
కేంద్రానికి మంత్రి హరీశ్ లేఖ
రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ ద్వారా మార్చి నెలాఖరు వరకు కందుల సేకరణకు గడువు పొడిగిస్తూ భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ఆదేశాలు జారీ చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
► కందుల సేకరణకు గడువు పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ ద్వారా మార్చి నెలాఖరు వరకు కందుల సేకరణకు గడువు పొడిగిస్తూ భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ఆదేశాలు జారీ చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు శనివారం హరీశ్‌రావు లేఖ రాశారు.
‘రాష్ట్రంలో ప్రకృతి సహకరించక రైతులు వరి వంటి సంప్రదాయక పంటల సాగును వదిలి పత్తి, మొక్కజొన్న, కందులు తదితర వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ధరల స్థిరీకరణ నిధి నుంచి.. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కందులు సేకరించాలని కేంద్రం ఆదేశించింది’ అని లేఖలో పేర్కొన్నారు. ‘దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నాఫెడ్ ద్వారా 3,490 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ ద్వారా 7,400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఆరంభంలో తెలంగాణలో 5వేల మెట్రిక్ టన్నుల కందుల సేకరణను లక్ష్యంగా విధించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కంది సాగు విస్తీర్ణం లేకపోవడంతో.. ఆ రాష్ట్రానికి చెందిన లక్ష్యాన్ని కూడా తెలంగాణకు కలిపారు. దీంతో రైతులకు మేలు జరగ్గా.. దళారీ వ్యవస్థకు చరమగీతం పాడగలిగాం’ అని హరీశ్ పేర్కొన్నారు.
అయితే కందుల కొనుగోలు నిలిపివేయాలంటూ తెలంగాణ మార్క్‌ఫెడ్‌కు ఎఫ్‌సీఐ ఆదేశాలు జారీ చేయడంతో ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఇంకా రైతుల వద్దే 4వేల మెట్రిక్ టన్నుల మేర కందులు ఉన్నాయన్నారు. ఎఫ్‌సీఐ నిర్ణయంతో రైతులు నష్టపోయే ప్రమాదముందని, రైతుల నుంచి కందుల కొనుగోలుకు వీలుగా ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మరో 4వేల మెట్రిక్ టన్నుల కందుల సేకరణకు వీలుగా గడువు పెంచాలన్నారు.
తడిసిన కందుల కొనుగోలు: శుక్రవారం కురిసిన వర్షాల మూలంగా ఆదిలాబాద్ జిల్లా లో తడిసిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్‌రావు మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. కందుల కొనుగోలు విషయంలో ఎఫ్‌సీఐ ఆదేశాలపై కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. కందుల కొనుగోలు జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని టీఆర్‌ఎస్ ఎంపీలతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు.