కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం

Minister Harish Rao Meets Union Minister Nitin Gadkari - Sakshi

గడ్కరీ ప్రశంసలు

ప్రాజెక్టు సందర్శనకు ఆహ్వానించిన హరీశ్‌

3,000 టీఎంసీల మిగులుంటే తీసుకోండి

కేంద్రానికి స్పష్టం చేసిన మంత్రి

తెలంగాణ అవసరాలే ముందని వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ తాగు, సాగు అవసరాల కోసం చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనితీరు భేష్‌ అని కితాబిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి అధిక నిధుల కేటాయింపు, వేగవంతంగా పనులు కొనసాగించడం తదితరాలను ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో 14వ అంతర్రాష్ట్రీయ నదుల అనుసంధానంపై గడ్కరీ అధ్యక్షతన భేటీ జరిగింది. మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ  పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలు, పనుల పురోగతిని  గడ్కరీ ప్రశంసించారు. భేటీలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులకు చెందిన నదుల అనుసంధానంపై చర్చించారు.

గోదావరే శరణ్యం: హరీశ్‌
గోదావరి–కావేరి నదులను తొలి దశలో, మహానది–గోదావరిలను రెండో దశలో అనుసంధానిస్తామని కేంద్రం ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం 4 ప్రధానాంశాలను లేవనెత్తింది. నీటి లభ్యత, నీటి వనరులు–నీటి తరలింపు, ప్రత్యామ్నాయ మార్గాలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటి ఉపయోగం–పర్యావరణ అనుకూలత తదితరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. మహానది–గోదావరి అనుసంధానాన్నే తొలి దశలో చేపట్టి, ఆ తర్వాతే గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించాలని హరీశ్‌ సూచించారు. కేంద్రం చెబుతున్నట్టుగా ఏటా 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నట్టయితే అనుసంధానానికి తెలంగాణ పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

‘‘రెండు నదుల మధ్య ఉన్న తెలంగాణను ప్రధానంగా నీటి కోసమే సాధించుకున్నాం. కాబట్టి మాకిది చాలా ప్రాధాన్యాంశం. కృష్ణాలో నీటి లభ్యత రోజురోజుకు తగ్గిపోతోంది. అందులో 300 టీఎంసీ నికర జలాలు, 70 టీఎంసీ మిగులు జలాలు తెలంగాణ హక్కు. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తుది కేటాయింపులు జరపాల్సి ఉంది. కానీ కృష్ణాలో అంత నీరు తెలంగాణకు దక్కడం లేదు. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకునేందుకు ట్రిబ్యునల్‌ అనుమతించింది. దాంతో కృష్ణాలో నీటి లభ్యత ఇంకా తగ్గుతుంది. కాబట్టి తెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతం కూడా గోదావరి నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

గోదావరి జలాల్లో 954 టీఎంసీలు తెలంగాణ హక్కు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసి ఈ హక్కును పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలని మా ప్రభుత్వం కృషి చేస్తోంది. కాళేశ్వరం, దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ తదితరాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తోంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం సస్యశ్యామలమవుతుంది. దీనితో రాష్ట్ర పరి«ధిలోనే నదుల అనుసంధానం చేపడుతున్నాం. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు కూడా సీతారామ ద్వారా నీరిస్తున్నాం. మొత్తంగా కృష్ణా, గోదావరుల నుంచి తెలంగాణకు 1,700 టీఎంసీలు కావాలి. ఇది పోను ఇంకా మిగులు జలాలుంటే ఇవ్వడానికి మేం సిద్ధం’’అని వివరించారు.

అక్కనపల్లికి ఒప్పుకోం!
అక్కనపల్లి వద్ద బ్యారేజీ కట్టాలన్న కేంద్రం యోచనపై హరీశ్‌ అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అది సీతారామపై ప్రభా వం చూపుతుంది. పైగా అక్కనపల్లి వద్ద నీటి లభ్యత లేదని మా అధ్యయనంలో తేలింది.  ‘అక్కనపల్లి వల్ల తెలంగాణలో 42 వేల ఎకరాలు, 45 గ్రామాలు ముంపు నకు గురవుతాయి. ఇందుకు మేం సిద్ధం గా లేం. మొదట మహానది–గోదావరిని కలిపి గోదావరి నుంచి కృష్ణాకు, కృష్ణా నుంచి కావేరికీ కలిపి నీరు తీసుకెళ్తే అభ్యంతరం లేదు. ప్రభుత్వం చెబుతున్నట్టు ఏటా 3,000 టీఎంసీలు సము ద్రంలో కలుస్తున్నాయా అన్నదానిపై లెక్కతేల్చాలి.

తెలంగాణకు కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టులకు అనుమతులిచ్చే ముందు 40 ఏళ్ల సిరిస్‌ ఆధారంగా నీటి లభ్యతను లెక్కగట్టిన కేంద్రం, అక్కనపల్లి విషయంలో మాత్రం 110 ఏళ్ల సిరిస్‌ ఆధారంగా లెక్కించి 170 టీఎంసీల లభ్యత ఉందనడం సరికాదు. గోదావరి, కృష్ణా నుంచి తెలంగాణ నీటి అవసరాలను పక్కన పెట్టిన అనంతరం మిగులు జలాలను ఇవ్వడంలో అభ్యంతరం లేదు. నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, రాష్ట్ర అధికారుల అధ్వర్యంలో కమిటీ వేసి అధ్యయనం చేయించాలి’’అని భేటీలో కోరినట్టు హరీశ్‌ మీడియాకు తెలిపారు.  ప్రాజెక్టు పనుల పరిశీలనకు రావాల్సిందిగా కోరగా గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top