందున సీఎం కేసీఆర్‌ ఇక్కడ కూడా సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థలసేకరణ చేయాలంటూ ఆదేశించారని అన్నారు. అందుకు గీసుకొండ, మైలారం, స్టేషన్‌ఘన్‌పూర్, గండిరామారం రిజర్వాయర్లను పరిశీలించగా మల్కాపూర్‌–లింగంపల్లి మధ్య ఎంపిక చేశామని తెలిపారు. ఇక్కడ 848 ఇళ్లు, 4,400 ఎకరాలు, తక్కువ ముంపుతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. 4,139 మంది ప్రజలు మాత్రమే ఇబ్బంది పడతారని, రానున్న రోజుల్లో వర్షాలు లేకున్నా తోటి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని భావిస్తున్నట్లు చెప్పారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి గ్రామస్తులు సహకరించాలని కోరా రు.

దేవాదుల సీఈ బంగారయ్య మాట్లాడుతూ 4,400 ఎకరాల్లో నిర్మించే లింగంపల్లి రిజర్వాయర్‌ పూర్తయ్యాక, ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద 78 మెగావాట్ల పంప్‌హౌజ్‌ నిర్మించి మూడు పైప్‌లైన్ల ద్వారా నీటిని నింపనున్నట్లు తెలిపారు. జనగామ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముంపు భూముల ప్రజలకు న్యాయం జరిగిన తర్వాతే పనులు మొదలవుతాయని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ కోరినవిధంగా ప్రభుత్వం నుంచి పరిహారం అందించేందుకు కృషిచేస్తానని అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు స్వామినాయక్, ఎంపీపీ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్డీఓ రమేశ్, తహసీల్దార్‌ గంగాభవాని, పోలేపల్లి రంజిత్‌రెడ్డి, బబ్బుల వంశి, తెల్లాకుల రామకృష్ణ, ఉద్దెమారి రాజ్‌కుమార్, వరప్రసాద్, గొడుగు రవి, జంగిటి ప్రభాకర్, ఇల్లందుల సుదర్శన్, పాగాల సంపత్‌రెడ్డి, జనగాం యాదగిరి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top