ఇక ‘మీ సేవలు’ చాలు

Mee seva Notifications Are Cancelled In Telangana - Sakshi

కొత్త మీ సేవ నోటిఫికేషన్లు రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఉన్నవాటికే నిర్వహణ వ్యయం రాకపోవడంతో ఈ నిర్ణయం 

కలెక్టర్లకు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని జిల్లాల్లో అడ్డగోలుగా కొత్త కేంద్రాలకు అనుమతులివ్వడాన్ని తప్పుబట్టిన సర్కారు.. ఇప్పటికే జారీచేసిన నోటిఫికేషన్లను రద్దుచేయాలని ఆదేశించింది. ఇకపై ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటులో నిర్దిష్ట మార్గదర్శకాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే కొత్త నిబంధనలు వెలువరించనున్నట్లు వెల్లడించింది. మొబైల్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ–సేవల వినియోగంపై ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ‘మీ సేవ’కేంద్రాల కొనసాగింపును కూడా సమీక్షించాల్సిన పరిస్థితి రావచ్చని అభిప్రాయపడింది. ఈ అంశాలను పరిగణనలోకి ఉంచుకొని కొత్త సెంటర్ల ఏర్పాటుపై అచితూచి అడుగేయాలని సూచించింది. గతేడాది భద్రాద్రి–కొత్తగూడెం.. తాజాగా మేడ్చల్‌ జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీచేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇకపై అలా జరగడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు.

రోజుకు లక్షన్నర సేవలు 
జనన, మరణ ధ్రువపత్రాలు, మ్యుటేషన్లు, పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఏం కావాలన్నా ‘మీ సేవ’గడప తొక్కాల్సిందే. ఇలా దాదాపు 500 ఎలక్ట్రానిక్‌ సేవలందిస్తున్న మీ–సేవ కేంద్రాల్లో ప్రతిరోజు సగటున లక్షన్నర లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా రెవెన్యూశాఖకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో మీ–సేవ కేంద్రాలు ప్రారంభించిన గత ఎనిమిదేళ్లలో ఇప్పటివరకు 12.50 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,500 పైచిలుకు కేంద్రాలు పనిచేస్తుండగా.. ఇందులో 85% సెంటర్లలో నెలవారీ ఆదాయం రూ.10వేల లోపే ఉంటుంది. ఈ పరిణామం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ కూడా కష్టంగా మారడానికి ప్రధాన కారణం ప్రభుత్వ శాఖలు ఆన్‌సేవలు విస్తరించడమే. పోలీస్, ట్రాఫిక్, ఇతర ప్రభుత్వ విభాగాలు తమ సేవలను ఈ సేవలతోపాటు సొంతంగా ఏర్పాటు చేస్తున్న పోర్టల్‌ ద్వారా అందుబాటులోకి తెస్తున్నాయి. తద్వారా మీ–సేవ కేంద్రాల్లో లావాదేవీల సంఖ్య తగ్గుతోంది. దీంతో ఇప్పటికే లాభదాయంగాని సెంటర్లను నెట్టుకొస్తున్న నిర్వాహకులకు కొత్తగా ఏర్పాటు చేసే వాటితో మరింత నష్టం జరగనుంది. 

మేడ్చల్‌లో రెట్టింపు కేంద్రాలు
గతేడాది భద్రాద్రి జిల్లాలో 5వేల జనాభా, దూరాన్ని బట్టి కొత్తగా 53 మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు ఆ జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. నిర్వాహకుల గిట్టుబాటును పరిగణనలోకి తీసుకోకుండా ఎడాపెడా కొత్తవాటికి అనుమతి ఇవ్వడం సరికాదని అన్ని జిల్లాల యంత్రాంగాలను ప్రభుత్వం హెచ్చరించినా.. తాజాగా మేడ్చల్‌ జిల్లాలో ఏకంగా 219 కొత్త కేంద్రాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో సర్కారు సీరియస్‌ అయింది. దూరాన్ని కూడా పట్టించుకోకుండా 5వేల జనాభా ఆధారంగా గల్లీకో కేంద్రం ఉండేలా నోటిఫికేషన్‌లు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇప్పటికే జిల్లాలో 297 కేంద్రాలుండగా.. తాజాగా దాదాపుగా అదే స్థాయిలో కొత్త కేంద్రాలకు పచ్చజెండా ఊపడంతో సమస్య తెరపైకి వచ్చింది. ఇలా అడ్డగోలు వ్యవహారాలకు తావివ్వకుండా ఇకపై నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేసింది. మొబైల్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ సేవల విస్తృతితో మీ–సేవల్లో తరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇదే ట్రెండ్‌ కొనసాగితే.. ప్రస్తుతం ఉన్నవాటినే కుదించే పరిస్థితి రావచ్చు. ఈ ధోరణిని పరిగణనలోకి తీసుకొని త్వరలోనే కొత్త మార్గదర్శకాలను ప్రకటించనున్నట్లు కలెక్టర్లకు రాసిన లేఖలో జయేశ్‌రంజన్‌ పేర్కొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top