
పాతబస్తీ సమస్యలతో కుస్తీ
ఒకవైపు నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర.. చారిత్రాత్మక కట్టడాలతో ప్రసిద్ధి.. మరోవైపు అధ్వాన రోడ్లు.. పారిశుధ్య లేమి..
- పాతనగరాభివృద్ధి పట్టదా..?
- నిజాం నాటి మంచినీటి, డ్రైనేజి వ్యవస్థ
- కనీస సదుపాయలూ కరువు
- అంతా అపరిశుభ్రతే..
- రవాణా సౌకర్యం అంతంతే
సాక్షి, సిటీబ్యూరో/ఓల్డ్‌సిటీ, న్యూస్‌లైన్ : ఒకవైపు నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర.. చారిత్రాత్మక కట్టడాలతో ప్రసిద్ధి.. మరోవైపు అధ్వాన రోడ్లు.. పారిశుధ్య లేమి.. పురాతన డ్రైనేజీ వ్యవస్థ.. అంతంత మాత్రంగా ఉన్న విద్య, వైద్య, రవాణా సదుపాయాలు.. వెరసి ఇదీ హైదరాబాద్ పాతనగరం. నిజాం పరిపాలన పరిసమాప్తమైన తర్వాత పాలకులు కొత్త నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ఎంత శ్రద్ధ వహించారో .. పాతనగర అభివృద్ధిని అంత నిర్లక్ష్యం చేశారు.
ఫలితం.. పాతబస్తీ వెనకబాటుతనంతో కునారిల్లుతోంది. ఇప్పటికీ ఇక్కడ నిజాం కాలం నాటి మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థే కొనసాగుతోంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం నిజాం నిర్మించిన భవనాల్లోనే కొనసాగుతుండటం విశేషం. కనీసం పాతనగరవాసుల జీవనవిధానం, ఆర్థిక పరిస్థితిలో సైతం మార్పు రాలేదు. రెక్కాడితే కాని.. డొక్కాడని పరిస్థితులు.. ఉపాధి కోసం ఖండాంతరాలు దాటి పోవాల్సిన దుస్థితి.. పేదరికంతో ఆడ పిల్లలకు కట్నాలు ఇవ్వలేక గల్ఫ్ షేక్‌లకు అంటగడుతున్న దైన్య స్థితి తాండవిస్తుంది. ఁఎన్నాళ్లీ నిర్లక్ష్యం..? ఇంకెన్నాళ్లీ వెనకబాటుతనం..?* అంటూ పాతబస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదే ఈసారి ఎన్నికల్లో ఓల్ట్ సిటీజనుల ప్రధాన ఎజెండా కానుంది. ఓట్లు అడిగేందుకు వచ్చేవారిని గ ట్టిగా నిలదీసేందుకు వారంతా సిద్ధమవుతున్నారు.
పడకేసిన అభివృద్ధి
దేశంలోని అనేక పాత నగరాలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నా.. పాతబస్తీలో మాత్రం అభివృద్ధి పడకేసింది. ఇప్పటికీ నిజాం కాలంలో జరిగినా పనులు తప్ప కొత్తవి ఇక్కడ కానరావడం లేదు. పాతబస్తీలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నప్పటికీ.. సిబ్బంది కొరత. అందుబాటులో లేని మందులు, రోగులకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. పలు ఆసుపత్రి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు ఐదు నియోజకవర్గాల పరిధిలో గల పాతబస్తీలో కేవలం రెండే పెద్దాసుపత్రులు ఉన్నాయి.
అయినా ఇక్కడ అధునాతన పరికరాలు అందుబాటులో ఉండవు. పలు సందర్భాల్లో సమయానికి వైద్యం అందక గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, ప్రమాదాల్లో గాయపడిన వారు మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రవాణా సౌకర్యం కూడా అంతంతే...పాతబస్తీలో లక్షల మంది ప్రతి రోజు ఒక ప్రాంతం మరో ప్రాంతానికి ఉద్యోగం, వైద్య, విద్య, వ్యాపారం కోసం ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. కానీ పాతబస్తీలో కేవలం ఒకే ఒక బస్సు డిపో ఉంది. ఈ వివక్షపై ఇక్కడివారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత నాలుగేళ్లలో మరింత వెనక్కి..
పాతబస్తీ అభివృద్ధి కంటూ ప్రతిపాదనలెన్నున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. గత నాలుగేళ్లుగా ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో పాతబస్తీ అభివృద్ధి అటకెక్కింది. గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కులీకుతుబ్‌షా నగరాభివృద్ధి సంస్థ (కుడా) అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి గాలికి వదిలేశారు. ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడంతో ఁకుడా* భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పాతబస్తీలోని మలక్‌పేట్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా తదితర నియోజకవర్గాల్లోని అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కాయి.
పేదరికంపై వడ్డీవ్యాపారుల స్వారీ
పాతబస్తీ పేదలు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి నలిగిపోతున్నారు. వీరు పేదల అవసరాలను వడ్డీ వ్యాపారంతో సొమ్ము చేసుకుంటున్నారు. ఏ రోజుకారోజు వ్యాపారానికి కాస్త పెట్టుబడి అవసరం. కుటుంబంలో శుభకార్యానికైనా, ఆపద వచ్చినా.. అనారోగ్యం పాలైనా ప్రయివేటు ఫైనాన్సర్ల(వడ్డీ వ్యాపారులు)ను ఆశ్రయించాల్సిందే. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవాలంటే హామీ పెట్టేందుకు ఆస్తులు ఉండవు. ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలన్నా ప్రభుత్వ ఉద్యోగుల హామీ దొరికే అవకాశం లేదు. ప్రజల అవసర అవసరాన్ని బట్టి వడ్డీ శాతాన్ని పెంచి డబ్బునిస్తారు. అవసరానికి పది వేల రూపాయలు తీసుకుంటే ఆ తర్వాత సంవత్సరాలు గడిచినా అసలు మాత్రం తీరదు. ఆ అప్పు చివరకు వడ్డీపై వడ్డీ పెరిగి అదో విషవలయంలా మారుతుంది. బ్యాంకులు ఇక్కడివారికి ఎప్పుడు సహకరిస్తాయి. వడ్డీవ్యాపారుల నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తోంది.
వీడని నిరక్షరాస్యత
పాతనగరంలో నిరక్ష్యరాస్యత తాండవిస్తోంది. మొత్తం జనాభాలో 72 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువనే జీవిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం అవిద్యే. 5-9 ఏళ్ల పిల్లల్లో 68 శాతం మాత్రమే పాఠశాలలకు వెళుతున్నారు. మధ్యలో విద్యను మానేస్తున్న పిల్లల జాబితాల్లో కూడా పాతబస్తీ పిల్లలే అధికం. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోలేకపోవడానికి ఆర్థిక వెనుకబాటే కారణం. ప్రభుత్వ పాఠశాలల్లో అంతంత మాత్రం చదువులు. కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రల స్తోమత సరిపోదు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు 10 ఏళ్ల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు లక్షల సంఖ్యలో కొత్త నగరానికి వెళ్లి చిన్న చితాకా ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోదగిన పరిశ్రమలు, కంపెనీలు, మాల్స్, పెద్ద ఆసుపత్రులు, కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేటు సంస్థలు లేవు. అందుకే ప్రజలు ఉపాధి కోసం కొత్త నగరానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు రాదా అని ఇక్కడి వారు ప్రశ్నిస్తున్నారు.
అభివృద్ధి వైఎస్సార్ చలువే
నిజాం కాలం తర్వాత పాతబస్తీ అభివృద్ధిపై శ్రద్ధ చూపించింది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డే. వైఎస్సార్ తన హయాంలో హైదరాబాద్‌లోని పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద సుమారు రూ.2024.65 కోట్లను మంజూరు చేశారు. పాతబస్తీలో మౌలిక సదుపాయల కల్పనతో పాటు రోడ్లు, నీటిసరఫరా, డైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు, స్కూల్లు, కమ్యూనిటీ హాళ్లు, నీటి ట్యాంకులు, షాదీఖానాలు, మసీదులు, ఆషూర్ ఖానాల మరమ్మతులతో పాటు నిజాంకాలం వ్యవస్థను పూర్తిగా రీమోడలింగ్ చేయించారు.
ఫలితంగా మీరాలం సీవరేజ్ ప్లాంట్ నిర్మాణం, చందులాల్ బారాదరి, కాటేదాన్, రియాసత్ నగర్, మిధానిల్లో స్పోర్ట్స్ కాంపెక్ల్స్, ఇమ్లీబన్ పార్క్, ఫలక్‌నుమా సిటీ బస్ టెర్మినల్, చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ తదితర నిర్మాణాలు పూర్తయ్యాయి. ముస్లిం విద్యార్థుల కోసం సీబీఎస్‌ఈ సిలబస్‌తో దక్షణ భారత దేశంలోనే ప్రప్రథమంగా మౌలానా ఆజాద్ మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. మసీదుల ఇమామ్‌లుగా సేవలందిస్తున్న వారికి నెలవారీగా వేతనాలిచ్చే ప్రక్రియను ప్రారంభించారు.
మాజీ సైనికుల నివాస గృహాలు, 40 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కొల్ట్‌స్టోరేజీ, స్లాటర్ హౌస్ సమస్యలను వైఎస్సార్ పరిష్కరించగలిగారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాల వర్తింపుతో ఆర్ధిక స్థితిగతుల్లో కాస్త మార్పు వచ్చింది. అభివృద్ధి ప్రదాత వైఎస్సార్ మరణాన ంతరం ఆయన మంజూరు చేసిన నిధులు నిలిచిపోవడంతో పాతబస్తీ అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రిజర్వేషన్లు ఇచ్చిన ఘనతా ఆయనదే..
పాతబస్తీలోని ముస్లిం మైనార్టీలు అంతో ఇంతో ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా నిలదొక్కుకున్నారంటే.. ఆ ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌దే. ముస్లింలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. ముస్లిం మాతృభాష ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం, ఉర్దూఘర్ నిర్మాణం తదితర కార్యక్రమాలన్నీ ఆయన చలవే.
మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, ఫీజు రియంబర్స్‌మెంట్ వర్తింపజేయడంతో పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా పేద ముస్లిం యువతుల సామూహిక వివాహాలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. ముస్లిం వితంతువులకు పెన్షన్ సౌకర్యం కల్పించారు. మైనార్టీ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశారు.